అధికారి వేధింపులకు మహిళా ఉద్యోగి బలి
ABN , Publish Date - Oct 23 , 2025 | 02:17 AM
దర్శి ఏడీఏ కార్యాలయంలో అధికారి వేధింపులకు మహిళా ఉద్యోగి బలైంది. ఆ అధికారి పెడుతున్న ఇబ్బందులు తట్టుకోలేక 20రోజుల క్రితం పురుగుల మందు తాగిన ఆమె చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. దీంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాగా పోలీసులు ఆమె మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు కేసు నమోదు చేశారు.
20రోజుల క్రితం పురుగుమందు తాగిన బాధితురాలు
ఒంగోలులో చికిత్స పొందుతూ మృతి
కేసు నమోదు
దర్శి, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): దర్శి ఏడీఏ కార్యాలయంలో అధికారి వేధింపులకు మహిళా ఉద్యోగి బలైంది. ఆ అధికారి పెడుతున్న ఇబ్బందులు తట్టుకోలేక 20రోజుల క్రితం పురుగుల మందు తాగిన ఆమె చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. దీంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాగా పోలీసులు ఆమె మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు కేసు నమోదు చేశారు. స్థానిక ఏడీఏ కార్యాలయంలో టి.రమణ అనే మహిళా ఉద్యోగి అటెండర్‌గా పనిచేస్తోంది. ఆమె భర్త సుబ్బరాయుడు గతంలో వ్యవసాయాధికారిగా పనిచేశారు. ఆయన 2020లో కరోనాతో మృతిచెందడంతో కారుణ్య నియామకం కింద ప్రభుత్వం ఆయన భార్య అయిన రమణకు అటెండర్ ఉద్యోగం ఇచ్చింది. అప్పటి నుంచి ఆమె ఏడీఏ కార్యాలయంలో పనిచేస్తోంది. గతనెల 29వ తేదీన రమణ హఠాత్తుగా పురుగు మందు తాగింది. ఆ సమయంలో ఆమె ఎందుకు ఆత్మహత్యాయత్నం చేసిందన్న విషయం తెలియలేదు. ఒంగోలులో చికిత్స పొందుతూ మంగళవారం ఆమె మృతిచెందడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అటెండర్ రమణను ఏడీఏ కార్యాలయంలోని ఒక అధికారి చీటికిమాటికి విసిగిస్తుండేవాడని పోలీసుల విచారణలో తేలింది. అవసరమైన సమయంలో సెలవు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేవాడని, కనీసం స్వగ్రామమైన నరసరావుపేటకు వెళ్లేందుకు కూడా అనుమతించకపోవడంతో ఆమె మనస్తాపానికి గురైందని తేలింది. దీంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్శి ఏఎ్‌సఐ రాంబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు.