Share News

‘మీకోసం’.. అధికారుల మోసం...!

ABN , Publish Date - Oct 06 , 2025 | 11:30 PM

పెద్దారవీడు, మండలంలో ప్రభుత్వ పాలన సజావుగా సాగడం లేదు. ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి సోమవారం మీ కోసం కార్యక్రమం నిర్వహిస్తుంది. ఆ కార్యక్రమానికి మండల స్థాయి అధికారులు, లేకపోతే వారి తరపున ఆయా శాఖలకు సంబంధించిన మిగిలిన అధికారులు తప్పక హాజరుకావాలి.

‘మీకోసం’.. అధికారుల మోసం...!
మీ కోసం కార్యక్రమానికి రాకుండానే సంతకాలు చేసిన తహసీల్దార్‌ దిలీ్‌పకుమార్‌, ఆర్‌ఐ గోపి

కార్యక్రమానికి రాకుండానే తహసీల్దార్‌, ఆర్‌ఐ సంతకాలు

మండలంలో అధికారులు లేనట్లేనా?

పెద్దారవీడు, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి) : మండలంలో ప్రభుత్వ పాలన సజావుగా సాగడం లేదు. ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి సోమవారం మీ కోసం కార్యక్రమం నిర్వహిస్తుంది. ఆ కార్యక్రమానికి మండల స్థాయి అధికారులు, లేకపోతే వారి తరపున ఆయా శాఖలకు సంబంధించిన మిగిలిన అధికారులు తప్పక హాజరుకావాలి. ప్రజల నుంచి వచ్చిన వినతిపత్రాలను తీసుకొని ఆయా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు పరిష్కరించాలి. లేకపోతే సదరు కారణాలను అర్జీదారునికి తప్పక తెలియజేయాలి.

తూతూమంత్రంగా మీ కోసం

పెద్దారవీడు మండలంలో మీ కోసం కార్యక్రమం నిర్వహించడమే గగనంగా మారింది. సాధారణంగా మీ కోసం కార్యక్రమం మండల తహసీల్దార్‌ నేతృత్వంలో జరగాల్సి ఉంది. కానీ పెద్దారవీడులో అలా జరుగుతున్న దాఖలా కనిపించడం లేదు. సాంకేతిక సమస్యల కారణంగా వీడియో కాన్ఫరెన్స్‌ పనిముట్లు పనిచేయడం లేదని మీకోసం కార్యక్రమాన్ని నెలల తరబడి మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మండలంలోని అన్ని శాఖల అధికారులు హాజరుకావాలి. ప్రజల నుంచి డివిజన్‌ కేంద్రమైన మార్కాపురంలో సబ్‌కలెక్టర్‌కు, కలెక్టర్‌కు వచ్చే అర్జీలపై వారికి సమాధాన చెప్పాల్సి ఉంటుంది. కానీ అధికారులెవ్వరూ మీకోసం కార్యక్రమానికి హాజరుకావడం లేదు.


మీ కోసంలో ఒకే ఒక్కడు..

స్థానిక ఎంపీడీవో కార్యక్రమంలో సోమవారం జరిగిన మీ కోసం కార్యక్రమంలో ఒకే ఒక్క అధికారి హాజరయ్యాడు. కార్యక్రమాన్ని తన ఆధ్వర్యంలో నిర్వహించాల్సి తహసీల్దార్‌, ఎంఆర్‌ఐలు కార్యక్రమానికి హాజరుకాకుండానే అటెండెన్స్‌ రిజిస్టర్‌లో సంతకాలు చేసి మమ అనిపించారు. ఇతర శాఖల అధికారులెవ్వరూ మీ కోసం కార్యక్రమానికి హాజరుకాలేదు. హాజరైన ఎంపీడీవో ఎస్‌.జాన్‌సుందరం మద్దలకట్ట పంచాయతీ చాట్లమడ నుంచి వితంతువు దుగ్గెల వెంకట సుబ్బయ్య నుంచి వితంతు పింఛన్‌ కోసం వచ్చిన అర్జీని తీసుకున్నారు.

Updated Date - Oct 06 , 2025 | 11:30 PM