తాగునీటి ఎద్దడిపై తప్పుడు నివేదిక
ABN , Publish Date - May 14 , 2025 | 11:36 PM
‘నీటి సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలి.. వేసవి వచ్చినా ఎందుకు జాప్యం చేస్తున్నారు.. ప్రజలు ఇబ్బంది పడేంతదూరం ఎందుకు తీసుకొచ్చారు.. ఈరోజు వరకు బోరు నుంచి మోటారును బయటకు తీయలేదు.. ఏమి సమాధానం చెప్తారు.. పద్ధతి మార్చుకోండి’ అంటూ ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ బాలశంకరరావు మండిపడ్డారు.
దోర్నాలలో నీటి కష్టాలు లేవంటూ ఆర్‌డబ్ల్యూఎస్ ఇన్‌చార్జి ఏఈ వివరణ
ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై క్షేత్రస్థాయిలో జిల్లా ఉన్నతాధికారుల పరిశీలన
అదే సమయంలో ఐనముక్కుల బీసీ కాలనీవాసుల ధర్నా
తక్షణమే సమస్య పరిష్కరించాలని ఆదేశం
తిమ్మాపురంలో అప్పటికప్పుడు కొత్త మోటార్ ఏర్పాటు
పెద్ద దోర్నాల, మే 14 (ఆంధ్రజ్యోతి) : ‘నీటి సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలి.. వేసవి వచ్చినా ఎందుకు జాప్యం చేస్తున్నారు.. ప్రజలు ఇబ్బంది పడేంతదూరం ఎందుకు తీసుకొచ్చారు.. ఈరోజు వరకు బోరు నుంచి మోటారును బయటకు తీయలేదు.. ఏమి సమాధానం చెప్తారు.. పద్ధతి మార్చుకోండి’ అంటూ ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ బాలశంకరరావు మండిపడ్డారు. ‘దోర్నాలలో నీటి కష్టాలు’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో ఈ నెల 12న కథనం ప్రచురితమైంది. ఆర్‌డబ్ల్యూఎస్ ఇన్‌చార్జి ఏఈ భ్రమరాంబికాదేవి దోర్నాలలో ఎటువంటి తాగునీటి సమస్యలు లేవు, అన్నీ సక్రమంగానే ఉన్నాయి.. ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనం అవాస్తవమంటూ ఎంత నీరు కావాలి, ఎన్ని లీటర్లు ఇవ్వాలి, అవన్నీ ఇస్తున్నట్లు లెక్కలతో సహ నివేదికను రూపొందించి జిల్లా ఉన్నతాధికారులకు అందజేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు నిజనిజాలను పరిశీలించేందుకు ఆర్‌డబ్ల్యూఎస్ జిల్లా అధికారి ఎస్‌ఈ బాలశంకర్‌రావు, ఈఈ పొదిలి సురేష్, ఎర్రగొండపాలెం డీఈ శ్రీనివాస్ దోర్నాల వచ్చారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం మండల అధికారులతో సమీక్షించారు. అనంతరం విలేకరులతో ఎస్‌ఈ మాట్లాడుతూ నిధుల సమస్య లేదని, సాంకేతిక లోపాల వల్ల జాప్యం జరిగిందని, నిర్లక్ష్యం వహిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇప్పటి నుంచి సచివాలయం ఇంజనీరు శ్రీనుకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఎస్‌ఈ తెలిపారు. అనంతరం తిమ్మాపురంలోబోరుబావిని పరిశీలించారు. గ్రామస్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు నీటి సమస్యను ఏకరువు పెట్టారు. ఇప్పటి నుంచి అలా జరగదని హామీ ఇచ్చారు.
సమస్యతో జనం గగ్గోలు పెడుతున్నా...
దోర్నాల పంచాయతీలోని తిమ్మాపురం, ఐనముక్కుల, దోర్నాల కొన్ని ప్రాంతాల్లో నీటి సమస్య తలెత్తింది. అధికారులు ఆ సమస్యలను పట్టించుకోకపోవడంతో ప్రజలు నీటి ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. తిమ్మాపురం బోరుబావుల్లో నీరు ఉంది. కాకపోతే మోటార్లు తరచూ మరమ్మతులకు గురవుతుంటాయి. వెంటనే బాగు చేయిస్తే సమస్య ఉండదు. వారం, పదిరోజుల వరకు పట్టించుకోకపోవడం వల్ల జనం నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఐనముక్కుల బీసీ కాలనీలో చిన్న సమస్య కానీ పట్టించుకోవడం లేదని నివాసితులు వాపోతున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో మనుషులతో పాటు పశువులు, మూగజీవాలు ఉన్నాయి. వాటి దాహం తీర్చడానికి నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. ఆ మేరకు అందక మరింత కష్టాలు పడాల్సి వస్తోంది.
x
‘నీటి సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలి.. వేసవి వచ్చినా ఎందుకు జాప్యం చేస్తున్నారు.. ప్రజలు ఇబ్బంది పడేంతదూరం ఎందుకు తీసుకొచ్చారు.. ఈరోజు వరకు బోరు నుంచి మోటారును బయటకు తీయలేదు.. ఏమి సమాధానం చెప్తారు.. పద్ధతి మార్చుకోండి’ అంటూ ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ బాలశంకరరావు మండిపడ్డారు.