ప్రాణాలు హరించే కంచెలు...!
ABN , Publish Date - Nov 16 , 2025 | 10:44 PM
అడవి జంతువుల వేట కోసం ఉచ్చులు అమర్చడం కొందరికి ఆనవాయితీగా మారితే పంటల రక్షణ కోసం కొందరు ఏకంగా పొలాల కంచెలకు విద్యుత్ సరఫరా ఇస్తున్న కారణంగా అమాయకుల ప్రాణాలు పోతున్నాయి.
నల్లమల అటవీ సమీప ప్రాంతాల్లో భయానక పరిస్థితులు
వేట కోసం కొందరు, పంట రక్షణకు పొలం చుట్టూ మరికొందరు ఏర్పాటు
ఆ తీగలకు విద్యుత్ సరఫరా
గాలిలో కలిసిపోతున్న ప్రాణాలు
త్రిపురాంతకం, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి) : అడవి జంతువుల వేట కోసం ఉచ్చులు అమర్చడం కొందరికి ఆనవాయితీగా మారితే పంటల రక్షణ కోసం కొందరు ఏకంగా పొలాల కంచెలకు విద్యుత్ సరఫరా ఇస్తున్న కారణంగా అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. ఎటొచ్చీ ఈ రెండు చర్యలతో ఈ ప్రాంతాలు మృత్యుజాలాలుగా మారాయి. వేట కోసం వేసిన ఉచ్చుకైనా, పంట కోసం వేసిన కంచెనైనా తాకే ప్రతిదీ ప్రాణమే. మనిషా లేక జంతువా అనేది పక్కన పెడితే ఏదైనా జీవే. ఈ అక్రమ పద్ధతివల్ల పలుచోట్ల భయానక పరిస్థితులు నెలకొంటున్నాయి.
వన్యప్రాణాలుకానీ, మనుషుల ప్రాణాలు కానీ కోల్పోతున్న ఘటనలు బయటికి తెలిసేవి కొన్ని మాత్రమే. కానీ పలు గ్రామాల్లో గుట్టుచప్పుడు కాకుండా నిజాన్ని సమాధి చేసేవి కొన్ని అయితే గ్రామ స్థాయిలో రాజీలు కుదిర్చి పోయిన ప్రాణాలకు ఖరీదు కట్టే ఘటనలు మరికొన్ని. మొత్తానికి ఉచ్చులు, కంచెలు ప్రాణాలను హరించివేస్తున్నాయి. కొన్ని చోట్ల ఏకంగా కేవలం వేట కోసం కొందరు రాత్రిళ్లు అటవీప్రాంతాల్లోని పొలాల్లో విద్యుత్ కంచెలను ఏర్పాటు చేస్తున్నారు. ఇది తెలియని పాదచారులు, రాత్రిళ్లు ఆలస్యంగా ఇళ్లకు వచ్చే రైతులు మృత్యువాత పడిన సందర్భాలున్నాయి.
కంచెలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన బాలుడు
దోర్నాల మండలంలో కొద్ది రోజుల కిందట జరిగిన ఘటన ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. అక్టోబరు 28న నందిగూడెంకు చెందిన అర్తి నాగన్న (16) అనే గిరిజన బాలుడు కనిపించలేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వతహాగా అడవిలో పిట్టలు కొట్టుకుంటూ సరదాగా సాయంత్రానికి ఇంటికి వచ్చే పిల్లాడు రాలేదనే ఆందోళన వారిలో ఉన్నా రెండోరోజు వస్తాడనుకున్నారు. వారంరోజులుగా జాడలేదు. ఈనెల 7న సమీప పొలాల్లో తిరిగి వెదుకుతున్న వారికి మొక్కజొన్న పొలంలో దుర్వాసన రాగా, సగం బయటపడిన మృతదేహం కనిపించింది. వెలికితీసిన మృతదేహం తమ కుమారునిదేనని గుర్తించిన తల్లిదండ్రులు బోరున విలపించారు. అయితే ఇందులో కారణాలు వెలికితీసిన పోలీసులు వెల్లడించిన విషయాలు చూస్తే.. మొక్కజొన్న పంట రక్షణ కోసం చుట్టూ కంచె వేసుకున్న రైతు దానికి విద్యుత్ సరఫరా ఇచ్చారు. అటుగా వచ్చిన నాగన్న తీగ తగిలి షాక్‌కు గురై అక్కడికక్కడే చనిపోయాడు. అది గమనించిన రైతు ఇది పెద్ద కేసుగా తన మెడకు చుట్టుకుంటుందని భయపడి గుట్టుచప్పుడు కాకుండా పొలంలోనే గోతిని తీసి నాగన్న మృతదేహాన్ని పాతిపెట్టాడు. తీరా కుక్కలు దానిని బయటకు తవ్వే ప్రయత్నంలో వాసన రావడంతో అసలు విషయం బయటపడింది.
