Share News

ఇంటింటికీ వెళ్లి... యోగక్షేమాలు విచారించి

ABN , Publish Date - Dec 02 , 2025 | 01:58 AM

జిల్లావ్యాప్తంగా సోమ వారం సామాజిక పింఛన్‌ల పంపిణీ కోలాహలంగా సాగింది. తుఫాన్‌ వాతావరణంతో చలిగాలులు, చిరుజల్లులు ఉన్నప్పటికీ ఉదయం ఏడు గంటలకే క్షేత్రస్థాయి సిబ్బంది, వారికి తోడు టీడీపీ శ్రేణులు పింఛన్ల పంపిణీని ప్రారంభించారు.

ఇంటింటికీ వెళ్లి... యోగక్షేమాలు విచారించి
టంగుటూరు మండలం శివపురంలో వృద్ధాప్య పింఛన్‌ను అందజేస్తున్న మంత్రి స్వామి

లబ్ధిదారులను కలిసి సామాజిక పింఛన్‌ల అందజేత

ఉదయం 10 గంటలకే 75శాతం పంపిణీ

శివపురంలో పాల్గొన్న మంత్రి స్వామి

పలుచోట్ల శాసనసభ్యులు, ముఖ్యనేతలు, అధికారులు హాజరు

ఒంగోలు, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : జిల్లావ్యాప్తంగా సోమ వారం సామాజిక పింఛన్‌ల పంపిణీ కోలాహలంగా సాగింది. తుఫాన్‌ వాతావరణంతో చలిగాలులు, చిరుజల్లులు ఉన్నప్పటికీ ఉదయం ఏడు గంటలకే క్షేత్రస్థాయి సిబ్బంది, వారికి తోడు టీడీపీ శ్రేణులు పింఛన్ల పంపిణీని ప్రారంభించారు. ఉదయం పది గంటలలోపే జిల్లాలోని లబ్ధిదారులలో 75శాతం మందికి పింఛన్‌ సొమ్మును అందించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతినెలా ఒకటో తేదీన ‘పేదల సేవ’లో పేరుతో పింఛన్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయం విదితమే. అలాగే సోమవారం జిల్లా వ్యాప్తంగా పింఛన్‌లు పంపిణీ చేపట్టారు. జిల్లాకు ఈనెలకు సంబంధించి 2,33,200 మంది లబ్ధిదారులకు రూ.124.71 కోట్ల సామాజిక పింఛన్‌లు మంజూరయ్యాయి. అందులో 345మంది కొత్తవారు ఉన్నారు. పింఛన్‌లు తీసుకుంటూ మరణించిన వారి భార్యలకు తదుపరి నెలలో ఆటోమెటిక్‌గా పింఛన్‌ ఇచ్చేలా ప్రభు త్వం చర్యలు తీసుకోవడంతో అలా 345 మంది కొత్త వారు చేరారు. మధ్యాహ్నం మూడు గంటలకు 90శా తం మందికి నగదు పంపిణీ చేశారు. మిగిలిన వారికి సాయంత్రం అందించారు. అందుబాటులో లేని కొద్ది మందికి తర్వాత ఇస్తారని అధికారులు తెలియజేశారు.

ఉత్సాహంగా పాల్గొన్న నేతలు

ప్రభుత్వ ఆదేశాలతో ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, వివిధ స్థాయిల్లోని అధికారులు, సిబ్బంది పింఛన్‌ల పంపిణీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్‌ స్వామి తన నియోజకవర్గమైన కొండపిలోని టంగుటూరు మండలం శివాపురం గ్రామంలో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులను పలుకరించి వారి యోగక్షేమాలను కనుక్కొని పింఛన్‌లు అందజేశారు. అదే నియోజకవర్గంలోని జరుగుమల్లి మండలం వావిలేటిపాడులో మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య పంపిణీ చేశారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ నగరంలోని 12వ డివిజన్‌లో పంపిణీ చేయగా టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ నూకసాని బాలాజీ, ఒడా చైర్మన్‌ షేక్‌ రియాజ్‌, నగర మేయర్‌ గంగాడ సుజాత తదితరులు పాల్గొన్నారు. కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి కనిగిరి పట్టణంలోని ఏడో వార్డులో ఇంటింటికీ వెళ్లి పింఛన్‌ సొమ్మును అందజేశారు. గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి కంభం మండలం లింగోజిపల్లిలో పాల్గొన్నారు. టీడీపీ ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు గంగపాలెంలో పంపిణీ చేయగా, టీడీపీ దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మీ తాళ్లూరు మండలం కొర్రపాటివారిపాలెంలో పింఛన్‌లను అందజేశారు. దర్శి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, నగర పంచాయతీ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య పాల్గొన్నారు.

Updated Date - Dec 02 , 2025 | 01:58 AM