Share News

గోతులమయంగా పంగులూరు- ముప్పవరం రహదారి

ABN , Publish Date - Nov 26 , 2025 | 12:58 AM

మండల కేంద్రమైన పంగులూరు - ముప్పవరం గ్రామాల మధ్య ఆర్‌అండ్‌బీ రహదారిపై ఏర్పడిన గోతులపై రాకపోకలు సాగించడం యిబ్బందిగా మారింది.

గోతులమయంగా పంగులూరు- ముప్పవరం రహదారి

పంగులూరు, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రమైన పంగులూరు - ముప్పవరం గ్రామాల మధ్య ఆర్‌అండ్‌బీ రహదారిపై ఏర్పడిన గోతులపై రాకపోకలు సాగించడం యిబ్బందిగా మారింది. మండల కేంద్రం నుంచి ముప్పవరం చేరుకునే ప్రధాన రహదారిలో జనకవరం అడ్డరోడ్డుకు సమీపంలో ఇరువైపులా లోతైన గోతులు ఏర్పడ్డాయి. ఇదే రహదారిలో కొండమూరు అలుగు సమీపంలో మరియు ఆదిరెడ్డిభావి నుండి ముప్పవరం మధ్య పలుచోట్ల రోడ్డుమధ్యలో అడుగడుగునా గోతులు దర్శనమిస్తున్నాయి. గత టి.డి.పి. పాలనలో పంగులూరు, ముప్పవరం గ్రామాల మధ్య బి.టి. రోడ్డు నిర్మాణం జరిగింది. నాటి నుండి తరచూ ఈ రోడ్డుపై ఏర్పడిన గోతులు పూడ్చేందుకు ఆర్‌ అండ్‌ బీ అధికారులు అరకొర మరమ్మత్తులు చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం గోతులకు తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టినా గడిచిన ఏడాది కాలంగా వర్షాలకు జనకవరం, ముప్పవరం గ్రామాల మధ్య అనేకచోట్ల గోతులు ఏర్పడంతో ద్విచక్ర వాహనచోదకులు రాకపోకలు సాగించడంలో అవస్దలు పడుతున్నారు. ఇంకొల్లు, పంగులూరు పరిసర ప్రాంతాల నుండి 16వ నెంబరు జాతీయ రహదారికి చేరుకుని అద్దంకితో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్ళేందుకు నిత్యం వందల సంఖ్యలో వాహనచోదకులు రేయింబవళ్ళు రాకపోకలు సాగిస్తుంటారు. అద్దంకి. ఇంకొల్లు మధ్య నడిచే ఆరీ.సి. బస్సులతో పాటు పలు ప్రాంతాల నుండి సిమెంట్‌, కంకర, ఇసుక ఇతర సరుకు రవాణా చేసే లారీలు, ట్రాక్టర్లు, వైద్యం కోసం, ఇతర పనుల నిమిత్తం పలు గ్రామాల ప్రజలు కారుల్లో ప్రయాణం సాగిస్తుంటారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ ప్రధాన రహదారిలో రాకపోకలకు ఇబ్బంది లేకుండా గోతులకు కనీస మరమ్మత్తులు చేపట్టాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతన్నారు.

Updated Date - Nov 26 , 2025 | 12:58 AM