Share News

మహిళను హింసించిన కేసులో నలుగురు అరెస్టు

ABN , Publish Date - Sep 20 , 2025 | 02:31 AM

తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు గ్రామంలోని ఎస్టీకాలనీలో మహిళను చిత్రహింసలకు గురిచేసిన కేసులో నలుగురిని అరెస్ట్‌ చేసినట్లు పొదిలి సీఐ టి.వెంకటేశ్వర్లు చెప్పారు. స్థానిక కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.

మహిళను హింసించిన కేసులో నలుగురు అరెస్టు
విలేకరులకు వివరాలను వెల్లడిస్తున్న సీఐ వెంకటేశ్వర్లు, తర్లుపాడు ఎస్సై బ్రహ్మనాయుడు

వివరాలను వెల్లడించిన పొదిలి సీఐ వెంకటేశ్వర్లు

పొదిలి, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు గ్రామంలోని ఎస్టీకాలనీలో మహిళను చిత్రహింసలకు గురిచేసిన కేసులో నలుగురిని అరెస్ట్‌ చేసినట్లు పొదిలి సీఐ టి.వెంకటేశ్వర్లు చెప్పారు. స్థానిక కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. కాలనీకి చెందిన భాగ్యలక్ష్మి చేతులను కట్టేసి ఈనెల 13వ తేదీన భర్త బాలాజీ చిత్రహింసలకు గురిచేశాడు. దీనిపై బాధితురాలు భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితులైన బాలాజీ, పోలా పద్మావతి, పిల్లి రమణమ్మ, జగన్నాధం విష్ణువర్ధన్‌లను శుక్రవారం కలుజువ్వలపాడు ఎస్టీకాలనీలో అరెస్ట్‌ చేశారు. సుమారు 12ఏళ్ల క్రితం భాగ్యలక్ష్మి, బాలాజీలు ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి నలుగురు సంతానం. బాలాజీ మద్యానికి బానిసై భాగ్యలక్ష్మిని తరచూ కొట్టడం, వేధించడంతోపాటు అవమానాలకు గురిచేస్తున్నాడు. ఈక్రమంలో మూడేళ్లుగా తన సమీప బంధువు పోలా పద్మావతితో బాలాజీ వివాహేతర సంబంధం పెట్టుకొని హైదరాబాద్‌లో ఉంటున్నాడు. అప్పటి నుంచి భాగ్యలక్ష్మి కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషిస్తోంది. ఈతరుణంలో ఈనెల 13వ తేదీ రాత్రి 9.30 సమయంలో భర్త బాలాజీతోపాటు పైముగ్గురు నిందితులు.. ఇంటికెళుతున్న భాగ్యలక్ష్మిని ఆపి రమణమ్మ ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం బాలాజీ భాగ్యలక్ష్మి చేతులు కట్టేసి బెల్ట్‌తో కొడుతూ చిత్రహింసలు గురిచేశారు. అంతటితో ఆగకుండా కత్తితో పొడి చంపుతానని బెదిరించారు. 14వ తేదీ ఉదయం 5.30 గంటలకు భాగ్యలక్ష్మిని ఆమె ఇంటివద్ద వదిలి నిందితులు వెళ్లిపోయారు. మరలా తిరిగి 15వ తేదీ సాయంత్రం బాలాజీ బెదిరించడంతో భయాందోళనకు గురైన భాగ్యలక్ష్మి ఇంటినుంచి వెళ్లిపోయి తర్లుపాడు పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి నిందితులను శుక్రవారం అరెస్ట్‌ చేసినట్లు సీఐ చెప్పారు. వారి వద్ద నుంచి లెదర్‌బెల్ట్‌, కత్తి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయాధికారి 14 రోజులు రిమాండ్‌ విధించినట్లు చెప్పారు. దర్శి డీఎస్పీ ఆధ్వర్యంలో పొదిలి సీఐ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో కేసును త్వరగా ఛేదించినందుకు ఎస్‌ఐ బ్రహ్మనాయుడిని, సిబ్బందిని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ప్రత్యేకంగా అభినందించారు.

Updated Date - Sep 20 , 2025 | 02:31 AM