Share News

ఒంగోలులో ఫ్లెక్సీల రగడ!

ABN , Publish Date - Jul 22 , 2025 | 11:24 PM

ఒంగోలులో మరోసారి ఫ్లెక్సీల రగడ చోటుచేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నటించిన హరిహర వీరమల్లు చిత్రం విడుదల సందర్భంగా మాజీ మంత్రి, జనసేన నాయుకుడు బాలినేని శ్రీనివాసులరెడ్డి అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఒంగోలు కార్పొరేషన్‌ అధికారులు మంగళవారం తొలగించారు.

ఒంగోలులో ఫ్లెక్సీల రగడ!
ఫ్లెక్సీలను తొలగిస్తున్న సిబ్బంది

‘హరిహర వీరమల్లు’ చిత్రం విడుదల సందర్భంగా ఏర్పాటు

చర్చి సెంటర్‌లో తొలగించిన కార్పొరేషన్‌ అధికారులు

ఆగ్రహం వ్యక్తంచేసిన జనసేన కార్పొరేటర్లు

ఒంగోలు కార్పొరేషన్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలులో మరోసారి ఫ్లెక్సీల రగడ చోటుచేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నటించిన హరిహర వీరమల్లు చిత్రం విడుదల సందర్భంగా మాజీ మంత్రి, జనసేన నాయుకుడు బాలినేని శ్రీనివాసులరెడ్డి అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఒంగోలు కార్పొరేషన్‌ అధికారులు మంగళవారం తొలగించారు. దీనిపై జనసేన కార్పొరేటర్లు, బాలినేని అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్‌తో వాగ్వావాదానికి దిగారు. ఒక ఫ్లెక్సీని తిరిగి తీసుకెళ్లి చర్చిసెంటర్‌లో ఏర్పాటు చేశారు.

ప్రధాన సెంటర్‌లలో భారీగా ఏర్పాటు

బాలినేని అభిమానుల ఆధ్వర్యంలో నగరంలోని పలు ప్రధాన సెంటర్లలో పవన్‌ కల్యాణ్‌, బాలినేని,ఆయన తనయుడు ప్రణీత్‌రెడ్డి ఫొటోలతోభారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వీటిలో స్థానిక జేఎంబీ చర్చి సెంటర్‌ వద్ద ఉన్న మూడింటిని కార్పొరేషన్‌ అధికారులు తొలగించారు. విషయం తెలుసుకున్న జనసేన కార్పొరేటర్లు కమిషనర్‌ వెంకటేశ్వరరావును కలిసి ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగా తొలగించలేదని, ఆ ప్రాంతంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రజలకు ఇబ్బందిగా ఉన్నందున తీసివేశామని ఆయన వారికి వివరించారు. అప్పటికే ఆవేశంతో ఉన్న పలువురు జనసేన కార్పొరేటర్లు కమిషనర్‌తో వాగ్వాదానికి దిగారు. తిరిగి ఏర్పాటు చేస్తామని ఆయన బదులిచ్చినా వినిపించుకోకుండా కార్యాలయంలో ఉన్న ఒక ఫ్లెక్సీని తామే స్వయంగా మోసుకెళ్లి తిరిగి చర్చి సెంటర్‌లో ఏర్పాటు చేశారు. అనంతరం జనసేన కార్పొరేటర్‌లు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఫ్లెక్సీలను అధికారులు తొలగించి ప్రొటోకాల్‌ను విస్మరించారని ఆరోపించారు. ఇది ఉద్దేశపూర్వకమేనని మండిపడ్డారు. ఇలా చేయడం తమ మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు. ఫ్లెక్సీ ఏర్పాటు అనంతరం పవన్‌ కల్యాణ్‌ చిత్రానికి జనసేన కార్పొరేటర్లు పాలాభిషేకం చేశారు. మీడియా సమావేశంలో ఒంగోలు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ వెలనాటి మాధవరావు, జనసేన కార్పొరేటర్లు మలగా రమేష్‌, యనమల నాగరాజు, ఈదర వెంకట సురే్‌షబాబు, జడ వెంకటేష్‌ పాల్గొన్నారు.

ఎక్కడపడితే అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు నిషేధం

నగరంలో ఎక్కడపడితే అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదని, డీటీసీపీ నిబంధనల ప్రకారం కార్పొరేషన్‌ అనుమతితో కేటాయించిన ప్రాంతాల్లోనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవాలని నగర కమిషనర్‌ వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో ఫ్లెక్సీ సెంటర్లు, కమర్షియల్‌ షాపుల యజమానులు, ఇతర వ్యాపారస్తులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు గుర్తించాలని కోరారు. ప్రధాన జంక్షన్‌లు, సెంటర్‌ డివైడర్లు, విగ్రహాల కూడలిలో ఫ్లెక్సీలు నిషేధం అని చెప్పారు.

Updated Date - Jul 22 , 2025 | 11:24 PM