రేషన్ షాపుల్లోనే సరుకులు
ABN , Publish Date - May 25 , 2025 | 01:23 AM
జిల్లాలో జూన్ 1వతేదీ నుంచి చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ పక్కాగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ ఆదేశించారు. ప్రకాశం భవన్‌లోని సమావేశపు హాలులో శనివారం రేషన్ డీలర్ల అసోసియేషన్ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
వచ్చేనెల 1 నుంచి పంపిణీ
జేసీ గోపాలకృష్ణ
ఒంగోలు కలెక్టరేట్, మే 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జూన్ 1వతేదీ నుంచి చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ పక్కాగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ ఆదేశించారు. ప్రకాశం భవన్‌లోని సమావేశపు హాలులో శనివారం రేషన్ డీలర్ల అసోసియేషన్ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు రేషన్ సరుకులను ఎండీయూ వాహనాల ద్వారా పంపిణీ చేశామన్నారు. అయితే ఈ విధానంలో అనేక లోటుపాట్లతోపాటు, అక్రమ రవాణా జరుగుతున్నట్లు ప్రభు త్వం గుర్తించిందన్నారు. ఆవిధానాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ప్రస్తుతం పాతవ్యవస్థను కొత్త నిర్దేశాలతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. వచ్చేనెల 1వతేదీ నుంచి రేషన్ షాపు వద్ద మాత్రమే సరుకులను కార్డులకు పంపిణీ చేయాలని జేసీ గోపాల కృష్ణ స్పష్టం చేశారు. పండుగ వాతావరణంలో ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించాలని ఆదేశించారు. చౌక ధరల దుకాణాలను శుభ్రంగా ఉంచుకోవాలని, కార్డుదారులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఎండీయూ వాహన ఆపరేటర్ నుంచి ఈపోస్ మిషన్, కాటా, ఐరిస్ మిషన్లను స్వాధీనం చేసుకోవాలన్నారు. రేషన్‌షాపుల ద్వారా నిత్యావసర సరుకులను కార్డుదారులకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8గంటల వరకు పంపిణీ చేయాలన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటలలోపు 65ఏళ్లకుపైబడిన వారికి, దివ్యాంగులకు వారి ఇంటి వద్దకు వెళ్లి ఇవ్వాలని జేసీ సూచించారు. సరుకులను పక్కదారి పట్టిస్తే సంబంధిత డీలర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు.