‘దేవా’ంతకులు
ABN , Publish Date - Aug 05 , 2025 | 01:23 AM
ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో దేవాలయాల ఆస్తులకు రక్షణ కరువైంది. వందల ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయి. వీటిలో పాగా వేసిన వారు ఏళ్ల తరబడి దర్జాగా పంటలు సాగు చేసుకుంటున్నారు.
యథేచ్ఛగా ఆలయ భూముల ఆక్రమణ
దర్జాగా పంటల సాగు
ఏళ్లుగా అనుభవిస్తున్న కబ్జారాయుళ్లు
కొన్నిచోట్ల వివరాలు కూడా తెలియని వైనం
అనేక గ్రామాల్లో దీనావస్థలో గుడులు
త్రిపురాంతకం, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి) : ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో దేవాలయాల ఆస్తులకు రక్షణ కరువైంది. వందల ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయి. వీటిలో పాగా వేసిన వారు ఏళ్ల తరబడి దర్జాగా పంటలు సాగు చేసుకుంటున్నారు. ఆలయాలకు పైసా కౌలు చెల్లించకుండా సొంత భూములుగా వాడుకుంటున్నారు. దీంతో రూ.కోట్ల ఆస్తులున్న ఆలయాలు కూడా ఆలనాపాలనా కరువై దీనావస్థకు చేరుకుంటున్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం మౌనం వహిస్తున్నారు. ఆక్రమణదారుల నుంచి అమ్యామ్యాలు పుచ్చుకుని మిన్నకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కబ్జాదారుల్లో కొందరు ఏకంగా ఆ భూములు తమవే అంటూ కోర్టులను ఆశ్రయిస్తుండగా వాటిపై మేమేమి చర్యలు తీసుకుంటామని దేవదాయశాఖ అధికారులు సమాధానం దాటవేస్తున్నారు.
ఆలయ భూముల్లో బత్తాయి మొక్కలు, కంది సాగు
ఎర్రగొండపాలెం మండలం వెంకటాద్రిపాలెం గ్రామంలో ఉన్న లక్ష్మీచెన్నకేశవ దేవస్థానానికి పెద్దారవీడు మండలంలోని కంభంపాడు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 35లో 4.31 ఎకరాల భూమి ఉంది. అందులో కొందరు పాగా వేశారు. బత్తాయి మొక్కలు నాటి కంది పైరును సాగు చేసుకుంటున్నారు. దీనిపై పలుమార్లు కొందరు ఫిర్యాదులు చేసినప్పటికీ ఈ భూముల వ్యవహారం కోర్టులో ఉన్నందున అక్కడే తేలాలని దేవదాయశాఖ అధికారులు చెప్తున్నారు. ఇది దేవదాయశాఖకు చెందిన భూమిగానే ప్రస్తుతం కూడా రెవెన్యూ అడంగల్‌లో ఉంది. అయితే కొందరు వ్యక్తులు ఈ భూమిని 1950లోనే తమకు అప్పట్లో పూజారి విక్రయించారని రికార్డులు చూపి కోర్టును ఆశ్రయించడంతో ఇప్పటికీ ఆ వివాదం నడుస్తూనే ఉంది. ఎర్రగొండపాలెం మండలంలోని మిల్లంపల్లి వేణుగోపాలస్వామి దేవాలయానికి కూడా దాదాపు 90 ఎకరాల భూమి ఉంది. దీనికి నామమాత్రపు శిస్తు చెల్లిస్తూ కొందరు సాగు చేసుకుంటున్నారు. కొంత భూమికి పలువురు వేలం నిర్వహణకు కూడా ఆటంకాలు సృష్టిస్తూ ఎలాంటి కౌలు చెల్లించకుండా పంటలు సాగు చేసుకుంటున్నారు.
48 ఎకరాలు ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి!
దేవదాయశాఖ పరిధిలో లేకుండా ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో నడుస్తున్న ఆలయాలకు ఉన్న భూములు కూడా అధికంగానే అన్యాక్రాంతమయ్యాయి. పుల్లలచెరువు మండలంలోని శతకోడు సప్త కోటీశ్వరాలయంతోపాటు పలు ఆలయాలకు సంబంధించి దాదాపు 48 ఎకరాల భూమి ఎక్కడ ఎవరి పరిధిలో ఉందో కూడా తెలియని పరిస్థితి. ఎర్రగొండపాలెం మండలంలో దాదాపు మొత్తం 900 ఎకరాలకు పైగా ఆలయ భూములు ఉంటే వాటిపై వచ్చే శిస్తుతో దూపదీప నైవేద్యాలు దేవునికి అందాల్సింది పోయి చాలా ఆలయాలు దీనావస్థకు చేరుకున్నాయి. పుల్లలచెరువు మండలంలో కూడా ఆలయాలకు సంబంధించిన భూములు ఉన్నప్పటికీ వాటి గురించి కనీసం భక్తులకు కూడా అవగాహన లేకపోవడంతో కొందరు ప్రైవేటు వ్యక్తులు ఇష్టానుసారంగా భూముల్లో పాగా వేసి పెత్తనం చెలాయిస్తున్నారు.
ప్రభుత్వం చర్యలు తీసుకున్నా ఆగని ఆక్రమణలు
గతంలో ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించిన సమయంలో దేవదాయశాఖ పరిధిలోనివితోపాటు ప్రైవేటు ఆలయాల భూముల వివరాలు లెక్క తేల్చి వాటిని దేవాలయం పేరుతో ఆన్‌లైన్ చేయించింది. ఆ భూములను కాపాడేందుకు ప్రత్యేకంగా అధికారిని నియమించింది. దాదాపు రికార్డుల్లో చాలా వరకు ఆలయ భూములను నమోదు చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ప్రైవేటు వ్యక్తులు అనుభవంలో ఉంటున్నారు. ఇప్పటికైనా ఆలయాల భూములను గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకొని వాటిపై వచ్చే ఆదాయంతో దేవాలయాల్లో ధూపదీప నైవేద్యం పెడుతూ ఆలయాల అభివృద్ధికి కృషి చేయాలని భక్తులు కోరతున్నారు.