పంచాయతీలకు మహర్దశ
ABN , Publish Date - Jun 05 , 2025 | 01:25 AM
జిల్లాలో గ్రామ పంచాయతీలకు మహర్దశ వచ్చింది. రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పల్లెసీమలపై ప్రత్యేక దృష్టి సారించింది. జనాభా ప్రాతిపదికన పంచాయతీలను అభివృద్ధి చేసేందుకు గ్రేడ్‌లుగా విభజించాలని నిర్ణయించింది.
ఆదాయం, జనాభా ఆధారంగా విభజన
పది వేల మంది ప్రజలు, రూ.కోటిపైన ఆదాయం ఉంటే డిప్యూటీ ఎంపీడీవోలు నియామకం
గ్రేడ్ల కేటాయింపు, అభివృద్ధి పనులు
ఒంగోలు కలెక్టరేట్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో గ్రామ పంచాయతీలకు మహర్దశ వచ్చింది. రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పల్లెసీమలపై ప్రత్యేక దృష్టి సారించింది. జనాభా ప్రాతిపదికన పంచాయతీలను అభివృద్ధి చేసేందుకు గ్రేడ్‌లుగా విభజించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు గ్రామ పంచాయతీలు 1 నుంచి 6 గ్రేడ్లు ఉండగా.. ప్రస్తుతం పది వేల జనాభా లేదా రూ.కోటికిపైగా వార్షిక ఆదా యం ఉండే వాటిని స్పెషల్ గ్రేడ్‌గా పరిగణించనుంది. మిగిలిన పంచాయతీలను జనాభా ప్రతిపాదికతోపాటు ఆయా స్థాయిల ఆధారంగా గ్రేడ్లను కేటాయించాలని ప్రభుత్వం సూచించింది. అందుకుఅనుగుణంగా జిల్లా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటివరకు పంచాయతీలకు కార్యదర్శులు పనిచేస్తుండగా గ్రేడ్ల విభజన అనంతరం కొన్ని మార్పులు చేయనున్నారు. 10 వేల మంది జనాభా లేదా కోటికిపైగా ఆదాయం ఉండే పంచాయతీలకు ఇక నుంచి డిప్యూటీ ఎంపీడీవో(ఈవోపీఆర్డీ)లను ప్రభుత్వం నియమించనుంది.
ప్రభుత్వానికి నివేదికలు
మునిసిపాలిటీ తరహాలోనే నూతనంగా ఆయా పంచాయతీలకు ప్రణాళికలను రూపొందించి ఆదాయం పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పంచాయతీలకు వచ్చే నిధులతోపాటు స్థానికంగానూ ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ఆలోచన చేస్తోంది. అందులో భాగంగానే పంచాయతీ అధికారులు జిల్లాలోని 729 గ్రామ పంచాయతీలను విభజన చేశారు. ఆదాయ వనరులు, జనాభా, ప్రస్తుతం వస్తున్న ఆదాయాలను పరిగణనలోకి తీసుకొని గ్రేడ్లుగా విభజించారు. మొత్తం పంచాయతీల సమాచారంతో ప్రభుత్వానికి నివేదికలు సమర్పించినట్లు సమాచారం. అలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి నివేదికలు వచ్చిన తర్వాత ప్రభుత్వం దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.
గ్రేడ్‌ల వారీ పంచాయతీల వివరాలు
జిల్లాలో పదివేల జనాభా/రూ.కోటికిపైన ఆదాయం ఉన్న 11 పంచాయతీలను స్పెషల్ గ్రేడ్‌గా పరిగణించనున్నారు. 4వేల నుంచి 10వేల జనాభా, రూ.50లక్షల నుంచి కోటి మధ్య ఆదాయం ఉన్న పంచాయతీలు 75 ఉన్నట్లు గుర్తించారు. వీటిని గ్రేడ్-1 కింద పరిగణిస్తారు. 2వేల నుంచి 4వేల జనాభా ఉన్న 265 పంచాయతీలను గ్రేడ్-2 కింద చేర్చనున్నారు. 2వేల లోపు జనాభా ఉన్న 373, 500 లోపు జనాభా ఉన్న ఐదు పంచాయతీలను గ్రేడ్-3 కింద పరిగణించనున్నారు.