Share News

సాగుకు సాయం

ABN , Publish Date - Jul 31 , 2025 | 01:44 AM

కూటమి పార్టీల ఎన్నికల హామీల్లో అత్యంత కీలకమైన అన్నదాత సుఖీభవ పథకం మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్‌కు అనుసంధానంతో రాష్ట్రప్రభుత్వం దీన్ని కొనసాగిస్తోంది. తొలివిడత జిల్లాలోని రైతులకు రూ.185.72కోట్ల మేర నగదు అందనుంది.

సాగుకు సాయం

2న అన్నదాత సుఖీభవ ప్రారంభం

తొలి విడత రూ.185.72 కోట్లు రైతుల ఖాతాలకు జమ

జిల్లాలో 2,65,317 మంది అర్హులు ... దర్శిలో అధికం

కూటమి పార్టీల ఎన్నికల హామీల్లో అత్యంత కీలకమైన అన్నదాత సుఖీభవ పథకం మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్‌కు అనుసంధానంతో రాష్ట్రప్రభుత్వం దీన్ని కొనసాగిస్తోంది. తొలివిడత జిల్లాలోని రైతులకు రూ.185.72కోట్ల మేర నగదు అందనుంది. మొత్తం జిల్లాలో 2,65,317 మందిని ఈ పథకానికి అర్హులుగా అధికారులు గుర్తించారు. తొలివిడత ఒక్కొక్కరికి రూ.7వేల వంతున నగదును ఇవ్వనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఆగస్టు 2న తాను ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నుంచి కేంద్రం వాటా నిధుల జమను లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని అదేరోజున మన జిల్లా నుంచే సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారు.

ఒంగోలు, జూలై 30 (ఆంధ్రజ్యోతి) : అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఏడాదికి రూ.20వేలను అర్హులైన రైతులకు ఇవ్వనున్నట్లు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సూపర్‌సిక్స్‌ హామీల్లో ఒకటిగా కూటమి పార్టీలు ప్రకటించాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం కిసాన్‌తో అనుసంధానం చేసి అమలు చేయాలని నిర్ణయించాయి. గతంలో వైసీపీ ప్రభుత్వం పీఎం కిసాన్‌ పథ కం ద్వారా కేంద్రం ఏటా ఇచ్చే రూ.6వేలకు మరో రూ.7500 కలిపి రూ.13,500ను రైతు భరోసా పేరుతో ఇచ్చింది. ప్రస్తుత ప్రజా ప్ర భుత్వమే ఒక్కో రైతుకు రూ.14వేలను అన్నదాత సుఖీభవ పేరుతో ప్రకటించింది. పీఎం కిసాన్‌తో అనుసంధానం చేసి కేంద్రం ద్వారా వచ్చే రూ.6వేలు కలిపి మొత్తం ఏడాదికి రూ.20వేలు ఇవ్వాలని నిర్ణయించింది. కేంద్రం ఏడాదిలో మూడు విడతలుగా ఒక్కోసారి రూ.2వేల వంతున రైతుల ఖాతాల్లో జమ చేస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ.14వేలను మూడు విడతలుగా ఇవ్వాలని నిర్ణయించింది. ఆ ప్రకారం తొలి దఫా నగదు జమలను ఆగస్టు 2నుంచి ప్రారంభించనున్నారు. అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల ఎంపికపై ప్రభుత్వం పెద్ద కసరత్తునే చేసింది. పారదర్శకంగా సాగడంతో ఎక్కడా పెద్దగా అభ్యంతరాలు రాలేదు. తొలుత వెబ్‌ల్యాండ్‌ ఆధారంగా మొత్తం రైతు కమతాలను గుర్తించి వారిలో పథకం నిబంధనల ప్రకారం అర్హత ఉండే వారిని గుర్తించారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లింపుదారులు, ప్రజాప్రతినిధులు వంటి వారిని తొలుత మినహాయించారు. తర్వాత ఒక కుటుంబంలో ఒకరికే లబ్ధి కనుక కుటుంబ సర్వే ఆధారంగా పరిశీలన చేశారు. అలాగే ఆధార్‌తో అనుసంధానం అయిన బ్యాంకు అకౌంట్లను ఈకేవైసీ చేయించారు. అంతిమంగా అర్హులైన లబ్ధిదారులను గుర్తించారు. మొత్తం ప్రక్రియ వ్యవసాయ, రెవెన్యూ శాఖల యంత్రాంగం పరిశీలనలో సాగింది.

ఒక కుటుంబంలో ఒక్కరికే!

జిల్లాలో చూస్తే మొత్తం 5.31 లక్షల రైతు ఖాతాలు ఉన్నట్లు వెబ్‌ల్యాండ్‌ ప్రకారం గుర్తించారు. ఆ జాబితాలను క్షేత్రస్థాయిలోని వ్యవసాయశాఖ సిబ్బంది పరిశీలించి పథకం నిబంధనల పరిధిలో 4.90 లక్షల మంది ఉన్నట్లు తేల్చారు. ఆమేరకు ప్రభుత్వానికి నివేదించగా కుటుంబ సర్వే ప్రకారం ఉన్నత స్థాయిలో పరిశీలించి ఒక కుటుంబానికి ఒక్కరికే అన్నదాని ప్రకారం తుది జాబితాను రూపొందించారు. ఆప్రకారం గ్రామస్థాయిలోని రైతు సేవా కేంద్రాలలో జాబితాను ప్రచురించి అభ్యంతరాలను స్వీకరించి తుది పరిశీలన చేశారు. చివరకు జిల్లాలో ఈ పథకం వర్తింపునకు అన్ని అర్హతలు ఉన్నవారు 2,65,317 మందిగా తేల్చారు. ఇందులో దర్శి నియోజకవర్గంలో అధికంగా ఉన్నారు. మొత్తం అర్హులైన 2,65,317 మందికి తొలివిడతగా ఒక్కొక్కరికి రూ.7వేల ప్రకారం రూ.185.72 కోట్లు నగదు అందనుంది. ఆగస్టు 2నుంచి ఈ నగదు రైతు ఖాతాల్లో జమ కానుంది.

Updated Date - Jul 31 , 2025 | 01:44 AM