Share News

కొత్త పంచాయతీల ఏర్పాటు

ABN , Publish Date - Nov 30 , 2025 | 01:11 AM

రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పునర్‌వ్యవస్థీకరణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీల విభజన, విలీనంపై ఐదేళ్లుగా అమలులో ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో జిల్లాలో పరిపాలన సౌలభ్యం కోసం కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటుకు, ఇప్పటికే ఉన్న వాటిని సమీప పట్టణ, స్థానిక సంస్థల్లో విలీనం చేసేందుకు మార్గం సుగమమైంది.

కొత్త పంచాయతీల ఏర్పాటు

విలీనానికి మార్గం సుగమం

2020 ఎన్నికల సమయంలో విధించిన నిషేధాన్ని ఎత్తివేసిన ప్రభుత్వం

ఒంగోలు కలెక్టరేట్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పునర్‌వ్యవస్థీకరణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీల విభజన, విలీనంపై ఐదేళ్లుగా అమలులో ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో జిల్లాలో పరిపాలన సౌలభ్యం కోసం కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటుకు, ఇప్పటికే ఉన్న వాటిని సమీప పట్టణ, స్థానిక సంస్థల్లో విలీనం చేసేందుకు మార్గం సుగమమైంది. గ్రామపంచాయతీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించేందుకు 2020 మార్చిలో ప్రభుత్వం పంచాయతీల పునర్‌వ్యవస్థీకరణపై పూర్తిస్థాయిలో నిషేధం విధించింది. దీంతో పెద్ద గ్రామపంచాయతీలను విభజించడం, చిన్న పంచాయతీలను సమీపంలోని నగర పంచాయతీలు, మునిసిపాలిటీలలో విలీనం చేయడం వంటి ప్రక్రియ నిలిచిపోయింది. ఈ నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో ప్రతిపాదనలను పరిశీలించి ఆ నిషేధాన్ని తొలగిస్తూ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ 97 జీవోను జారీ చేశారు. తదుపరి అవసరమైన చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ను ఆదేశించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రం, జిల్లాలో కొత్త పంచాయతీల ఏర్పాటు ప్రక్రి య మళ్లీ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది మార్చి నెలాఖ రుకు గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, వార్డు సభ్యుల పదవీ కాలం ముగియనుంది. ఇక పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాలో ఎన్నో ఏళ్ల నుంచి పంచాయతీల విభజన చేయాలని ప్రతిపాదనలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రక్రియను ఎన్నికలు జరిగే లోపు పూర్తిచేయాల్సి ఉండటంతో తదనుగుణంగా జిల్లా పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టనున్నారు. పంచాయతీల విభజన, విలీనంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడంతో జిల్లాలో ఇప్పుడు కొత్త పంచాయతీల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఆయా నియోజకవర్గాల నుంచి వచ్చే ప్రతిపాదనలను అనుగుణంగా చర్యలు తీసుకోనున్నారు.

Updated Date - Nov 30 , 2025 | 01:11 AM