ఎన్నాళ్లకెన్నాళ్లకు..
ABN , Publish Date - Jul 18 , 2025 | 11:40 PM
ఖరీఫ్ ప్రారంభంలో ముఖం చాటేశాడనుకున్న వరుణుడు ఎట్టకేలకు కరుణించాడు. గురువారం అర్ధరాత్రి 1 గంట నుంచి 5 గంటల వరకు వర్షం కురిసింది. దీంతో పశ్చిమ ప్రాంతంలోని చెరువులలో జలకళ సంతరించుకుంది. మండలంలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి కాల్వలు నిండాయి. పుచ్చకాయలపల్లి పొలాల మధ్యలో ఉన్న నల్లకాల్వ పొంగి పొరిలింది. పెద్దారవీడు-పుచ్చకాయలపల్లి మధ్య ఉన్న చప్టాపై నుంచి వర్షపునీరు ప్రవహించింది
పలు మండలాల్లో భారీ వర్షం పంటలకు జీవం
పొంగిన వాగులు, నిండుతున్న చెరువులు, కుంటలు
పెద్దారవీడు, జూలై 18(ఆంధ్రజ్యోతి): ఖరీఫ్ ప్రారంభంలో ముఖం చాటేశాడనుకున్న వరుణుడు ఎట్టకేలకు కరుణించాడు. గురువారం అర్ధరాత్రి 1 గంట నుంచి 5 గంటల వరకు వర్షం కురిసింది. దీంతో పశ్చిమ ప్రాంతంలోని చెరువులలో జలకళ సంతరించుకుంది. మండలంలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి కాల్వలు నిండాయి. పుచ్చకాయలపల్లి పొలాల మధ్యలో ఉన్న నల్లకాల్వ పొంగి పొరిలింది. పెద్దారవీడు-పుచ్చకాయలపల్లి మధ్య ఉన్న చప్టాపై నుంచి వర్షపునీరు ప్రవహించింది. పుచ్చకాయపల్లి పొలాలు వర్షపునీటితో నిండిపోయాయి. పెద్దారవీడు చెరువులో నీళ్లు కనబడి సుమారు 14 యేళ్లు దాటింది. గురువారం రాత్రి కురిసిన వర్షంతో జలకళ సంతరించుకుందని రైతులు చెబుతున్నారు. పుచ్చకాయలపల్లి నుంచి వచ్చే వర్షపునీటితో పెద్దారవీడు చెరువు సుమారు సగం వరకూ నిండింది. ఇలాగే మరో వర్షం కురిస్తే చెరువు ఆయకట్టు కింద పంటలు సాగు అవుతాయని, బోర్లలో నీరు పెరుగుతుందని రైతులు చెబుతున్నారు.
నీట మునిగిన పత్తి
పెద్దారవీడు-జమ్మనపల్లి మధ్య పత్తి సాగు చేసిన పొలాలు నీట మునిగాయి. దీంతో ఆయా రైతులు కాల్వలు తీసి వర్షపు నీటిని బయటకు పంపుతున్నారు. నీట మునిగినప్పటికీ ఇటువర్షంతో మేలు జరుగుతుందని రైతులు చెబుతున్నారు. పెద్దారవీడు మండల పరిధిలో ఉన్న వెలిగొండ మైనర్ కాల్వలలో వర్షపునీరు ప్రవహిస్తోంది.
పొంగిన వాగులు
జాతీయ రహదారిపై నిలిచిన ట్రాఫిక్
పుల్లలచెరువు : పుల్లలచెరువు మండలంలో వేకువజామున భారీ వర్షం కురిసింది. ఓ వైపు సాగు చేసిన పంటలు వాడు ముఖం పట్టాయని రైతులు ఆందోళనలో ఉన్న వేళ కురిసిన వర్షం మెట్టపైర్లకు జీవం పోసింది. పంటలకు ఊరట నిచ్చింది. పుల్లలచెరువు మండల వ్యాప్తంగా 49.4 మీ.మీ వర్ష పాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.నల్లమలఫారెస్టులో భారీ వర్షం కురువడంతో పుల్లలచెరువు మండలంలోని జాతీయ రహదారి 565పై మురికిమల్ల తాండ-శిరిగిరిపాడు మధ్యలో జరుగుతున్న రోడ్డు పనుల కారణంగా రోడ్డు నుంచి లారీ జారీ పోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.రహదారి అధికారులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.పుల్లలచెరువు- యర్రగొండపపాలెం రోడ్డుపై చాపలమడుగు వద్ద దువ్వలేరు ఉధృతంగా ప్రవహించడంతో రోడ్డుకు ఇరువైపులా గంట పాటు వాహనాలు నిలిచిపోయాయి.సి.కొత్తపల్లిలో కురిసిన వర్షానికి విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయాయి.
ఈ ఖరీఫ్ సీజన్‌లో ఇదే పెద్ద వర్షం
ఎర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం మండలంలో గురువారం రాత్రి నుంచి వేకువ జాము వరకు 122.4 మీ.మీ వర్షం కురిసింది. భూమి పదునెక్కింది, సాగులో ఉన్న పండ్లతోటలకు, వేసవిపత్తి, మొక్క జొన్న పైర్లకు జీవం పోసిందని రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల నాటిన మిరప , బొప్పాయి , అరటి మొక్కలు నీరు లేక వాడు ముఖం పట్టాయి. ఈతరుణంలో గురువారం రాత్రి కురిసిన వర్షం పైర్లకు జీవం పోసింది. మండలంలో ఇప్పటికే సాగుచేసిన కంది, పత్తితో పాటు పెసర,మినుము, జొన్న పైర్లు వేసేందుకు రైతులు సిద్ధం అవుతున్నారు.
నిండిన కుంటలు, చెక్ డ్యామ్‌లు
ఎర్రగొండపాలెం రూరల్ : మండలంలోని బోయలపల్లి, అమానిగుడిపాడు, తమ్మడపల్లి, వెంకటాద్రిపాలెం, గోళ్ళవిడిపి గ్రామాలతో పా టు పలు గ్రామాలలో గురువారం రాత్రి వ ర్షం కురిసింది. మండలం వ్యాప్తంగా 122.4 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదైందని రెవెన్యూ అధికారులు తెలిపారు ఈ వర్షంతో సాగులో ఉన్న పంటలకు ఎంతో మేలు చేకూరుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బోయలపల్లి, గురిజేపల్లి, అమానిగుడిపాడు గ్రామాలలో ఉన్న చెరువులకు నీరు చేరింది. నీటి కుంటలు, చెక్ డ్యామ్‌లలో నీరు ప్రవహిస్తున్నాయని ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు.