Share News

నల్లి భయం

ABN , Publish Date - Dec 11 , 2025 | 01:42 AM

జిల్లా ప్రజలను స్క్రబ్‌ టైఫస్‌ కలవరపెడుతోంది. గతంలో కూడా అడపాదడపా ఈ కేసులు నమోదైనప్పటికీ ప్రాణాంతకంగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు వ్యాధి మరింత విజృంభిస్తుండటం తోపాటు ప్రాణాలు కోల్పోతుండటం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది.

నల్లి భయం
అంబాపురంలో రోగి ఇంటి వద్ద వివరాలు తెలుసుకుంటున్న వైద్య సిబ్బంది

కలవరపెడుతున్న స్క్రబ్‌ టైఫస్‌

జిల్లాలో ఇప్పటికే ఇద్దరు మృతి

నాలుగు యాక్టివ్‌ కేసులు.. రిమ్స్‌లో చికిత్స

మరో ఇద్దరు డిశ్చార్జి

ఈ ఏడాది ఇప్పటి వరకూ 29 కేసులు నమోదు

ఒంగోలు కలెక్టరేట్‌, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి) : జిల్లా ప్రజలను స్క్రబ్‌ టైఫస్‌ కలవరపెడుతోంది. గతంలో కూడా అడపాదడపా ఈ కేసులు నమోదైనప్పటికీ ప్రాణాంతకంగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు వ్యాధి మరింత విజృంభిస్తుండటంతోపాటు ప్రాణాలు కోల్పోతుండటం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. జిల్లాలో ప్రస్తుతం వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతుండటంతో రైతులు, కూలీలు నల్లిపురుగు బారిన పడుతున్నారు. ఆ పురుగు కుట్టినప్పుడు పెద్దగా నొప్పిలేకపోవడంతో పట్టించుకోవడం లేదు. ఆతర్వాత ఐదారు రోజులకు జ్వరం వస్తోంది. దానితోపాటు తలనొప్పి, ఒళ్లు నొప్పులు ప్రారంభమవుతున్నాయి. వైద్యశాలకు వెళ్లే సమయానికి వ్యాధి తీవ్రత పెరిగి ప్రాణాంతకమవుతోంది. జిల్లాలో ఈనెల 1వ తేదీ నుంచి 10వతేదీ వరకు మొత్తం ఎనిమిది కేసులు నమోదయ్యాయి. అందులో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో ఇద్దరు వైద్యశాల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇంకో నలుగురు వైద్యసేవలు పొందుతున్నారు. వీరిలో బేస్తవారపేటకు చెందిన మహిళను గుంటూరుకు తరలించగా మిగిలిన ముగ్గురు ఒంగోలులో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈనెల 6వ తేదీన యర్రగొండపాలేనికి చెందిన దానమ్మ, 9వ తేదీన సంతనూతలపాడు మండలం రుద్రవరానికి చెందిన నాగేంద్రం మృతి చెందారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు పొదిలి, కొనకనమిట్ల, ముండ్లమూరు, బేస్తవారపేటల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి. బుధవారం ఒంగోలుకు చెందిన 35 ఏళ్ల యువకుడికి స్క్రబ్‌ టైఫస్‌ పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఆయన్ను రిమ్స్‌కు తరలించారు.

ఈ ఏడాది 29 కేసులు

జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్‌ ఆఖరు వవరకూ స్క్రబ్‌ టైఫస్‌ కేసులు 20 నమోదయ్యాయి. వారందరికీ సమీప వైద్యశాలలతోపాటు ఒంగోలులోని జీజీహెచ్‌లో చికిత్స చేశారు. త్వరగా కోలుకోవడంతో వైద్యశాఖ అధికారులు కూడా ఊపిరిపీల్చుకున్నారు. ఒక్క డిసెంబరులో స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధితో ఇరువురు మృతి చెందారు. మరో ఏడుగురు ఆ వ్యాధి బారినపడటంతో అటు ప్రజానీకం, ఇటు వైద్యాధికారుల్లోనూ ఆందోళన నెలకొంది. పూర్వకాలంలో నల్లిపురుగు పేడదిబ్బలపై ఉండేది. అయితే అప్పట్లో ఆ పరుగు కనిపిస్తే చంపేవారు. కానీ ప్రస్తుతం ఆ పరుగులు వ్యవసాయ భూముల్లోకి చేరాయి. వ్యవసాయ పనులు చేసే సమయంలో కుడుతుండటంతో ప్రారంభంలో పెద్దగా పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఆ నల్లిపురుగు ప్రాణాలను తీస్తుండటంతో ఇప్పుడు ప్రజల్లో మరింత ఆందోళన నెలకొంది.

Updated Date - Dec 11 , 2025 | 01:42 AM