Share News

మా రోడ్లను బాగు చేయండి

ABN , Publish Date - Aug 06 , 2025 | 09:54 PM

మండలంలోని పలుగుంటిపల్లి గ్రామం నుంచి అనుములపల్లె మెయిన్‌ రోడ్డు వరకు చేపట్టిన తారు రోడ్డు నిర్మాణ పనులు పట్టించుకోరా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఉపాధి హామీ ద్వారా దాదాపు రూ.55లక్షల నిధులతో ఈ రోడ్డు మంజూరు కాగా, గత వైసీపీ హయాంలో పనులు ప్రారంభించారు.

మా రోడ్లను బాగు చేయండి
తుమ్మలచెరువుకు వెళ్లే రోడ్డు దుస్థితి

రాచర్ల, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని పలుగుంటిపల్లి గ్రామం నుంచి అనుములపల్లె మెయిన్‌ రోడ్డు వరకు చేపట్టిన తారు రోడ్డు నిర్మాణ పనులు పట్టించుకోరా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఉపాధి హామీ ద్వారా దాదాపు రూ.55లక్షల నిధులతో ఈ రోడ్డు మంజూరు కాగా, గత వైసీపీ హయాంలో పనులు ప్రారంభించారు. నిర్మాణ పనుల్లో భాగంగా కంకర కూడా పరిచారు. అనంతరం ఏమైందోగానీ నిర్మాణ పనులు ఆగిపోయాయి. ఉన్న రోడ్డును అలాగే ఉంచకుండా కంకర పరిచి లేని సమస్యలు తెచ్చిపెట్టారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దారిన వచ్చి పోయే వాహనాలు స్లిప్‌ అయి కంకర రాళ్లు లేచి ముఖాలకు తగులుతున్నాయని ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

తుమ్మల చెరువు రోడ్డుకు మోక్షం ఎప్పుడో

తర్లుపాడు : మండలంలోని తర్లుపాడు నుంచి తుమ్మలచెరువుకు వెళ్లే రోడ్డుకు మోక్షం ఎప్పుడు కలుగుతుందోనని ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ రోడ్డు అడుగుకో గుంత, గజానికో గొయ్యి అన్నచందంగా ఉంది. ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. తర్లుపాడు నుంచి తుమ్మలచెరువుకు కేవలం 6 కి.మీ. రోడ్డుపై నిత్యం పదుల సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. ఈ రోడ్డు గుండా వేళ్లే ద్విచక్రవాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ రోడ్డు బాగుచేయాలని గత ఆరేళ్ల నుంచి అనేకసార్లు విన్నవించుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఈ ప్రభుత్వంలోనైనా ఈ రోడ్డుకు మోక్షం కలుగుతుందోనేమని ఆశగా ఎదురు చూస్తున్నారు.

రోడ్లపై గుంతలు పూడ్చండి

పొదిలి : అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాలకు రోడ్లపై గుంతలు పడి ఛిద్రమవుతున్నాయి. పట్టణంలోని మార్కాపురం అడ్డరోడ్డు సమీపంలో పండు చికెన్‌ సెంటర్‌ వద్ద, ఎంపీడీవో కార్యాలయం ముందు, పాతపోస్టాఫీస్‌ వద్ద, చిన్నబస్టాండ్‌ దాటిన తరువాత పొదిలి - ఒంగోలు రహదారిలో గుంతలు ఏర్పడి ప్రమాదాలకు దారితీస్తున్నాయి. గతంలో చిన్నచిన్న మరమ్మతులు చేసినా వర్షాలకు కంకర లేచి ప్రమాదకరంగా మారుతున్నాయి. అధికారులు స్పందించి గుంతలను పూడ్చాలని పట్టణ ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.

Updated Date - Aug 06 , 2025 | 09:54 PM