మెడికల్ కాలేజీ పూర్తికి వేగంగా అడుగులు
ABN , Publish Date - Sep 20 , 2025 | 02:34 AM
మార్కాపురం మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. ఈ నెల ఆరంభంలో పీపీపీ పద్ధతిలో రాష్ట్రంలోని నాలుగు మెడికల్ కాలేజీల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపిన సంగతి విదితమే.
టెండర్లను ఆహ్వానించిన ప్రభుత్వం
మార్కాపురం, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): మార్కాపురం మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. ఈ నెల ఆరంభంలో పీపీపీ పద్ధతిలో రాష్ట్రంలోని నాలుగు మెడికల్ కాలేజీల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపిన సంగతి విదితమే. ఈ క్రమంలో ఫేజ్-1 కింద మార్కాపురం, కర్నూలు జిల్లా ఆదోని, అన్నమయ్య జిల్లా మదనపల్లె, కడప జిల్లా పులివెందులలో అసంపూర్తిగా ఉన్న కాలేజీల నిర్మాణాలను పూర్తిచేసేందుకు ఆంధ్రప్రదేశ్ వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) ఈనెల 16న టెండర్లను ఆహ్వానించింది.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు
ప్రభుత్వ, ప్రైవేటు పార్టనర్ షిప్ (పీపీపీ) విధానంలో నిర్మాణాలను త్వరగా పూర్తిచేసి వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించాలన్నది ప్రభుత్వ యోచన. అందుకనుగుణంగా వేగంగా చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం మార్కాపురం మెడికల్ కాలేజీ పనులు కేవలం 19శాతంలోపు మాత్రమే పూర్తయ్యాయి. కీలకమైన వైద్యశాల నిర్మాణం ఇంకా పునాదుల స్థాయిలోనే ఉంది. గత ప్రభుత్వం కాలేజీకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, విద్యార్థుల హాస్టల్స్ నిర్మాణాలపై దృష్టిపెట్టి కొంతమేర పనులు చేసింది. అంతేకాక వైద్యకళాశాలకు సంబంధించి స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో రూ.8కోట్లు కేటాయించి ఇప్పటికే ఉన్న 150 పడకలకు తోడు మరో 300 పడకలను తాత్కాలిక పద్ధతిలో నిర్మాణం చేశారు. ఇంకా కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయి. మండలంలోని రాయవరం వద్ద ఉన్న మెడికల్ కాలేజీ నిర్మాణాలను పూర్తిచేసినా ప్రస్తుతానికి వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించుకోవచ్చు. ఈలోగా పట్టణంలోని వైద్యశాలలో ఓపీ సేవలు నిర్వహించుకోవచ్చు. గతంలో ఓపీ సేవలు సక్రమంగా లేకపోవడంతోనే నేషనల్ మెడికల్ కౌన్సిల్ సభ్యులు 2024 జూన్‌లో పరిశీలించి అడ్మిషన్‌లకు అనుమతులు ఇవ్వలేదు.