ఉపాధి కూలీలకు ఈకేవైసీ ప్రక్రియ వేగవంతం
ABN , Publish Date - Oct 17 , 2025 | 09:54 PM
జాతీయ గ్రామీణా ఉపాధి హామీ పథకంలో నకిలీ జాబ్ కార్డులను (శ్రామికులను) ఏరిపారేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. అందుకుగాను శ్రామికులకు ఈకేవైసీని తప్పనిసరి చేయాలని ఆదేశించింది. దీనితో పనులకు వచ్చే శ్రామికులకు ఈకేవైసి చేసే పనిలో సిబ్బంది నిమగ్నమైయ్యారు.
10 వేలకు పైగా వలస వెళ్లిన శ్రామికులు
ఎర్రగొండపాలెం రూరల్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): జాతీయ గ్రామీణా ఉపాధి హామీ పథకంలో నకిలీ జాబ్ కార్డులను (శ్రామికులను) ఏరిపారేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. అందుకుగాను శ్రామికులకు ఈకేవైసీని తప్పనిసరి చేయాలని ఆదేశించింది. దీనితో పనులకు వచ్చే శ్రామికులకు ఈకేవైసి చేసే పనిలో సిబ్బంది నిమగ్నమైయ్యారు. ఈ నెల చివరి నాటికి పూర్తి చేయాలని జిల్లా స్థాయి అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ఎర్రగొండపాలెం మండలం వ్యాప్తంగా ఉన్న 19 గ్రామ పంచాయతీల పరిధిలోని ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు ఈకేవైసీ పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మండల వ్యాప్తంగా 19 పంచాయతీల్లో మొత్తం సుమారు 19వేల జాబ్ కార్డులు ఉన్నాయి. ఆ జాబ్ కార్డులకు సుమారు 37వేల మందికిపైగా కూలీలు ఉన్నారు. నేటి వరకు సుమారు 17వేల మందికి ఈకేవైసీని సిబ్బంది పూర్తి చేసినట్లు ఏపీవో శైలజ శుక్రవారం తెలిపారు.
వలస వెళ్లిన వారి పరిస్థితి ఏమిటి?
వెనుకబడిన ప్రాంతమైన ఎర్రగొండపాలెం మండలంలోని పలు గ్రామాలలోకార్మికులు ఇతర ప్రాంతాలకు (తెలంగాణా, కర్ణాటక, బెంగళూరు) పనుల నిమిత్తం సుమారు 10వేలకు పైగా వలసలకు వెళ్లినట్లు తెలుస్తోంది. మరి వారి పరిస్థితి ఏమిటనేది ప్రశ్నగా మారింది. వీరంతా ఈకేవైసీ చేసుకుంటేనే నవంబరు 1వ తేదీ నుంచి పనులకు గాని ఉద్యాన పథకాలకు అర్హులని అధికారులు చెబుతున్నారు. మరి వీరంతా ఈ పదిరోజుల్లో వచ్చి ఈకేవైసీ చేయించుకుంటారా లేదా అనేది చూడాల్సి ఉంది.
తప్పనిసరని చెబుతున్నాం
- ఏపీవో శైలజ
మండలంలోని చాల గ్రామాలలో కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. ఆయా గామ్రాలలోని ఫిల్డ్ అసిస్టెంట్ల ద్వారా వారికి సమాచారం ఇవ్వడంతో పాటు ఈకేవైసీ తప్పనిసరి అని చెబుతున్నాం. దగ్గరలో ఉన్నవారు, ఈ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉన్న వారు వచ్చి ఈకేవైసీ చేయించుకుంటున్నారు. మిగిలిన వారికి కూడా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నాం.