Share News

ప్రభుత్వ భూమి హాంఫట్‌

ABN , Publish Date - Jul 19 , 2025 | 01:58 AM

మండలంలోని కలుజువ్వలపాడులో యథేచ్ఛగా ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారు. ఈ భూములు కర్నూలు, ఒంగోలు జాతీయ రహదారి పక్కన ఉండటంతో ధరలకు రెక్కలు వచ్చాయి. ఎకరా దాదాపు రూ.కోటి పలుకుతోంది.

ప్రభుత్వ భూమి హాంఫట్‌
కలుజువ్వలపాడులో వైసీపీ నేత ఆక్రమించి అమ్మిన ప్రభుత్వ భూమి

ఆక్రమించి విక్రయించిన వైసీపీ నేత

భారీగా సొమ్ము చేసుకున్న వైనం

చదునుచేసి రాళ్లు పాతేందుకు కొనుగోలుదారుడి యత్నం

నిలదీసిన గ్రామస్థులకు బెదిరింపులు

తర్లుపాడు, జూలై 18 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కలుజువ్వలపాడులో యథేచ్ఛగా ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారు. ఈ భూములు కర్నూలు, ఒంగోలు జాతీయ రహదారి పక్కన ఉండటంతో ధరలకు రెక్కలు వచ్చాయి. ఎకరా దాదాపు రూ.కోటి పలుకుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో కలుజువ్వలపాడులో జాతీయ రహదారి పక్కన మార్కాపురం పట్టణానికి చెందిన వ్యాపారవేత్త, వైసీపీ నాయకుడికి సర్వే నెం.129-12లో ఎకరా 88 సెంట్లు, 132-1లో 4 ఎకరాల 31సెంట్ల భూమి ఉంది. వాటి మధ్యన ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నాడు. సర్వే నెం.132-3లో 2 ఎకరాలు, 129-11లో 52 సెంట్ల భూమిలో పాగా వేశాడు. ప్రస్తుతం ఆ భూమిని ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఎకరా రూ.50లక్షలకు తన సొంత భూమితో పాటు విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. ఈ విషయం సంబంధిత రెవెన్యూ అధికారులకు తెలిసినప్పటికీ వారికి ముడుపులు ఇచ్చిన నోరుమూయించాడు. నెల రోజుల నుంచి కొనుగోలుదారుడు ప్రభుత్వ భూమిని చదును చేస్తుండడంతో అనుమానం వచ్చిన గ్రామస్థులు అడ్డుకున్నారు. వారిని కూడా భయభ్రాంతులకు గురిచేసి చదును చేసిన భూమి చుట్టూ కంచె వేసేందుకు రాళ్లు కూడా పాతాడు. గ్రామస్థులు సంబంధిత వీఆర్‌వోను నిలదీసినప్పటికీ పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే చర్యలు : తహసీల్దార్‌

మండలంలో ఎవరైనా ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే చర్యలు తప్పవని తహసీల్దార్‌ కేకే కిశోర్‌ కుమార్‌ హెచ్చరించారు. కలుజువ్వలపాడులో ఆక్రమించుకున్న భూమి విషయం తన దృష్టికి వచ్చిందని శనివారం సర్వేయర్లను పంపించి సర్వే చేయిస్తానని, ప్రభుత్వ భూమిని విడగొట్టి రాళ్లు పాతించి నోటీసు బోర్డు పెట్టిస్తానని ఆయన వివరించారు.

Updated Date - Jul 19 , 2025 | 01:58 AM