Share News

మెప్మాలో గోల్‌మాల్‌

ABN , Publish Date - Nov 20 , 2025 | 01:13 AM

పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. అడ్డగోలు దోపిడీ, అక్రమ వ్యవహారాలు నిత్యకృత్యమయ్యాయి. బోగస్‌ గ్రూపుల పేరుతో ఆర్పీలు దోచుకున్న సొమ్ముకు లెక్కాపత్రం లేకపోయినా కనీస చర్యలు కరువయ్యాయి. తాము మోసపోయామని బాధితులు బోరు మంటూ ఆ శాఖ అధికారికి విన్నవించినా విచారణ పేరుతో జాప్యం చేయడం షరామామూలైంది.

మెప్మాలో గోల్‌మాల్‌

రూ.కోట్లు వదిలేసి లక్షలు పట్టారు..!

నిన్నటి వరకు అవినీతికి అండదండలు..

నేడు కొత్తగా కేసుల పేరుతో బెదిరింపులు

సంస్థలో అవినీతి బాగోతంపై అంతటా చర్చ

‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలతో మల్లగుల్లాలు

అవినీతి ఆర్పీలకు పోస్టులపైనా ఆరోపణలు

ఒంగోలు కార్పొరేషన్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి) : పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. అడ్డగోలు దోపిడీ, అక్రమ వ్యవహారాలు నిత్యకృత్యమయ్యాయి. బోగస్‌ గ్రూపుల పేరుతో ఆర్పీలు దోచుకున్న సొమ్ముకు లెక్కాపత్రం లేకపోయినా కనీస చర్యలు కరువయ్యాయి. తాము మోసపోయామని బాధితులు బోరు మంటూ ఆ శాఖ అధికారికి విన్నవించినా విచారణ పేరుతో జాప్యం చేయడం షరామామూలైంది. ప్రత్యేకించి అవినీతికి పాల్పడిన వారికే ప్రాధాన్యం ఇచ్చి కీలక విధులు అప్పగించడం విమర్శలకు తావిస్తోంది. అలాగే వారి వద్ద భారీగా వసూళ్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకు అవినీతికి పాల్పడిన ఆర్పీ లను తిరిగి విధుల్లోకి తీసుకోవడమే నిదర్శనం. తాజాగా మెప్మా జిల్లా కార్యాలయంలో ఓ ఉద్యోగి తనకు తెలియకుండా రూ.4.45 లక్షల చెక్కును తీసుకెళ్లి డ్రా చేసుకున్నట్లు పీడీ శ్రీహరి ఒంగోలు వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఏడాది కాలంగా తమకు న్యాయం చేయండి, తమను మోసం చేసిన వారిపై చర్యలు తీసు కోండంటూ మొరపెట్టు కున్న బాధితుల గోడు ఆలకించని ఆయన నేడు రూ.4.45 లక్షలు గోల్‌మాల్‌ అయ్యా యంటూ గగ్గోలు పెట్టడం, ఆగమేఘాలపై కేసు నమోదు చేయించడం చర్చనీయాంశ మైంది. అందిన సమాచారం మేరకు పీడీకి అత్యంత నమ్మకస్థుడిగా ఉన్న సునీల్‌ అనే ఉద్యోగి గతంలో ఆయనకు అన్ని విధాలా అండదండలు అందించినట్లు సమాచారం. వివి ధ అంశాలలో ఆర్థిక లావాదేవీలు, అనధికార వసూళ్లకు అతనే మధ్యవర్తిగా ఉన్నట్లు తెలిసింది. అయితే ఇటీవల సునీల్‌ ఎండీ కార్యాలయానికి బదిలీ కావడం, అక్కడ పీడీ వ్యవహారాలపై ఒకటి రెండు విషయాలు చర్చకు రావడంతోనే విషయం కేసులు పెట్టే వరకూ వెళ్లిందన్న ప్రచారం నడుస్తోంది.

ఖాళీ చెక్కుల మీద సంతకాలపై అనుమానం

ప్రభుత్వ కార్యాలయాల్లో నిధులు ఖర్చుచేయా లంటే కొన్ని నిబంధనలు, విధివిధానాలు ఉంటాయి. ఏ తేదీన, ఎందుకోసం వాడుతున్నారు అన్న వివరాలతో చెక్కు నంబరు రిజిస్టర్‌లో నమోదు చేయాలి. అలాగే ప్రొసీడింగ్స్‌ పూర్తయిన తర్వాత మాత్రమే చివరిగా పీడీ సంతకం చేయాల్సి ఉంది. అయితే ఇవేమీ జరగకుండా ముందుగానే పీడీ టేబుల్‌ డెస్క్‌లో ఖాళీ బ్యాంకు చెక్కులపై సంతకాలు చేసి ఉండటం అనుమానాలకు తావిస్తోంది. అయితే పీడీ తన సంతకాన్ని సునీల్‌ ఫోర్జరీ చేశాడని, దొంగతనానికి పాల్పడ్డారని కేసు నమోదు చేయించారు. ఆరోపణలు ఎదుర్కొంటూ పోలీసుల అదుపులో ఉన్న సునీల్‌ మాత్రం పీడీనే తనకు బ్యాంకు చెక్కు అందించి నగదు డ్రా చేయమన్నారని వెల్లడిస్తున్నారు. అయితే ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటుండగా, వాస్తవ పరిస్థితుల్లో ఖాళీ చెక్కులపై ముందస్తు సంతకాలు ఎలా చేశారు అనేది అనుమానంగా మారింది.

అవినీతి ఆర్పీలకు మళ్లీ ఉద్యోగాలు

గత వైసీపీ హయాంలో బోగస్‌ గ్రూపులు తయారు చేసి సుమారు రూ.42కోట్లు దోచుకున్న వ్యవహారంపై ఆంధ్రజ్యోతి వరుస కథనాలు ప్రచురించడంతో అప్పట్లో ఐదుగురు ఆర్పీలను విధుల నుంచి తొలగించారు. వారి లాగిన్‌లను నిలిపివేశారు. అయితే మూడు, నాలుగు నెలల క్రితం సదరు ఆర్పీలకు తిరిగి లాగిన్‌లు ఇవ్వడంపైనా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో ఆ శాఖ ఉన్నతాధికారికి భారీగానే ముడుపులు ముట్టాయని సమాచారం. మరోవైపు ఇటీవల కాలంలో మరికొన్ని బోగస్‌ గ్రూపులు తయారుకావడం, అదే విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తేవడం కూడా ఆ శాఖ ఉన్నతాధికారి అనుకూలంగా మార్చుకున్నారు. పేపర్‌లో కథనం వచ్చింది, బాధితులు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేశారు, చర్యలు తప్పవని హెచ్చరిస్తూనే చేతివాటం చూపారని తెలిసింది. ఆపైన విచారణ ఏమీ లేకుండా సదరు అక్రమార్కులకు అండదండలు అందించినట్లు కొందరు ఆర్పీలు చెప్తున్నారు. ఇలా కోట్ల అవినీతిపై చర్యలకు వెనుకాడిన ఆయన ఇప్పడు కేవలం రూ.4.45 లక్షలపై రాద్ధాంతం చేయడం, నిన్న మొన్నటివరకు గురుశిష్యులుగా ఉన్న వారు ఇప్పుడు కేసులు దాకా వెళ్లడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Nov 20 , 2025 | 01:13 AM