చనిపోయిన చిరుత
ఈ ఏడాది ఫిబ్రవరి 16న ఓ ఘటన జరిగింది. ఎర్రగొండపాలెం మండలంలోని గంజివారిపల్లి అటవీశాఖ పరిధిలోని కొలుకుల-గంజివారిపల్లి మధ్య కొందరు వేటగాళ్లు అడవి పందుల కోసం వేసిన ఉచ్చుకు చిరుతపులి చిక్కుకుంది. చిక్కుకున్న పులి అరుపులు బయట ప్రాంతానికి వినిపించినా పులి కదా అని భయంతో దరిదాపులకు ఎవ్వరూ వెళ్లలేదు. కొంత సేపటికి చిరుత చనిపోయింది. అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకుని పోస్టుమార్టం నిర్వహించడం, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం జరిగినా చిరుత ప్రాణం రాదుకదా?
చట్టాలున్నా అమలు ఎక్కడ?
వన్యప్రాణి సంరక్షణ చట్టం పకడ్బందీగా ఉన్నప్పటికీ అమలులో మాత్రం లోపాలు కనిపిస్తున్నాయి. అక్రమ విద్యుత్ కంచెలు, ఉచ్చులు ఏర్పాటు చేసే ప్రాంతాలు గుర్తింపు వాటిపై పర్యవేక్షణ లేకపోవడం, జరిమానాలు విధింపులు లేకపోవడం వల్ల పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. మరోవైపు రైతుల పంట నష్టానికి పాల్పడే జంతువుల నుంచి రక్షణ కూడా అవసరమే కాబట్టి వారికి సురక్షితమైన నాన్ ఎలక్ట్రికల్ పంట రక్షణ చర్యలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఇటీవల చాలామంది సోలార్ ఫెన్సింగ్ ద్వారా కూడా రక్షణ ఏర్పాట్లు చేసుకుంటున్న విషయాన్ని అందరికీ తెలియజేసేలా చర్యలు తీసుకోవాలి.
కంచెలు, రక్షణ చర్యలు వారికి అవసరమైనవైతే వాటికన్నా ఒక ప్రాణం అన్నింటికంటే విలువైనదని గుర్తించాలి. ఒక ప్రాణం కోల్పోతే ఆ కుటుంబానికి జరిగే నష్టం ఎంతో అది ఎవ్వరూ భర్తీ చేయలేనిది. రైతులు, వేటకోసం ఆలోచించే వ్యక్తులు ఈ మృత్యుజాలాన్ని ఆపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
విద్యుత్ కంచెలు అమరిస్తే కఠినచర్యలు
అజయ్‌కుమార్, సీఐ, ఎర్రగొండపాలెం
పొలాలకు విద్యుత్ కంచెలను ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. రైతులు పంటల రక్షణ కోసం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలి. నాన్ ఎలిక్ట్రికల్ పరికరాలను ఫెన్సింగ్ కోసం వినియోగించుకోండి. ప్రాణాంతకంగా మీ చర్యలు ఉంటే ప్రాణ నష్టం జరిగిన తరువాత కాదు, అటువంటి వాటిని గుర్తించినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.