నిధులు మంజూరు చేసి భూసేకరణ చేపట్టాలి
ABN , Publish Date - Nov 12 , 2025 | 11:11 PM
గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగించేందుకు ప్రభుత్వం తక్షణమే నిధులు మంజూరు చేసి భూసేకరణ ప్రక్రియ చేపట్టాలని నల్లమడ రైతు సంఘం అధ్యక్షుడు డాక్టర్ కొల్లా రాజమోహన్ కోరారు.
గుంటూరు చానల్‌ను పర్చూరు వరకు పొడిగించాలి
లేకుంటే ఆందోళన తప్పదు
నల్లమడ రైతుసంఘం అధ్యక్షుడు డాక్టర్ కొల్లా రాజమోహన్
పర్చూరు, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగించేందుకు ప్రభుత్వం తక్షణమే నిధులు మంజూరు చేసి భూసేకరణ ప్రక్రియ చేపట్టాలని నల్లమడ రైతు సంఘం అధ్యక్షుడు డాక్టర్ కొల్లా రాజమోహన్ కోరారు. బుధవారం పర్చూరులోని కొల్లావారి కల్యాణ మండప ప్రాంగణంలో నల్లమడ సంఘం ఆధ్వర్యంలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చానల్‌కు సంబంధించి గుంటూరు జిల్లాలో భూసేకరణకు గజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారని, భూసేకరణ ప్రక్రియ కూడా కొనసాగుతోందని చెప్పారు. గుంటూరు ఛానల్‌ను పర్చూరుకు పొడిగించే విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కనిపించటం లేదన్నారు. ఇలా జరిగే రైతులతోపాటు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని చెప్పారు. చానల్ పొడిగింపు కోసం నల్లమడ రైతుసంఘం ఎనిమిది దశాబ్ధాల నుంచి పోరాటం చేస్తోందన్నారు. దీనిపై ప్రభుత్వ తాత్సారం చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమించక తప్పదని హెచ్చరించారు. అనంతరం నల్లమడ రైతు సంఘ నాయకులు అడ్డగడ్డ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తే వేల ఎకరాలకు సాగునీటితోపాటు, ప్రజలకు తాగునీరు కూడా అందుతుందన్నారు. ప్రభుత్వం ప్రజలు, రైతులను దృష్టిలో ఉంచుకొని ఛానల్ పొడిగింపుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జగన్నాథం, రావి రమణయ్య చౌదరి, గడ్డిపాటి శ్రీనివాసరావు, భ్రమరాంబ, కాపు సాంబశివరావు, కొల్లా వెంకయ్యచౌదరి, నరిశెట్టి బాబు, మొవ్వా పెద్దన్న కొల్లా నాగేశ్వరరావు, ఒగ్గిశెట్టి నరసింహం పాల్గొన్నారు.