భూమి కోసం.. కాళ్లరిగేలా..!
ABN , Publish Date - Nov 18 , 2025 | 01:33 AM
పది ఎకరాల తన భూమిని ఆన్‌లైన్ చేయాలని కోరుతూ ఐదేళ్లుగా ముగ్గురు ఆర్డీవోలు, తొమ్మిది మంది తహసీల్దార్లకు 100 అర్జీలు ఇచ్చినా పట్టించుకోకుండా తిప్పుకుంటున్నారని వృద్ధుడు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని కలెక్టరేట్‌లోని స్పందన హాలులో సోమవారం జరిగిన మీకోసంలో జేసీని మర్రిపూడి మండలం అయ్యప్పరాజుపాలెం గ్రామానికి చెందిన వడ్డెమాని శింగయ్య వేడుకున్నారు.
తొమ్మిది మంది తహసీల్దార్లు.. 100 అర్జీలు..
ఆన్‌లైన్ కోసం ఐదేళ్లుగా తిరుగుతున్న వృద్ధుడు
ఒంగోలు కార్పొరేషన్, నవంబరు17(ఆంధ్రజ్యోతి): పది ఎకరాల తన భూమిని ఆన్‌లైన్ చేయాలని కోరుతూ ఐదేళ్లుగా ముగ్గురు ఆర్డీవోలు, తొమ్మిది మంది తహసీల్దార్లకు 100 అర్జీలు ఇచ్చినా పట్టించుకోకుండా తిప్పుకుంటున్నారని వృద్ధుడు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని కలెక్టరేట్‌లోని స్పందన హాలులో సోమవారం జరిగిన మీకోసంలో జేసీని మర్రిపూడి మండలం అయ్యప్పరాజుపాలెం గ్రామానికి చెందిన వడ్డెమాని శింగయ్య వేడుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. పూర్వీకుల నుంచి పది ఎకరాల భూమి తనకు వచ్చిందన్నారు. దాని ఆన్‌లైన్ కోసం ఐదేళ్లుగా తహసీల్దారు, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా సమస్య నేటికీ పరిష్కారం కాలేదన్నారు. ఒకవైపు అధికారుల చుట్టూ తిరిగేందుకు డబ్బులు లేక, మరోవైపు వయసు మీదపడి ఆరోగ్యం సహకరించక అల్లాడిపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వలన తన భూమి ఆన్‌లైన్ నమోదు చేయడం లేదని, ఇక తనకు తిరిగే ఓపిక కూడా లేదని శింగయ్య తెలిపారు. ఇప్పటికైనా తన గోడు ఆలకించి, న్యాయం చేయాలని జిల్లా ఉన్నతాధికారులను వేడుకున్నారు.