దేవుడు భూమికే ఎసరు
ABN , Publish Date - Oct 04 , 2025 | 01:07 AM
జనమంతా విజయ దశమి వేడుకల్లో నిమగ్నమై ఉండగా, కొందరు భూకబ్జాదారులు ఏకంగా దేవుడు భూమికే ఎసరు పెట్టారు. కాశీవిశ్వేశ్వరస్వామికే శఠగోపం పెట్టా లని చూశారు. గత వైసీపీ హయాంలో నగరంలో భూకబ్జాలు అడ్డూ అదుపు లేకుండా సాగాయి. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం వచ్చాక కూడా అదే పంథా కొనసాగుతోంది.
దసరా సందట్లో కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయ స్థలంపై కన్ను
రూ.20కోట్ల విలువైన భూమిలో కొంతభాగం చదును
ఒంగోలులో వెలుగులోకి వచ్చిన ఆక్రమణ
అప్రమత్తమైన దేవదాయ శాఖ అధికారులు
ఒంగోలు కార్పొరేషన్, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి) : జనమంతా విజయ దశమి వేడుకల్లో నిమగ్నమై ఉండగా, కొందరు భూకబ్జాదారులు ఏకంగా దేవుడు భూమికే ఎసరు పెట్టారు. కాశీవిశ్వేశ్వరస్వామికే శఠగోపం పెట్టా లని చూశారు. గత వైసీపీ హయాంలో నగరంలో భూకబ్జాలు అడ్డూ అదుపు లేకుండా సాగాయి. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం వచ్చాక కూడా అదే పంథా కొనసాగుతోంది. ఒంగోలు కొండ మీద ఉన్న శ్రీకాశీ విశ్వేశ్వరస్వామి ఆలయానికి సంబంధించిన భూములు సుజాతనగర్ సమీపంలో ఉన్నాయి. 37వ డివిజన్‌లోని సర్వే నెం.225లో సుమారు 27.5 ఎకరాలు ఉండగా గతంలో అదే భూమిపై వైసీపీ నాయకులు కన్నేసి ఆక్రమించే ప్రయత్నం చేశారు. ఈ స్థలం విలువ మార్కెట్ ప్రకారం సుమారు రూ.20కోట్లపైనే ఉంటుందని అంచనా. దేవదాయ శాఖ అధికారులు అప్రమత్తమై అడ్డుకోవడంతో అప్పట్లో ఆగిపోయింది. కాగా తాజాగా జనమంతా దసరా వేడుకల్లో ఉండగా ‘సందట్లో సడేమియా’ అన్నట్లు కొందరు వ్యక్తులు గురువారం రాత్రి ఆ భూములను చదును చేయడం ప్రారంభించారు. కొంత భాగానికి ఎక్స్‌కవేటర్‌తో పిచ్చిమొక్కలు తొలగించి, ఫెన్సింగ్ వేసేందుకు ప్రయత్నించారు. ఆ దందాను చూసిన కొందరు విషయాన్ని దేవదాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళారు. వారు అప్రమత్తమై వెంటనే చర్యలు తీసుకున్నారు. కొందరు సిబ్బందిని ఆ స్థలం వద్ద కాపలాగా ఉంచడంతో ఆక్రమణదారులు సర్దుకున్నారు. దేవదాయ శాఖ నిర్లక్ష్యం వైఖరి కారణంగానే అక్రమార్కులు ఆలయ భూములను ఆక్రమిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టిసారించి, దేవదాయ శాఖకు చెందిన స్థలాలను కాపాడుకునేందుకు రక్షణ కంచెలు వేయాలని కోరుతున్నారు.