Share News

ప్రభుత్వ వైద్యుల ఆందోళన బాట

ABN , Publish Date - Sep 28 , 2025 | 02:44 AM

ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యాధి కారులు ఆందోళన బాట పట్టారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పీహెచ్‌సీ డాక్టర్స్‌ అసోసియేషన్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఫ్యామిలీ డాక్టర్‌ విధులను బహిష్కరించారు. నల్లబ్యాడ్జీలు ధరించి ఓపీలకు హాజరయ్యారు.

ప్రభుత్వ వైద్యుల ఆందోళన బాట
తిప్పాయపాలెంలో నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరైన వైద్యులు

నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరు

రేపు ఓపీల బహిష్కరణ

సమస్యలు పరిష్కారమయ్యే వరకూ కొనసాగింపు

దసరా అనంతరం ప్రత్యక్ష కార్యాచరణ

ఒంగోలు కలెక్టరేట్‌, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యాధి కారులు ఆందోళన బాట పట్టారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పీహెచ్‌సీ డాక్టర్స్‌ అసోసియేషన్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఫ్యామిలీ డాక్టర్‌ విధులను బహిష్కరించారు. నల్లబ్యాడ్జీలు ధరించి ఓపీలకు హాజరయ్యారు. ప్రధానమైన డిమాండ్లు పరిష్కారమయ్యేంత వరకు రోజువారీ ఉద్యమం కొనసాగించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా ఎలాంటి ఉద్యోగోన్నతులు లేకుండా పనిచేయాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర శాఖల్లో ఐదారేళ్లు పనిచేస్తే ప్రమోషన్లు వస్తున్నా తమ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందని వాపోయారు. ఇన్‌సర్వీస్‌ పీజీ కోటాను పునరుద్ధరించాలని, టైమ్‌ బౌండ్‌ ప్రమోషన్లు అమలు చేయాలని, గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యాధికారులకు బేసిక్‌ పే 30శాతం, ట్రైబల్‌ అలవెన్స్‌ మంజూరు చేయాలని, నోషనల్‌ ఇంక్రిమెంట్లు, చంద్రన్న సంచార చికిత్స కింద రూ.5వేలు అలవెన్స్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వైద్యులకు కచ్చితమైన పనిగంటలు, వారాంతపు సెలవు, స్పష్టమైన జాబ్‌చార్ట్‌ ఇవ్వాలని, నాన్‌ మెడికల్‌ వ్యక్తులు విచ్చలవిడిగా తనిఖీలు చేయకుండా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు. జిల్లావ్యాప్తంగా 170 మంది వైద్యాధికారులు ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమాన్ని బాయ్‌కాట్‌ చేశారు. సోమవారం ఓపీలను బహిష్కరించనున్నారు. కేవలం అత్యవసర కేసులను మాత్రమే చూడాలని నిర్ణయించారు. మంగళవారం ఒంగోలులో ర్యాలీ నిర్వహించి ఉన్నతాధికారులకు వినతిపత్రాలు ఇవ్వనున్నారు. అప్పటికి కూడా సమస్యలు పరిష్కారం కాకపోతే దసరా అనంతరం తదుపరి కార్యచరణ రూపొందించుకోవాలని తీర్మానించుకున్నారు.

సమస్యలను పరిష్కరించాలి

పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న వైద్యాధికారుల సమస్యలను ప్రభుత్వం మానవతా దృక్పథంతో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ కే.రాహుల్‌ కోరారు. ఇప్పటికే ఆయా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. సానుకూలంగా స్పందించి వెంటనే ఆయా సమస్యలను పరిష్కరించాలని కోరారు.

Updated Date - Sep 28 , 2025 | 02:44 AM