Share News

నీటి తడులపై రైతులు దృష్టి

ABN , Publish Date - Dec 12 , 2025 | 11:37 PM

సాగు చేపట్టిన కొద్దిరోజులకే పైరు బెట్టకు రావడంతో రైతులు నీటితడులపై దృష్టి సారించారు.

నీటి తడులపై రైతులు దృష్టి

పంగులూరు, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): సాగు చేపట్టిన కొద్దిరోజులకే పైరు బెట్టకు రావడంతో రైతులు నీటితడులపై దృష్టి సారించారు. మండలంలోని పలు గ్రామాలలో రబీపంటగా మొక్కజొన్న, శనగతో పాటు మిరప, తెల్లబర్లీ సాగు చేస్తున్నారు. అక్టోబరు ఆఖరులో మొంధా తుఫాన్‌ అనంతరం తడిపొడి నేలలో దుక్కిదున్ని మొక్కజొన్న, శన గ విత్తనాలు విత్తడం, పొగాకు, మిరప నాట్లు వేశారు. నేల పూర్తిగా ఆరకుండా అదును పోతుందన్న ఆతృతతో పంటసాగు చేపట్టారు. నవంబరులో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కొద్దిపాటి వర్షం పడుతుందని రైతులు ఆశగా ఎదురు చూశారు. నెలరోజులుగా వర్షం పడకపోగా రాత్రి ఉష్ణోగ్రతలు పూర్తిగా తగ్గి చలిగాలులు వీస్తున్నాయి. దీంతో భూమిలో తేమశాతం తగ్గి నేల బిగుసుకు పోవడంతో పైరు ఎదుగుదలకు నోచుకో వడం లేదు. దీంతో ప్రతి కూల వాతావరణంతో పైర్లు బెట్టకు వచ్చే పరిస్థితి ఉంది. ఈ దశలో పంటను కాపాడేందుకు నెలరోజుల దశకు చేరుకున్న మొక్క జొన్న, పొగాకు, మిరప, శనగ పైరులకు నీటితడులు అందించే పనిలో రైతులు న్నారు. అందుబాటులో ఉన్న సాగర్‌ జలాలు, బోరుబావుల నీటిని నీటిని స్ర్పింకర్లతో, నేరుగా పంటకు తడివేసే పని ప్రారంభించారు. రైతులందరూ ఒకే సమయంలో పంటతడులకు సిద్ధం కావడంతో సాగర్‌ జలాలు దిగువకు అందడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. పమిడిపాడు మేజరుకు 190 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని, శనివారం నుండి 250 క్యూసెక్కుల నీటిని విడుదల చేసేవిధంగా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. వర్షం పడక పోవడం, వీస్తున్న చలిగాలులు, ప్రతికూల వాతావరణం పైరు ఎదుగుదలకు అడ్డంకిగా ఉండటంతో నీటి తడులకోసం రైతులు పరుగులు పెడుతున్నారు.

Updated Date - Dec 12 , 2025 | 11:37 PM