దొంగతనాలకు పాల్పడుతూ గంజాయి విక్రయించే ముఠా అరెస్ట్
ABN , Publish Date - Apr 21 , 2025 | 11:11 PM
దొంగతనాలకు పాల్పడుతూ, ఆ సొత్తుతో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి విక్రయించే ముగ్గురు సభ్యుల ముఠాను సింగరాయకొండ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నాలుగున్నర కిలోల గంజాయి, రూ.10లక్షల విలువ చేసే వివిధ రకాల వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
నాలుగున్నర కేజీల సరకు..
రూ.10 లక్షలు విలువైన సొత్తు స్వాధీనం
వివరాలను వెల్లడించిన సీఐ హజరత్తయ్య
సింగరాయకొండ, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి) : దొంగతనాలకు పాల్పడుతూ, ఆ సొత్తుతో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి విక్రయించే ముగ్గురు సభ్యుల ముఠాను సింగరాయకొండ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నాలుగున్నర కిలోల గంజాయి, రూ.10లక్షల విలువ చేసే వివిధ రకాల వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ చావా హజరత్తయ్య వివరాలను వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. సింగరాయకొండ పంచాయతీ పరిధిలోని గుజ్జల యల్లమందారెడ్డి నగర్‌కు చెందిన కుంచాల గురవమ్మ శనక్కాయలు అమ్ముకుంటూ జీవనం సాగించేది. దానిద్వారా వచ్చే నగదు సరిపోవడంలేదని అడ్డదారిలో సంపాదించాలనే అత్యాశతో గంజాయి రవాణా చేయడం ప్రారంభించింది. రైలులో రాజమండ్రి వెళ్లి అక్కడ గంజాయిని కిలో రూ.1,500 చొప్పు కొనుగోలు చేసి దాన్ని చిన్నచిన్న ప్యాకెట్లగా చేసి కేజీ రూ.10వేలకు విక్రయిస్తోంది. ఈక్రమంలో దొంగతనాలకు పాల్పడుతూ అక్రమంగా నగదు సంపాదిస్తున్న ఒంగోలు మండలం పేర్నమిట్టకు చెందిన చిడితోటి మధుబాబు, బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కొమ్మినేనివారిపాలేనికి చెందిన రాకూరి దుర్గారావు, తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లెకు చెందిన కళ్లెం రవికుమార్‌లకు గురవమ్మతో పరిచయం ఏర్పడింది. దొంగతనాలతోపాటు గంజాయి అమ్మకాల ద్వారా అధిక నగదు సంపాదించాలన్న దురాశతో వారు తరచూ గురవమ్మ దగ్గర గంజాయిని కొనుగోలు చేసి అమ్మకాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ముగ్గురు నిందితులు మధుబాబు, దుర్గారావు, రవికుమార్ గంజాయి ప్యాకెట్ల కోసం గుజ్జల యలమందారెడ్డి నగర్‌లోని గురవమ్మ దగ్గరకు వచ్చారు. ఒక్కొక్కరు కిలో గంజాయి కావాలని ఆమెను అడిగారు. ఆమె వెంటనే గోతం సంచిలో నుంచి గంజాయి ప్యాకెట్లు తీసి ఇస్తుండగా సింగరాయకొండ సీఐ హజరత్తయ్య, ఎస్సై బి.మహేంద్ర సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. పోలీసుల రాకను గమనించి పరారవుతున్న నలుగురినీ అరెస్ట్ చేశారు. అనంతరం నిందితులను పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించగా అందులో మధుబాబు, దుర్గారావు, రవికుమార్‌లు రాష్ట్రంలోని పలు జిల్లాలలో దొంగతనాలకు పాల్పడినట్లు తేలింది. వారిపై వివిధ పోలీస్ స్టేషన్లలో 13 కేసులు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అనంతరం నిందితుల నుంచి రూ.10 లక్షల విలువచేసే 3 సవర్ల బంగార ఆభరణాలు, పావు కిలో వెండి, ఇత్తడి, రాగి వస్తువులు, అమ్మవారి పంచలోహ విగ్రహం, శిలాతోరణం, పలు ఎలక్ర్టానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పలు జిల్లాలలో దొంగతనాలకు పాల్పడుతూ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న అంతర్ జిల్లాల దొంగల ముఠాను,గంజాయి సరఫరా చేసే నిందితులను చాకచక్యంగా పట్టుకొన్న సీఐ హజరత్తయ్య, ఎస్సై మహేంద్ర, సిబ్బందిని ఎస్పీ దామోదర్, డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు అభినందించారు.