నిధులకు భరోసా
ABN , Publish Date - Sep 13 , 2025 | 01:25 AM
పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన వెలిగొండ ప్రాజెక్టుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. నిర్థిష్ట చర్యలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. తాను ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ఎట్టిపరిస్థితుల్లోనూ వచ్చే ఏడాది జూన్‌కు తొలిదశ పనులు పూర్తిచేసి నీరు ఇవ్వాల్సిందేనని గురువారం ప్రాజెక్టులపై నిర్వహించిన సమీక్షలో స్పష్టం చేశారు.
వెలిగొండపై సీఎం సమీక్ష
పనుల పూర్తికి స్పష్టమైన ఆదేశం
హామీ ప్రకారం తొలిదశ పూర్తికి చర్యలు
రూ.2,059 కోట్లు అవసరమని అధికారుల ప్రతిపాదన
వెంటనే అంగీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
పెండింగ్‌లో ఉన్న రూ.456 కోట్లకు తక్షణం క్లియరెన్స్
పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన వెలిగొండ ప్రాజెక్టుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. నిర్థిష్ట చర్యలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. తాను ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ఎట్టిపరిస్థితుల్లోనూ వచ్చే ఏడాది జూన్‌కు తొలిదశ పనులు పూర్తిచేసి నీరు ఇవ్వాల్సిందేనని గురువారం ప్రాజెక్టులపై నిర్వహించిన సమీక్షలో స్పష్టం చేశారు. లక్ష్యానికి అనుగుణంగా పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేసమయంలో నిర్ణీత గడువులోపు పనుల పూర్తి, పునరావాస చర్యలకు అవసరమైన నిధులపై అధికారులకు భరోసా ఇచ్చారు.
ఒంగోలు, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): తాజా అంచనాల ప్రకారం వెలిగొండ ప్రాజెక్టు వ్యయ అంచనా సుమారు రూ.10వేల కోట్లకు చేరుతుండగా అందుకనుగుణంగా ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలోని పశ్చిమ ప్రాంతంపై సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. అందులో భాగంగా ఆ ప్రాంతానికి అత్యంత కీలకమైన వెలిగొండ పూర్తిపై పలు సందర్భాలలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులకు భరోసా ఇస్తున్న సీఎం.. అందుకు అవసరమైన చర్యలపై సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు, ఇతర సందర్భాలలోనూ 2026 జూన్ నాటికి వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ పూర్తిచేసి నీరివ్వనున్నట్లు సీఎం ప్రకటించి ఉన్నారు. ఆ మాటకు కట్టుబడి ఉన్నానని, తదనుగుణంగా పనులు పూర్తి చేయాల్సిందేనని మరోసారి ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు.
తక్షణం రూ.2వేల కోట్లు కావాలి
రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ ప్రాజెక్టు పనులపై గురు వారం సచివాలయంలో జలవనరుల శాఖ అధికారులతో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష చేశారు. అందులో వెలిగొండ ప్రాజెక్టుపై లోతుగా సమీక్షించారు. రాష్ట్రస్థాయి జలవనరుల శాఖ ఉన్నతాధికారులతోపాటు ఇక్కడి నుంచి ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్, ఎస్‌ఈ అబూత్ ఆలీంలు పాల్గొన్నారు. ఇప్పటివరకు ప్రాజెక్టుకు సుమారు రూ.6వేల కోట్ల వరకు వెచ్చించారు. టన్నెళ్ల తవ్వకాలు, డ్యాంల నిర్మాణాలు, ప్రధాన కాలువల తవ్వకాలు, హెడ్ రెగ్యులేటరీ నిర్మాణం తదితర అనేక పనులు జరిగాయి. కాగా సీఎం ఆదేశాల మేరకు వచ్చే జూన్‌కు తొలిదశ పనులు పూర్తిచేసి లక్షా 19వేల ఎకరాలకు సాగునీరు, 8లక్షల మందికి తాగునీరు ఇవ్వాలంటే సుమారు రూ.2,059 కోట్లు నిధులు అవసరమని ఆ సమీక్షలో అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అందులో ఫీడర్ కాలువ లైనింగ్ పనులకు సంబంధించి రూ.456 కోట్లు పనులకు ఆర్థికశాఖ నుంచి అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు.
సీఎంవో అధికారులకు ఆదేశాలు
ఆయా ఫ్యాకేజీల వారీగా నిధులు ఇచ్చేందుకు సమీక్షా సమావేశంలో అధికారులకు సీఎం చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారు. ఆర్థిక శాఖలో పెండింగ్‌లో ఉన్న అనుమతులు తక్షణం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎంవో అధికారులను ఆదేశించిన ఆయన పునరావాస చర్యలకు అవసరమైన నిధులను తాను చూసుకుంటానన్నారు. మిగిలిన పనులకు సంబంధించి ఉన్నత స్థాయి అధికారులు అవసరానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ రకంగా నిధుల విషయంలో అదికారులకు భరోసా ఇచ్చిన సీఎం ఎట్టి పరిస్థితుల్లో తాను ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం వచ్చే జూన్‌కు తొలిదశ పనులు పూర్తిచేసి ప్రాజెక్టుకు నీరు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. మొత్తం మీద ప్రభుత్వ చర్యలు, సీఎం ఆదేశాలు వెలిగొండపై ఆశాజనక పరిస్థితిని సూచిస్తున్నాయి.