Share News

శుభపరిణామం

ABN , Publish Date - Dec 16 , 2025 | 01:28 AM

‘విలువలతో కూడిన రాజకీయం చేయడంతోపాటు ఉత్తమ పార్లమెంటేరియన్‌గా అవార్డు పొందిన మహనీయుడు వాజపేయి. ఆయన సేవలను ప్రతి ఒక్కరూ తెలుసుకునే విధంగా విగ్రహం ఏర్పాటు చేయడం శుభపరిణామం’ అని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు.

శుభపరిణామం
వాజపేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మంత్రి స్వామి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు

ఒంగోలులో ఘనంగా వాజపేయి విగ్రహావిష్కరణ

ఎన్డీయే పక్షాలతో ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు

మంత్రి డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి

కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌

భారీ మోటారు సైకిళ్ల ర్యాలీ నిర్వహించిన కమల దండు

ఒంగోలు కార్పొరేషన్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : ‘విలువలతో కూడిన రాజకీయం చేయడంతోపాటు ఉత్తమ పార్లమెంటేరియన్‌గా అవార్డు పొందిన మహనీయుడు వాజపేయి. ఆయన సేవలను ప్రతి ఒక్కరూ తెలుసుకునే విధంగా విగ్రహం ఏర్పాటు చేయడం శుభపరిణామం’ అని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి విగ్రహావిష్కరణ సోమవారం ఒంగోలులో ఘనంగా జరిగింది. అటల్‌-మోదీ సుపరిపాలన యాత్ర ఒంగోలు చేరిన సంద ర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి స్వామితోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీమాధవ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ ఎన్డీయే భాగస్వామ్య పక్షాల పాలనలో ఇటు కేంద్రం, ఇటు రాష్ట్రంలోనూ పూర్తిస్థాయిలో ప్రజలకు సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. అటు కేంద్రం సహకారంతోనూ, ఇటు రాష్ట్రంలోనూ అనేక అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. వైసీపీ శ్రేణులు మెడికల్‌ కాలేజీలపై రాజకీయం చేస్తున్నారని, మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం లేదని, పీపీపీ విధానంలో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. టెలీకమ్యూనికేషన్‌, రక్షణ రంగం, రాష్ట్రాలకు ఇచ్చిన హక్కుల విషయంలో వాజపేయి అనేక సంస్కరణలు చేశారన్నారు. బీజేపీ అధ్యక్షుడు మాధవ్‌ మాట్లాడుతూ వాజపేయి కల సాకారం చేసిన మహోన్నత నేత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశం కోసం అనేక సంస్కరణలు చేసిన వాజపేయి భారత ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడు అన్నారు. హైదరాబాద్‌ను ఐటీకి ముఖ్య కేంద్రంగా మార్చిన ఘనత చంద్రబాబుదేనన్నారు. బీజేపీ సెల్స్‌ రాష్ట్ర కోకన్వీనర్‌ డాక్టర్‌ ఎన్‌.సూర్యకల్యాణ్‌చక్రవర్తి మాట్లాడుతూ మాజీ ప్రధాని, స్ఫూర్తిదాయకమైన నేత వాజ్‌పేయి విగ్రహాన్ని ఒంగోలులో ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా ఉత్తమ పార్లమెంటేరియన్‌గా దేశ రాజకీయాలలోనే మంచివ్యక్తిగా గుర్తింపు కలిగిన వాజ్‌పేయి ఆశయ సాధన కోసం ప్రధాని మోదీ సుపరిపాలనతో ముందుకు వెళుతున్నారన్నారు. ప్రజలు మెచ్చిన పాలనగా ప్రజల్లో కూటమి ప్రభుత్వం గుర్తింపు పొందిందని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్‌, కందుల నారాయణరెడ్డి, డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, బీఎన్‌.విజయ్‌కుమార్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శెగ్గం శ్రీనివాసరావు, 20 సూత్రాల అభివృద్ధి కమిటీ చైర్మన్‌ లంకా దినకర్‌, మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య, టూరిజం బోర్డు కార్పొరేషన్‌ చైర్మన్‌ నూకసాని బాలాజీ, లేబర్‌ బోర్డు కమిషన్‌ డైరెక్టర్‌ కృష్ణారెడ్డి, ఒడా చైర్మన్‌ షేక్‌ రియాజ్‌తోపాటు బీజేపీ నాయకులు శివారెడ్డి, యామినిశర్మ తదితరులు పాల్గొన్నారు. వారంతా వాజపేయి సేవలను కొనియాడారు. అంతకముందు బీజేపీ శ్రేణులు నిర్వహించిన బైక్‌ ర్యాలీ ఉత్సాహంగా సాగింది.

ప్రొటోకాల్‌ పాటించకపోవడంపై మేయర్‌ అసంతృప్తి

మాజీ ప్రధాని వాజపేయి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రొటోకాల్‌ పాటించలేదని నగర మేయర్‌ గంగాడ సుజాత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నగర ప్రథమ పౌరురాలిగా, ప్రత్యేకించి తన ప్రాతినిథ్యం వహించే డివిజన్‌ పరిధిలో విగ్రహం ఏర్పాటు చేయడం, ఆ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన శిలాఫలకంలో తన పేరు లేకపోవడంపై కినుక వహించారు. విషయం తెలుసుకున్న బీజేపీ శ్రేణులు మరో శిలాఫలకం ఏర్పాటు చేసి, మేయర్‌ పేరు పెట్టినప్పటికీ కార్యక్రమానికి ఆమె హాజరు కాలేదు.

Updated Date - Dec 16 , 2025 | 01:28 AM