Share News

విద్యారంగ బలోపేతానికి ప్రభుత్వం కృషి

ABN , Publish Date - Jul 10 , 2025 | 10:57 PM

విద్యార్థుల సంపూర్ణ వికాసం, సంస్కారం అలవరుస్తూనే విద్యారంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రభుత్తం కృషి చేస్తోందని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ రోణంకి గోపాలకృష్ణ చెప్పారు.

విద్యారంగ బలోపేతానికి ప్రభుత్వం కృషి
విద్యార్థులతో జేసీ గోపాలకృష్ణ, ఉపాధ్యాయులు

నాణ్యమైన పుస్తకాలు, యూనిఫాంతోపాటు సన్నబియ్యంతో భోజనం

ఇన్‌చార్జి కలెక్టర్‌ గోపాలకృష్ణ

కొత్తపట్నం, జూలై 10 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల సంపూర్ణ వికాసం, సంస్కారం అలవరుస్తూనే విద్యారంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రభుత్తం కృషి చేస్తోందని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ రోణంకి గోపాలకృష్ణ చెప్పారు. మండలంలోని ఈతముక్కల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో గురువారం జరిగిన మెగా పేరెంట్‌ టీచర్స్‌ మీట్‌ 2.0 కార్యక్రమంలో ఆయన ముఖ్యఅథిగా పాల్గొన్నారు. ముందుగా పాఠశాల ఆవరణలోని సరస్వతీ విగ్రహానికి పూలమాలవేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆవరణలో మొక్కలు నాటారు. పేరెంట్‌-స్టూడెంట్‌ కోసం ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్‌లో ఆయన ఫొటో దిగారు. అనంతరం జరిగిన ఆత్మీయ సమావేశంలో గోపాలకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు పుస్తకాలు, యూనిఫాంతోపాటు సన్నబియ్యంతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని కూడా వండి వడ్డిస్తున్నట్లు చెప్పారు. తాను కూడా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు ప్రభుత్వ పాఠశాల, కాలేజీలోనే చదువుకున్నానన్నారు. పాఠశాల స్థాయిలో ఉన్నప్పుడు రోజు ఐదు కిలోమీటర్లు నడిచి వెళ్లేవాడినని ఆయన గర్తు చేశారు. గతంతో పోల్చిచూస్తే ప్రస్తుత పరిస్థితులు ఎంతో మెరుగ్గా ఉన్నట్లు చెప్పారు. ఎలాంటి బంధుత్వం లేకపోయినా విద్యార్థుల ఉన్నతిని ఆశించేది గురువులేనన్నారు. చరిత్రలో మీకంటూ ఒక పేజీ ఉండేలా మీ జీవితాలను మీరే తీర్చిదిద్దుకోవాలని కలెక్టర్‌ చెప్పారు. గతవిద్యాసంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన ఆకురాతి గీతిక, ఆమె తల్లిదండ్రులను కలెక్టర్‌ సన్మానించారు. ఈ కార్యక్రమంలో కొత్తపట్నం మండల ప్రత్యేక అధికారి, జిల్లా పంచాయతీ అధికారి వెంకట నాయుడు, ప్రధానోపాధ్యాయుడు చెంచుపున్నయ్య, తహసీల్దార్‌ కె.శాంతి, డిప్యూటీ ఎంపీడీవో గోపాలక్రిష్ణమూర్తి, ఎంఈవో పద్మావతి, స్కూలు మేనేజ్‌మెంటు కమిటీ చైౖర్మన్‌ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - Jul 10 , 2025 | 10:57 PM