Share News

పడిగాపులకు ఫుల్‌స్టాప్‌!

ABN , Publish Date - Jun 01 , 2025 | 01:33 AM

జిల్లాలో రేషన్‌ షాపుల ద్వారా ఆదివారం నుంచి సరుకుల పంపిణీకి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో ఇప్పటికే జిల్లావ్యాప్తంగా అన్ని షాపులను ఆన్‌లైన్‌ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో మొబైల్‌ వాహనాల ద్వారా ఇంటింటికీ పంపిణీ అంటూ ఆర్భాటపు ప్రచారం చేసి కేవలం ఒక ప్రాంతంలోనే ఆ వాహనాలను నిలిపి అందజేసేవారు.

పడిగాపులకు ఫుల్‌స్టాప్‌!
దొనకొండ మండలం ఒబ్బాపురంలో రేషన్‌ పంపిణీకి సిద్ధమైన దుకాణం

పాత విధానంలోనే రేషన్‌

నేడు జిల్లావ్యాప్తంగా ప్రారంభం

నాలుగేళ్ల అనంతరం దుకాణాల వద్దే పంపిణీ

భారీ ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం

ఒంగోలు కలెక్టరేట్‌, మే 31 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో రేషన్‌ షాపుల ద్వారా ఆదివారం నుంచి సరుకుల పంపిణీకి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో ఇప్పటికే జిల్లావ్యాప్తంగా అన్ని షాపులను ఆన్‌లైన్‌ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో మొబైల్‌ వాహనాల ద్వారా ఇంటింటికీ పంపిణీ అంటూ ఆర్భాటపు ప్రచారం చేసి కేవలం ఒక ప్రాంతంలోనే ఆ వాహనాలను నిలిపి అందజేసేవారు. దీంతో కార్డుదారులు పనులు మానుకొని ఎదురుచూడాల్సి వచ్చేది. అయితే నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ విధానంపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసింది. అనేక లోటుపాట్లు ఉన్నట్లు గుర్తించింది. పాత పద్ధతిలోనే కార్డుదారులకు రేషన్‌ పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో 1,392 రేషన్‌ షాపుల పరిధిలో 6,61,206 కార్డులు ఉన్నాయి.

పండుగ వాతావరణంలో ప్రారంభం

పండుగ వాతావరణంలో పాత విధానంలో రేషన్‌ దుకాణాల వద్ద సరుకుల పంపిణీకి ఇప్పటికే అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. జిల్లాలోని ముఖ్యమైన ప్రజాప్రతినిధుల ద్వారా అట్టహాసంగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా రేషన్‌ షాపులను పరిశీలించగా, జాయింట్‌ కలెక్టర్‌ గోపాలకృష్ణ డీలర్లతో సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. మరోవైపు డివిజనల్‌ రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లు వారి పరిధిలోని రేషన్‌ షాపులను పరిశీలించి డీలర్లకు సరుకుల పంపిణీపై పలు సూచనలు చేశారు. ఆదివారం ఉదయం 8గంటల నుంచి జిల్లావ్యాప్తంగా రేషన్‌ పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Updated Date - Jun 01 , 2025 | 01:33 AM