Share News

పొగాకు రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది

ABN , Publish Date - May 24 , 2025 | 10:41 PM

ప్రభుత్వం రైతులను అన్ని విధాలా ఆదుకుంటుందని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. శనివారం పొగాకుబోర్డును ఆయన సందర్శించి, ధరలపై రైతులతో మాట్లాడి తెలుసుకున్నారు. ప్రస్తుతం పొగాకు బోర్డ్‌లో ఉన్న సంక్షోభాన్ని నివారించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు పొగాకుబోర్డ్‌కు వచ్చినట్లు కందుల తెలిపారు.

పొగాకు రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది
బోర్డ్‌లో పొగాకును పరిశీలిస్తున్న ఎమ్మెల్యే నారాయణరెడ్డి

ఎమ్మెల్యే నారాయణరెడ్డి

పొదిలి, మే 24 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం రైతులను అన్ని విధాలా ఆదుకుంటుందని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. శనివారం పొగాకుబోర్డును ఆయన సందర్శించి, ధరలపై రైతులతో మాట్లాడి తెలుసుకున్నారు. ప్రస్తుతం పొగాకు బోర్డ్‌లో ఉన్న సంక్షోభాన్ని నివారించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు పొగాకుబోర్డ్‌కు వచ్చినట్లు కందుల తెలిపారు. గిట్టుబాటు ధర లేదని అన్ని విధాలా ఇబ్బందులుపడుతున్నామని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. గతంలో కిలో పొగా కు ప్రారంభ ధర రూ.230 నుంచి రూ.300 ఉండేదని, ప్రస్తుతం రూ.280 ఇచ్చి రానురాను రూ.200, రూ.220కి తీసుకొచ్చారని తెలిపారు. గత ఏడాది లోగ్రేడ్‌ ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేశారని ప్రస్తుతం లోగ్రేడ్‌ను కొనుగోలు చేయకపోవడంతో బోర్డ్‌కు తెచ్చి తిరిగి వెనక్కి తీసుకెళ్తున్నామని రైతులు తెలిపారు. అసలు ధర లేకపోవడానికి గల కారణాలను వేలం నిర్వహణాధికారి గిరిరాజ్‌కుమార్‌తోపాటు కంపెనీ కొనుగోలు దారులను అడిగి తెలుసుకున్నారు. రైతుల సమస్యలు విన్న ఆయన కొనుగోలు దారులైన 11 కంపెనీ ప్రతినిధులతో ఫోన్‌లో మాట్లాడారు. పొగాకు రైతులకు తప్పకుండా గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. స్పందించిన కంపెనీ ప్రతినిధులు సోమవారం నుంచి ధరల పెరుగుదలకు సహకరిస్తామని చెప్పినట్లు ఆయన చెప్పారు. లోగ్రేడ్‌ పొగాకు కొనుగోలు చేయరన్న భయంలో రైతులు ఉన్నారని పర్సంటేజీనని పెంచి అన్ని రకాలు కొనుగోలు చేయాలని కోరినట్లు ఆయన చెప్పారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, న్యాయం చేస్తామని ఎమ్మెల్యే కందుల భరోసా ఇచ్చారు. ఈ ప్రాంతంలో 11 మిలియన్‌ల పొగాకు కొనుగోలుకు మాత్రమే అనుమతి ఉందన్నారు. అయితే 18 మిలియన్‌ల పొగాకు పండించినట్లు చెప్పారు. మొత్తం కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరో వచ్చి చెప్పే మాయమాటలు విని ఆందోళన చెందవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. సోమవారం నుంచి కొనుగోలు చర్యలు చేపడతారని అన్నారు. కార్యక్రమంలో రైతు సంఘ నాయకులు, రైతులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2025 | 10:41 PM