కారుమంచి మేజర్‌కు మంచిరోజులు
ABN , Publish Date - Dec 07 , 2025 | 11:36 PM
నాలుగేళ్ల క్రితం గ్రానైట్ క్వారీలో కుప్పకూలిన కారుమంచి కాలువ కట్ట పునరుద్ధరణకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. ఎమ్యెల్యే బీఎన్ విజయ్‌కుమార్, ఎన్‌ఆర్‌ఐ నల్లూరి వెంకటశేషయ్యల కృషితో కారుమంచి మేజర్ పునరుద్ధరణ పనులు ప్రారంభించటానికి ఎదురైన అడ్డంకులు తొలగిపోయాయి
కూలిన కట్ట పునరుద్ధరణకు లైన్‌క్లియర్
డిజైన్ కోసం ప్రతిపాదనలు పంపాలని సీఈ ఆదేశం
సాయిల్ టెస్ట్ చేయించి ఫలితం కోసం వేచిచూస్తున్న అధికారులు
వేసవిలో పనులు మొదలు పెట్టడానికి వీలుగా కసరత్తు
ఫలించిన ఎమ్యెల్యే విజయ్‌కుమార్, ఎన్‌ఆర్‌ఐ శేషయ్యల కృషి
చీమకుర్తి, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి) : నాలుగేళ్ల క్రితం గ్రానైట్ క్వారీలో కుప్పకూలిన కారుమంచి కాలువ కట్ట పునరుద్ధరణకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. ఎమ్యెల్యే బీఎన్ విజయ్‌కుమార్, ఎన్‌ఆర్‌ఐ నల్లూరి వెంకటశేషయ్యల కృషితో కారుమంచి మేజర్ పునరుద్ధరణ పనులు ప్రారంభించటానికి ఎదురైన అడ్డంకులు తొలగిపోయాయి. సీఎంవో నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఎన్‌ఎ్‌సపీ సీఈ నుంచి జిల్లా ఎస్‌ఈకి స్పష్టమైన ఆదేశాలు అందాయి. త్వరితగతన కట్ట పునరుద్ధరణకు డిజైన్ నిర్మించటానికి అంచనా ప్రతిపాదనలను త్వరితగతిన పంపాలని ఆదేశించారు. ఈ మేరకు అంచనాలు రూపొందించటానికి అవసరమైన సాయిల్ టెస్ట్‌ను అధికారులు నిపుణులచేత పూర్తి చేయించారు. పరీక్షలో తేలిన ఫలితానికి అనుగుణంగా కట్ట పునరుద్ధరణకు అంచనాలు తయారుచేసి డిజైన్ రూపొందించి ఆమోదిస్తారు. తదుపరి అడ్మినిస్ట్రేషన్, టెక్నికల్ అనుమతులు పొంది ఈ ఏడాది వ్యవసాయ సీజన్ ముగిసిన తర్వాత వేసవిలో పనులు ప్రారంభించేలా ఎన్‌ఎ్‌సపీ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
అవరోధాలను అధిగమించి...
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నాలుగేళ్ల క్రితం కారుమంచి మేజర్ కాలువ 0.350నుంచి 0.900కి.మీ వరకూ పక్కనే ఉన్న గ్రానైట్ క్వారీలో కుప్పకూలిపోయింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించిన క్వారీయింగ్ వలన కట్ట కూలిపోవటం దాదాపు 18 గ్రామాల ప్రజలకు ఆశనిపాతంలా మారింది. మేజర్ కింద ఉన్న దాదాపు 20వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 18గ్రామాల ప్రజలకు తాగునీరు సక్రమంగా అందని పరిస్థితి ఏర్పడింది. అయినా గత వైసీపీ ప్రభుత్వం సంకుచిత ధోరణితో రాజకీయకోణంలో ఆలోచించి కట్ట పునరుద్ధరణకు చర్యలు చేపట్టలేదు. కట్ట కూలిన చోట తాత్కాలికంగా కాలువను బైపాస్ చేసి నీటిసరఫరాను చేస్తూ వచ్చారు. దీనివలన 135క్యూసెక్కుల నీరు ప్రవహించాల్సిన కాలువలో నలభై క్యూసెక్కులకులోపే పరిమితం కావటంతో ఆయకట్టు రైతాంగం నాలుగేళ్ల నుంచి సాగునీటి కోసం నానాఇబ్బందులు పడుతున్నారు. వందల ఎకరాలు బీడుగా మారిన దుస్థితి ఏర్పడింది. రైతుల బాధలను స్వయంగా వీక్షించిన బీఎన్ విజయ్‌కుమార్ ఎన్నికల నాడు కట్ట పునరుద్ధరణపై స్పష్టమైన హామీ ఇచ్చారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రావటంతో కట్ట పునరుద్ధరణ దిశగా అడుగులు పడ్డాయి. మంత్రులు, ఇన్‌చార్జ్ మంత్రి, అధికారులను ఒప్పించి డీఎంఎఫ్ నుంచి రూ.2.60కోట్లను మంజూరు చేయించటంలో ఎమ్యెల్యే బీఎన్ సఫలీకృతులయ్యారు. ఇక పనులు ప్రారంభమే అనుకుంటుండగా జరిగిన పరిణామాలు మళ్లీ మొదటికొచ్చింది. ఈ నేపథ్యంలో పనులకు బ్రేక్ పడటానికి గల కారణాలను ‘కారుమంచి మేజర్ కర్షకులు కడగండ్లు’ అనే శీర్షికన ఆంధ్రజ్యోతిలో వార్త ప్రచురితమైంది. స్పందించిన ఆయకట్టు రైతులు పెద్దఎత్తున కలెక్టరేట్ వద్ద పార్టీలకతీతంగా ధర్నా చేశారు. దీనికి స్పందించిన ఇరిగేషన్ ఉన్నతాధికారులు తమ తప్పు సరిదిద్దుకునే పనిని చేపట్టారు. మరోవైపు ఎమ్మెల్యే విజయ్‌కుమార్, మొదటినుంచి కట్ట పునరుద్ధరణ కోసం కృషి చేస్తున్న ఎన్‌ఆర్‌ఐ నల్లూరి వెంకటశేషయ్యలు.. ఎదురైన అవరోధాలను తొలగించేలా చర్యలు చేపట్టారు. ఆ మేరకు లైన్ క్లియర్ అయ్యేలా రాష్ట్ర ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు.
వేసవిలో కట్ట పునరుద్ధరణను ప్రారంభిస్తాం
వరలక్ష్మి, ఎస్‌ఈ
ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు కారుమంచి మేజర్ కట్ట పునరుద్ధరణ పనులు వేసవిలో ప్రారంభించటానికి అవసరమైన ముందస్తు కసరత్తును ప్రారంభించాం. రాబోయే వ్యవవసాయ సీజన్‌కు పూర్తిస్థాయిలో పనులు పూర్తిచేసి 135 క్యూసెక్కుల జలాలు ప్రవహించేలా కట్టను పటిష్ఠంగా నిర్మించటానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం.