Share News

ఉపాధి కూలీలకు తీపికబురు

ABN , Publish Date - Sep 09 , 2025 | 01:26 AM

జిల్లాలోని లక్షలాది మంది ఉపాధి హామీ పథకం కూలీలకు ఊరట లభించనుంది. వారి వేతన బకాయిలకు సంబంధించి రూ.119 కోట్లను కేంద్రం విడుదల చేసింది. రెండు, మూడు రోజుల్లో కూలీల బ్యాంకు అకౌంట్లకు నగదు జమకానుంది.

ఉపాధి కూలీలకు తీపికబురు

లక్షలాది కుటుంబాలకు ఊరట

జిల్లాలో రూ.119 కోట్ల పెండింగ్‌

రెండుమూడ్రోజుల్లో బ్యాంకు ఖాతాలకు నగదు

ఒంగోలు, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని లక్షలాది మంది ఉపాధి హామీ పథకం కూలీలకు ఊరట లభించనుంది. వారి వేతన బకాయిలకు సంబంధించి రూ.119 కోట్లను కేంద్రం విడుదల చేసింది. రెండు, మూడు రోజుల్లో కూలీల బ్యాంకు అకౌంట్లకు నగదు జమకానుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేకించి వేసవి కాలమైన తొలి నాలుగు నెలల్లో పెద్దఎత్తున రాష్ట్రవ్యాప్తంగా పనులు జరిగాయి. జిల్లాలోనూ లక్షలాది కుటుంబాలకు చెందిన కూలీలు ఉపాధి పనులకు హాజరయ్యారు. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ 1 నుంచి ఇప్పటివరకు 2.86 లక్షల కుటుంబాలకు చెందిన 4.94 లక్షల మంది కూలీలు పనులకు రాగా వారికి మొత్తం 99.64లక్షల పనిదినాలు కల్పించారు. అందుకుగాను వేతనాల రూపంలో సుమారు రూ.252.45 కోట్ల మేర లభించింది. సగటున ఒక్కో కుటుంబానికి 34.75 రోజుల పనిదినాలు కల్పించగా ఒక్కొక్కరికి సగటున రోజుకు రూ.252.25 మేర వేతనం దక్కింది. అయితే కూలీలు చేసిన పనులకు పెద్దఎత్తున వేతన బకాయిలు పేరుకుపోయాయి. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు నిత్యం రెండు లక్షల మంది జిల్లాలో పనులకు హాజరయ్యారు. అలా ఆ మూడు నెలల్లోనే జిల్లాలో 93 లక్షల పనిదినాలు కల్పించారు.

కేంద్రం నుంచి నిధులు విడుదల

ఏప్రిల్‌ నుంచి మే 15 వరకు చేసిన పనులకు మాత్రమే కూలీలకు వేతనాల చెల్లింపు జరగ్గా అనంతరం చేసిన పనులకు ఆగిపోయాయి. అలా మే 15 నుంచి వేతనాల బకాయిలుగా ఆగిపోవడంతో కూలీలు అవస్థలు పడుతున్నారు. దాదాపు 15 వారాలుగా నిలిచిన బకాయిలను చెల్లించేందుకు రాష్ట్రప్రభుత్వం పలుమార్లు కేంద్రంతో సంప్రదింపులు జరిపింది. దీంతో మే 15 నుంచి ఆగస్టు 15 వరకు ఉన్న బకాయిలు మొత్తం సుమారు రూ.16,668 కోట్లను తాజాగా విడుదల చేసింది. ఆగస్టు 15 తర్వాత చేసిన పనులకు మరో రూ.137 కోట్లు రావాల్సి ఉండగా ప్రస్తుతం ఆగస్టు 15 వరకు విడుదల చేసిన బకాయిల మొత్తాల నగదును రెండు, మూడు రోజుల్లో కూలీల ఖాతాలకు జమచేయనున్నారు. కాగా తాజా బకాయిలు విడుదలతో జిల్లాలోని కూలీలకు సుమారు రూ.119 కోట్ల మేర డబ్బులు జమ కానున్నాయి.

Updated Date - Sep 09 , 2025 | 01:26 AM