పల్లె ప్రజలను వణికిస్తున్న జ్వరాలు
ABN , Publish Date - Aug 25 , 2025 | 11:40 PM
పల్లెల్లో జ్వరపీడితుల సంఖ్య పెరుగుతోంది. వైద్యశాలల్లో ఓపీలు పెరుగుతున్నాయ్. వచ్చే ఓపీల్లో సగానికి సగం జ్వరంతోనూ, ఒళ్లు నొప్పులు, జలుబు, దగ్గు వంటి వాటితోనే వస్తున్నారు.
దోర్నాల ఆసుపత్రిలో జ్వరపీడితులు
వైద్యశాలల్లో పెరుగుతున్న రోగులు
ఆందోళన వద్దంటున్న వైద్యాధికారులు
జాగ్రత్తలు తీసుకుంటే మేలు
త్రిపురాంతకం, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి) : పల్లెల్లో జ్వరపీడితుల సంఖ్య పెరుగుతోంది. వైద్యశాలల్లో ఓపీలు పెరుగుతున్నాయ్. వచ్చే ఓపీల్లో సగానికి సగం జ్వరంతోనూ, ఒళ్లు నొప్పులు, జలుబు, దగ్గు వంటి వాటితోనే వస్తున్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గం పరిధిలోని అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో పరిస్థితిని వైద్యాధికారుల ద్వారా అడిగి తెలుసుకుంటే వారిచ్చిన సమాచారం మేరకు ప్రతిరోజూ దాదాపు 500 నుంచి 600 మంది జ్వరాలతో వైద్యశాలకు వస్తున్నారు. అయితే ఇవన్నీ వైరల్ ఫీవర్లేనని ఆందోళన చెందకుండా ఇళ్లలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెప్తున్నారు. మారిన వాతావరణ పరిస్థితులతో పాటు చాలా గ్రామాల్లో పారిశుధ్య లోపం, దోమలు, ఈగలు ఎక్కువై వ్యాధికారకాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో సీజనల్‌గా వచ్చే పలు వ్యాధులతోపాటు ఇప్పుడు జ్వరాలు పల్లెల్లో తిష్టవేశాయి.
ఎర్రగొండపాలెం కేంద్రంగా ఉన్న ఏరియా వైద్యశాలలో సాధారణంగా ప్రతిరోజూ 500 నుంచి 700 వరకు ఓపీలు వస్తుంటాయి. ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడూ వైద్యశాలకు వచ్చే ఈ సంఖ్య వెయ్యికి కూడా చేరుతుందని చెప్తున్నారు. అయితే వీటిలో ప్రతిరోజూ దాదాపు వంద వరకు జ్వరాలబారిన పడినవారే వస్తున్నారు. వీరికి వైద్యపరీక్షలు చేసి అవసరమైన మందులు ఇచ్చి పంపిస్తుండగా అవసరమైనవారికి సెలైన్‌లు పెడుతూ చికిత్ప చేస్తున్నారు. అనుమానితులకు టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ ఇవేమి ప్రస్తుతానికి నమోదు కాలేదని వైద్య సిబ్బంది చెప్తున్నారు. అయితే పల్లెల్లో ప్రవేటు వైద్యుల వద్దకు వెళుతున్న కొందరికి టైఫాయిడ్ నిర్ధారణ జరుగుతుందని రోగులు అంటున్నారు. జ్వరాలతో పాటు జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులతో ఇబ్బందులు పడుతున్నామని కొందరు చెప్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలోని గిరిజన గూడేలలో కూడా జ్వర పీడితులు ఉండగా వైద్యాధికారులు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. త్రిపురాంతకంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతోపాటు దూపాడులోని వైద్యశాలకు కూడా ప్రతిచోటా 150 నుంచి 200 మంది వైద్య పరీక్షల కోసం వస్తుండగా అందులో ఒక్కోచోట 30 నుంచి 40 మంది జ్వరాలబారిన పడినవారే ఉంటున్నారు. అంటే రెండు వైద్యశాలల్లో ప్రతిరోజూ 60 నుంచి 80 మంది జ్వరంతో వచ్చి చికిత్స చేయించుకుని వెళుతున్నారు. దోర్నాల ప్రభుత్వ వైద్యశాలలో ఓపీ 300 నుంచి 400 వరకు నమోదవుతోంది. సోమవారం 320 మంది వైద్య పరీక్షలు