Share News

సమష్టిగా పనిచేస్తే సత్ఫలితాలు

ABN , Publish Date - Dec 09 , 2025 | 02:15 AM

సమష్టిగా, సమన్వయంతో పనిచేస్తే ఉత్తమ ఫలితాలు సాధించడం సులభతరమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు. సంపూర్ణత అభియాన్‌ కింద యాస్పిరేషనల్‌ బ్లాక్‌ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం బంగారు పతకం సాధించడం పట్ల భాగస్వాములైన వారికి ప్రత్యేకంగా అభినందన కార్యక్రమాన్ని జిల్లా ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక జీజీహెచ్‌ ఆడిటోరియంలో నిర్వహించారు.

సమష్టిగా పనిచేస్తే సత్ఫలితాలు
ప్రశంసాపత్రాలు అందుకున్న ఆశా వర్కర్లతో మంత్రి స్వామి, కలెక్టర్‌ రాజాబాబు, ఎమ్మెల్యే జనార్దన్‌, టీడీపీ వైపాలెం ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు, అధికారులు

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ స్వామి

యాస్పిరేషనల్‌ బ్లాక్‌ కార్యక్రమంలో ఎర్రగొండపాలెంకు బంగారు పతకం

భాగస్వాములైన వారికి అభినందనలు, ప్రశంసాపత్రాలు

ఒంగోలు కార్పొరేషన్‌, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): సమష్టిగా, సమన్వయంతో పనిచేస్తే ఉత్తమ ఫలితాలు సాధించడం సులభతరమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు. సంపూర్ణత అభియాన్‌ కింద యాస్పిరేషనల్‌ బ్లాక్‌ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం బంగారు పతకం సాధించడం పట్ల భాగస్వాములైన వారికి ప్రత్యేకంగా అభినందన కార్యక్రమాన్ని జిల్లా ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక జీజీహెచ్‌ ఆడిటోరియంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి స్వామి మాట్లాడుతూ వైపాలెం మండల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరు అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. వీరి అనుభవాలతో జిల్లా మొత్తాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆ దిశగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఈ విజయంలో భాగస్వాములైన వారిని ప్రత్యేకంగా అభినందించారు.కలెక్టర్‌ పి.రాజాబాబు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో జరుగుతున్న పురోగతిని ఉన్నతస్థాయి నుంచి నిరంతరం పర్యవేక్షించడం ద్వారా ఈ విజయం లభించిందన్నారు. ఇలాంటి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేలా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పథకాలను సమ్మిళతం చేస్తూ ప్రతి రెవెన్యూ డివిజన్‌లో ఒక గ్రామాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా తీసుకుని అమలు చేస్తున్నామన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ మాట్లాడుతూ ఉత్తమ పనితీరుకు ఎల్లప్పుడూ గుర్తింపు లభిస్తుందన్నారు. అలాంటి వారికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తుందని చెప్పారు. టీడీపీ వై.పాలెం ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన విద్య, వైద్య సదుపాయాలను కల్పించడంతోపాటు మౌలిక వసతులు అందుబాటులోకి తేవడం ద్వారా సమగ్ర అభివృద్ధి సాఽధించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. అదే స్ఫూర్తితో అధికారులు, సిబ్బంది కూడా పనిచేయడం ద్వారా వైపాలెంకు ఈ గుర్తింపు లభించిందన్నారు. అనంతరం ఆయా విభాగాలలో కేంద్రప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు చేరుకునేలా పర్యవేక్షించిన జిల్లాస్థాయి అధికారులను మంత్రి స్వామి, కలెక్టర్‌ రాజాబాబు, ఎమ్మెల్యే జనార్దన్‌, ఎరిక్షన్‌బాబు సత్కరించారు.

Updated Date - Dec 09 , 2025 | 02:15 AM