సిగరెట్ బయట కాల్చమన్నందుకు పిడిగుద్దులు
ABN , Publish Date - Nov 20 , 2025 | 11:17 PM
సాగర్ కవచ్ విఽధులకు వచ్చిన హోంగార్డులు పూటుగా మద్యం సేవించి ముష్టియుద్ధానికి పాల్పడ్డారు.
మద్యం మత్తులో హోంగార్డులు డిష్యుం.. డిష్యుం
ఒంగోలు క్రైం, నవంబరు 20(ఆంధ్రజ్యోతి) : సాగర్ కవచ్ విఽధులకు వచ్చిన హోంగార్డులు పూటుగా మద్యం సేవించి ముష్టియుద్ధానికి పాల్పడ్డారు. పశ్చిమ ప్రాంతానికి చెందిన ముగ్గురు హోంగార్డులు సాగర్ కవచ్ విధులలో పాల్గొనేందుకు బుధవారం ఒంగోలు వచ్చారు. స్థానిక అన్నపూర్ణ లాడ్జిలో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. కనిగిరిలో పనిచేస్తున్న బాలసుబ్రమణ్యం, దోర్నాలకు చెందిన ప్రశాంత్, పెద్దారవీడుకు చెందిన ఎస్‌కే యాసిన్‌లు రాత్రి ఒకే గదిలో ఉండి పూటుగా మద్యం తాగారు. ప్రశాంత్ అక్కడే సిగరెట్ కాల్చగా బాలసుబ్రమణ్యం అడ్డు చెప్పాడు. సిగిరెట్ బయట తాగాలని గట్టిగా సూచించాడు. దీంతో ఇరువురు మధ్య మాటామాటా పెరిగింది. ప్రశాంత్ బాలసుబ్రమణ్యంపై దాడికి దిగి పిడిగుద్దులు కురిపించాడు. దీంతో బాలసుబ్రమణ్యం అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. వెంటనే క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రశాంత్‌ను ఒంగోలు తాలూకా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.