Share News

గ్రానైట్‌ కటింగ్‌ ఫ్యాక్టరీలు షట్‌డౌన్‌ !

ABN , Publish Date - Sep 30 , 2025 | 11:15 PM

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గెలాక్సీ గ్రానైట్‌ అనుబంధ పరిశ్రమగా విరాజిల్లుతున్న గ్రానైట్‌ కటింగ్‌, పాలిషింగ్‌ ఫ్యాక్టరీలు బుధవారం నుంచి మూతవేయనున్నారు. సీనరేజీ వసూలు ప్రైవేటీకరణ చేసిన నేపథ్యంలో పరిశ్రమ మనుగడ కోల్పోయే పరిస్థితి ఉత్పన్నం అవుతుందన్న ఆందోళనలో ఉన్న ఓనర్లు మంగళవారం రామతీర్థం వద్ద ఉన్న వీటీసీలో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు.

గ్రానైట్‌ కటింగ్‌ ఫ్యాక్టరీలు షట్‌డౌన్‌ !
మాట్లాడుతున్న అసోసియేషన్‌ నాయకులు కాట్రగడ్డ రమణయ్య

ఓనర్ల అత్యవసర సమావేశంలో ఏకగ్రీవ నిర్ణయం

సీనరేజి వసూలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన గళం

ఏఎంఆర్‌ సంస్థ తీరుపై ఆక్షేపణలు

నేటి నుంచి ఫ్యాక్టరీల మూత

వైసీపీ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న ఓనర్లు రెచ్చగొట్టే ఽధోరణి

ప్రభుత్వ సానుకూలతతో సమస్య పరిష్కరించుకోవాలని మెజారిటీ యజమానుల నిర్ణయం

చీమకుర్తి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి) : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గెలాక్సీ గ్రానైట్‌ అనుబంధ పరిశ్రమగా విరాజిల్లుతున్న గ్రానైట్‌ కటింగ్‌, పాలిషింగ్‌ ఫ్యాక్టరీలు బుధవారం నుంచి మూతవేయనున్నారు. సీనరేజీ వసూలు ప్రైవేటీకరణ చేసిన నేపథ్యంలో పరిశ్రమ మనుగడ కోల్పోయే పరిస్థితి ఉత్పన్నం అవుతుందన్న ఆందోళనలో ఉన్న ఓనర్లు మంగళవారం రామతీర్థం వద్ద ఉన్న వీటీసీలో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మెజారిటీ ఓనర్లు ఫ్యాక్టరీలు మనుగడకు మూసివేతే పరిష్కార మార్గమంటూ మొగ్గటంతో అసోసియేషన్‌ నాయకులు ప్రవేశపెట్టిన తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. సీనరేజీ వసూలు హక్కులు పొందిన ఏఎంఆర్‌ సంస్థ ఇంకా రంగంలోకి రాకుండానే త మ పట్ల బెదిరింపు ధోరణిని అవలంబిస్తూ శ్లాబ్‌ సిస్టంలో ప్రభుత్వానికి చెల్లించే రాయల్టీతో సంబంధం లేకుండా అదనంగా తమకు చెల్లించాలని డిమాండ్‌ చేస్తుండటం కటింగ్‌ ఫ్యాక్టరీల మనుగడను దెబ్బతీసేవిధంగా ఉందన్న ఆందోళన ఓనర్లు వ్యక్తం చేశారు.

వైసీపీ అనుకూల ఓనర్ల అత్యుత్సాహంతో..

సమావేశం ప్రారంభమైన తర్వాత నాయకులు ఒక్కొక్కరుగా ప్రసంగిస్తూ సాధకబాధలు తెలుపుకుంటూ సమస్య పరిష్కారానికి ఏమి చేయాలని హాజరైన ఓనర్ల అభిప్రాయాలను అడిగారు. గతంలో ఎన్నడూ అసోసియేషన్‌ సమావేశానికి హాజరుకాని వైసీపీ అనుకూల ఓనర్లు వ్యూహాత్మకంగా కలిసికట్టుగా వచ్చి ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేవిధంగా ప్రసంగించారు. రోడ్డెక్కి భారీగా నిరసనలు తెలిపి ప్రభుత్వంతో పోరాట వైఖరిని అవలంభించాలని పిలుపునిచ్చారు. ఈ దశలో జోక్యం చేసుకున్న అసోసియేషన్‌ నాయకులు కాట్రగడ్డ రమణయ్య వారి తీరును గర్హించారు. ప్రభుత్వంతో సానుకూలంగా వ్యవహరించి తమ సమస్యను పరిష్కరించుకుందామని అనటంతో హాజరైన ఓనర్లలో ఎక్కువమంది సానుకూలత వ్యక్తం చేశారు. తమ నిరసన తెలియచేస్తూ అక్టోబరు నెలలో శ్లాబ్‌ సిస్టంలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీని చెల్లించకూడదని, పక్కాగా ఫ్యాక్టరీలను మూసివేసి తమ నిరసన తెలియచేద్దామని, ఏఎంఆర్‌ సంస్థ దిగివచ్చి ప్రభుత్వ నిబంధనల మేరకు రాయల్టీ వసూలు చేసేవిధంగా ప్రజాప్రతినిధులను కలిసి వినతి పత్రాలు అందచేయటం ద్వారా ఒత్తిడి తీసుకువద్దామని తీర్మానించారు. చీమకుర్తి, బూదవాడ, మర్రిచెట్లపాలెం, ఏలూరురోడ్డులో దాదాపు 700 గ్రానైట్‌ కటింగ్‌ ఫ్యాక్టరీలు ఉండగా దాదాపు ఓనర్లందరూ హాజరయ్యారు. వీరి నిరసన గళం ఎటువైపు దారితీస్తుందో వేచిచూడాల్సి ఉంది. సమావేశంలో కాట్రగడ్డ రమణయ్య, లగడపాటి శ్రీనివాసరావు, మలినేని వెంకటేశ్వర్లు, యర్రగుంట్ల శ్రీనివాసరావు, గోగినేని నాగయ్య, గోగినేని శ్రీనివాసరావు, బొమ్మిశెట్టి మధుసూదనరావు, నూకల సురేంద్ర, మన్నం శ్రీధర్‌, చిన్పపురెడ్డి మస్తాన్‌రెడ్డి, క్రిస్టిపాటి శేఖరరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Sep 30 , 2025 | 11:15 PM