బర్లీకి బైబై
ABN , Publish Date - Aug 31 , 2025 | 02:44 AM
బర్లీ (నాటు) పొగాకుపై ప్రభుత్వం నిషేధం విధించింది. రానున్న వ్యవసాయ సీజన్‌లో రైతులు ఆ పంట సాగు చేయకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
రానున్న సీజన్ సాగుపై నిషేధం
అమలుకు మూడు స్థాయిల్లో టాస్క్‌ఫోర్స్ కమిటీలు
జిల్లా యంత్రాంగానికి చేరిన ప్రభుత్వ ఉత్తర్వులు
ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన
ఒంగోలు, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి) : బర్లీ (నాటు) పొగాకుపై ప్రభుత్వం నిషేధం విధించింది. రానున్న వ్యవసాయ సీజన్‌లో రైతులు ఆ పంట సాగు చేయకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ అధికారులతో సంయుక్తంగా కమిటీలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించింది. జిల్లాలో బర్లీ పొగాకు సాగు పరిమితంగానే ఉంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రత్యేకించి గతంలో ఉమ్మడి జిల్లాలో ఉండి ప్రస్తుతం బాపట్ల జిల్లాలో చేరిన ప్రాంతంలో అధికంగా సాగవుతుంది. దశాబ్ద కాలంగా ఏటా పంట సాగు పెరుగుతోంది. వ్యాపారులు మరింత ప్రోత్సహించడం, ధరలు కూడా ఆశాజనకంగా ఉండటంతో గత సీజన్ (2024-25)లో అనూహ్యంగా పంట ఉత్పత్తి పెరిగింది. గతంలో కిలో రూ.130 వరకు బర్లీ పొగాకును కొనుగోలు చేసిన వ్యాపారులు ఈ సీజన్‌లో మాత్రం రూ.6వేల నుంచి రూ.8వేలకు మించి ఇవ్వకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో బర్లీ పొగాకు అత్యధికంగా ఉత్పత్తి అయ్యే ప్రాంతమైన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సీఎం చంద్రబాబు రైతులను ఆదుకొనేందుకు రూ.363 కోట్లు కేటాయించి మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపి కొనుగోలు చేయించారు. దాని వల్ల బర్లీ పొగాకు రైతులు ఊరట చెందారు. వ్యాపారుల దయాదాక్షిణ్యాలపై మార్కెట్ ఆధారపడి ఉండటం వల్ల వచ్చే సీజన్‌లో పంట సాగు నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులను కూడా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల ద్వారా ఒప్పించింది. తదనుగుణంగా వచ్చే సీజన్ (2025-26)కు బర్లీ పొగాకు సాగును నిషేధిస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. జిల్లాలో ప్రస్తుత సీజన్‌లో సుమారు 6,700 ఎకరాలలో బర్లీ పొగాకును సాగు చేశారు. రానున్న సీజన్‌కు ఆ విస్తీర్ణంలో అపరాలు, చిరుధాన్యాలు ఇతరత్రా పంటలను సాగు చేసేలా రైతులకు యంత్రాంగం అవగాహన కల్పించనుంది.
పర్యవేక్షణకు కమిటీలు
బర్లీ పొగాకు సాగును నిషేధించిన ప్రభుత్వం దీని పర్యవేక్షణకు అన్ని జిల్లాల్లోనూ మూడు స్థాయిల్లో టాస్క్‌ఫోర్స్ కమిటీల ఏర్పాటుకు ఆదేశించింది. జిల్లాస్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా ఎస్పీ, వ్యవసాయశాఖ అధికారి, డీఎంహెచ్‌వోలు సభ్యులుగా కమిటీ ఉంటుంది. డివిజన్ స్థాయిలో ఆర్డీవోల నేతృత్వంలో, మండల స్థాయిలో తహసీల్దార్ల నేతృత్వంలో కమిటీలను సంబంధిత శాఖ అధికారులతో ఏర్పాటు చేశారు. బర్లీ పొగాకు వేసే గ్రామాల్లో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన, ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి ఎవరూ సాగు చేయకుండా చర్యలను ఈ కమిటీలు పర్యవేక్షించనున్నాయి.