పశుగణాభివృద్ధికి ప్రభుత్వం చేయూత
ABN , Publish Date - Dec 04 , 2025 | 11:28 PM
పశుగణాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక పథకాలను అమలు చేస్తూ పాడి రైతులకు చేయూత అందిస్తోందని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు.
ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి
కనిగిరి, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి) : పశుగణాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక పథకాలను అమలు చేస్తూ పాడి రైతులకు చేయూత అందిస్తోందని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు. మండల పరిధిలోని తాళ్లూరు గ్రామంలో గురువారం గోకులం షెడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా కనిగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో 6 కోట్ల 28 లక్షల రూపాయల వ్యయంతో 314 గోకులం షెడ్ల ఏర్పాటుకు రైతులకు సబ్సిడీపై రుణాలు అందిస్తున్నట్లు చెప్పారు. రైతులు పాడి పరిశ్రమ ద్వారా ఆర్థిక పురోగతి చెందాలనే సంకల్పంతో ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉపాధిహామీ పథకం కార్యాలయంలో పాడి రైతులు తమ పేర్లను నమోదు చేసుకుని రుణాలు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు కొండా కృష్ణారెడ్డి, మండల పార్టీ కన్వీనర్ పిచ్చాల శ్రీనివాసలురెడ్డి, ముచ్చుమూరి చెంచిరెడ్డి, బాలు ఓబులురెడ్డి, గంగవరపు నాగిరెడ్డి, గాయం తిరుపతిరెడ్డి, నారపరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సుపరిపాలనకు అధికారులు సహకరించాలి
నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ప్రజలకు సత్వర సుపరిపాలనే లక్ష్యంగా తాను చేస్తున్న కృషికి ప్రభుత్వాధికారులు సహకారాన్ని అందించాలని ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి కోరారు. ఇటీవల ఉపాధి హామీ పథకం కార్యాలయాన్ని ఆధునికీకరించి డీఎల్‌డీవో కార్యాలయంగా రూపుదిద్దారు. గురువారం ఆయా కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేద మంత్రోచ్ఛరణలతో స్వాగతం పలికారు. డీఎల్‌డీవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కేశవర్దన్‌రెడ్డి, తహసీల్దార్ జయలక్ష్మీ, ఎంపీడీవో అబ్దుల్ ఖాదర్, జడ్పీటీసీ సభ్యుడు కస్తూరిరెడ్డి, ఎంపీపీ ప్రకాశం పాల్గొన్నారు.