రూ.51.91 లక్షలు గోల్‌మాల్!
ABN , Publish Date - Sep 11 , 2025 | 01:32 AM
చీమకుర్తి మండలం పల్లామల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో భారీగా అవకతవకలు, అక్రమాలు చోటుచేసుకున్నాయి. సొసైటీకి రైతులు చెల్లించిన స్వల్ప, దీర్ఘకా లిక రుణ బకాయిలు రూ.51.91 లక్షలు గోల్‌మాల్ అయ్యాయి. 166 మంది రైతుల రుణ బకాయిలు వాయిదా మీరినా వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
పల్లామల్లి సొసైటీలో సీఈవో, గుమస్తా దోచేశారు
బ్యాంకు ఖాతాల్లో జమ చేయకుండా స్వాహా
సంఘ అధ్యక్షుడు కూడా బాధ్యుడే
ఒంగోలు విద్య, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి) : చీమకుర్తి మండలం పల్లామల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో భారీగా అవకతవకలు, అక్రమాలు చోటుచేసుకున్నాయి. సొసైటీకి రైతులు చెల్లించిన స్వల్ప, దీర్ఘకా లిక రుణ బకాయిలు రూ.51.91 లక్షలు గోల్‌మాల్ అయ్యాయి. 166 మంది రైతుల రుణ బకాయిలు వాయిదా మీరినా వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సొసైటీలోని కొంతమంది రైతులకు రుణపరిమితికి మించి అదనంగా ఇచ్చారు. సీఈవో జి.రమణయ్య, గుమస్తా షేక్ ఇమా మ్‌లు 34మంది రైతుల నుంచి వసూలు చేసిన రూ.51.91లక్షలు స్వాహా చేశారు. ప్రతిరోజూ లావాదేవీలు ముగిసిన తర్వాత సొసైటీ అధ్యక్షుడు చివరలో సంతకం చేయాలి. అయితే అప్పటి సొసైటీ అధ్యక్షుడు నగదు పుస్తకంలో సంతకాలు చేశారు కానీ జరిగిన మోసాన్ని గుర్తించలేకపోయారు. సొసైటీ రసీదు పుస్తకాలను కూడా పరిశీలించకపోవడంతో ఈ అక్రమాల పర్వం కొనసాగింది. గల్లంతైన రూ.51.91 లక్షలకు సొసైటీ అధ్యక్షుడు, సీఈవో, గుమ స్తాలను బాధ్యులుగా గుర్తించారు. సొసైటీలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై ఒంగోలు డివిజనల్ సహకారాధికారి డి.శ్రీనివాసరావును వివరణ కోరగా సొసైటీపై విచారణ నివేదిక అందిందన్నారు. గుమస్తా షేక్ ఇమామ్ ఇప్పటికే సస్పెన్షన్‌లో ఉన్నారని తెలిపారు. సీఈవోపై క్రమశిక్షణ చర్యలకు సొసైటీ కొత్త పాలక వర్గానికి డైరెక్షన్ ఇస్తున్నట్లు తెలిపారు.