కోసం వైద్యశాలకు వచ్చారు. వీరిలో దాదాపు ప్రతిరోజూ 100 నుంచి 120 మంది వరకు జ్వరాలతో వచ్చేవారే కనిపిస్తున్నారు. పెద్దారవీడులోని రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ జ్వర పీడితులు వివరాలు తక్కువగా నమోదవుతుండగా ఎక్కువమంది సమీపంలో ఉన్న మార్కాపురం జిల్లా వైద్యశాలకు వెళుతున్నారు. పుల్లలచెరువులోని ప్రభుత్వ వైద్యశాలల్లో ఇటీవల కాలంలో రోజూ 20 నుంచి 30 మంది జ్వరపీడితులు కనిపిస్తున్నారు. మొత్తమ్మీద సీజనల్ జ్వరాలు పెరుగుతున్న నేపథ్యంలో పల్లెల్లో ప్రైవేటు వైద్యులు ఆర్‌ఎంపీ, పీఎంపీల వద్దకు కూడా ప్రజలు జ్వరాల నుంచి ఉపశమనం కోసం వెళుతున్నారు. ప్రభుత్వ వైద్యశాలల నుంచి ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి పల్లెల్లో అవసరమైన వైద్య సేవలందించి, మందులు పంపిణీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.
విజృంభిస్తున్న సీజనల్ వ్యాధులు
పెద్ద దోర్నాల : అల్పపీడనం కారణంగా వారం, పది రోజులు పాటు చిరు జల్లులు కురిశాయి. దీంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో మండలంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. దీంతో ప్రజలు జ్వరం, వంటి నొప్పులు, దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. ఎక్కువ శాతం మంది వైరల్ ఫీవర్, కీళ్ల నొప్పులతో బాధ పడుతున్నారు. ప్రధానంగా చిన్న పిల్లలు జ్వరంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది వైద్యశాలలకు వెళ్లకుండా మందుల దుకాణంలో మందులు కొనుక్కొని వెళ్తున్నారు. దీంత వ్యాధి తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తుందని అంటున్నారు. చెంచు గిరిజన గూడేలలో జ్వర బాధితులు ఎక్కువగానే ఉన్నారు. కొర్రప్రోలు, చింతలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నా అరకరడ రోగుల సంఖ్య అధికంగా ఉన్నట్లు సమాచారం అందడంతో కలెక్టర్ సంబంధిత అధికారులను హెచ్చరించారు. వైద్యాధికారులు, సిబ్బంది సమయపాలన పాటించకపోవడం వల్ల దోర్నాల వెళ్తున్నట్లు గిరిజనులు చెప్తున్నారు. దోర్నాల ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోజుకు 320 మంది రోగులు వైద్యం కోసం వస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
జ్వరాలు సీజనల్‌గా వస్తుంటాయి. అవసరమైనవారికి టైఫాయిడ్, మలేరియా పరీక్షలు చేయాలి. ప్రస్తుతం వైరల్ జ్వరాలు ప్రబలుతున్నాయి. ఇళ్లలో ప్రజలు జాగ్రత్తలు తీసుకుని కాచి చల్లార్చిన నీటిని తాగాలి. నీరు నిల్వ ఉండకుండా చూసుకుంటే దోమలు, ఈగలు ప్రబలకుండా ఉంటాయి. బయట రోడ్లపై ఉండే తినుబండరాలు తినకుండా ఉంటే మేలు. మాస్క్ తప్పనిసరిగా ధరిస్తే మంచిది. విద్యార్థులు, బయట తిరిగే వ్యక్తులు మాస్క్ ధరించాలి.
- యదీద్యా, ఎర్రగొండపాలెం
ఏరియా వైద్యశాల సూపరిండెంట్
మెరుగైన వైద్యం అందించేందుకు కృషి
సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు, సిబ్బంది సమన్వయంతో కృషి చేస్తున్నారు. జ్వరాలు, ఇతర వ్యాధులు వచ్చినప్పుడు సొంతంగా మందులు వాడరాదు. వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
- వైద్య సంజీవ్, వైద్యాధికారి, సీహెచ్‌సీ, దోర్నాల