ముఖ హాజరు మాయాజాలం.. విధులకు ఎగనామం
ABN , Publish Date - May 04 , 2025 | 01:36 AM
వైద్యారోగ్యశాఖలో ముఖహాజరు (ఎఫ్‌ఆర్‌ఎస్) మాయాజాలం కలకలం రేపుతోంది. వైద్యాధికారులు, పారా మెడికల్ సిబ్బంది వైద్యశాలలకు సకాలంలో చేరుకుని ఎఫ్‌ఆర్‌ఎస్ వేసి వెళ్లిపోతున్నట్లు వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు గుర్తించారు. ఉదయం, సాయంత్రం సమయంలో తప్పనిసరిగా ఉద్యోగులు ముఖహాజరు వేస్తున్నారే తప్ప విధులకు మాత్రం ఎగనామం పెడుతున్నట్లు తేలింది.
ఐఫోన్‌తో హాజరును ట్యాంపరింగ్ చేసిన మెడికల్ ఆఫీసర్లపై చర్యలకు రంగం సిద్ధం
ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 330 మందికిపైగా వైద్యాధికారులు, సిబ్బందికి షోకాజ్ నోటీసులు
కలకలం రేపుతున్న వ్యవహారం
కార్యస్థానంలో హాజరు వేసి వెళ్లిపోతున్న సిబ్బందిని గుర్తించిన ఉన్నతాధికారులు
యాప్ సరిగా పనిచేయడం లేదంటూ వివరణ ఇస్తున్న పరిస్థితి
ఐఫోన్లతో ట్యాంపరింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు వైద్యారోగ్యశాఖ చర్యలు
వైద్యారోగ్యశాఖలో ముఖహాజరు (ఎఫ్‌ఆర్‌ఎస్) మాయాజాలం కలకలం రేపుతోంది. వైద్యాధికారులు, పారా మెడికల్ సిబ్బంది వైద్యశాలలకు సకాలంలో చేరుకుని ఎఫ్‌ఆర్‌ఎస్ వేసి వెళ్లిపోతున్నట్లు వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు గుర్తించారు. ఉదయం, సాయంత్రం సమయంలో తప్పనిసరిగా ఉద్యోగులు ముఖహాజరు వేస్తున్నారే తప్ప విధులకు మాత్రం ఎగనామం పెడుతున్నట్లు తేలింది. అలాంటివారు జిల్లావ్యాప్తంగా 330మందికిపైగా ఉన్నట్లు గుర్తించారు. వారందరికీ షోకాజ్ నోటీసులు జారీచేసినట్లు సమాచారం. అటువంటి వ్యవహారాలను అడ్డుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉన్నతాధికారులు మరింత విస్తరించినట్లు తెలిసింది.
ఒంగోలు కలెక్టరేట్, మే 3 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న వైద్యాధికారులు, సిబ్బంది ముఖ హాజరు (ఎఫ్‌ఆర్‌ఎస్)లో చోటుచేసుకున్న అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా మెడికల్ ఆఫీసర్లు, వైద్యాధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పనిచేసే చోట ముఖ ఆధారిత గుర్తింపు యాప్ (ఎఫ్‌ఆర్‌ఎస్)ను అందుబాటులోకి తెచ్చింది. దాని ద్వారా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ముఖహాజరు వేయాల్సి ఉంది. ఆ ఎఫ్‌ఆర్‌ఎస్ కూడా ఎక్కడ వేసింది కూడా తెలిసే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చారు. అయితే ప్రస్తుతం ఎక్కువ మంది ఐఫోన్లను వినియోగిస్తుండటం, ఆ యాప్ అందులో పనిచేయకపోవడం కలిసొచ్చింది. ఆ యాప్ కేవలం ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే పనిచేస్తుంది.
ఐఫోన్ల ద్వారా ట్యాంపరింగ్
ఆండ్రాయిడ్ ఫోన్లు కాకుండా ఎక్కువమంది ఐఫోన్లు వాడటం ద్వారా ముఖహాజరును ట్యాంపరింగ్ చేశారు. ఈ వ్యవహారాన్ని రాష్ట్రస్థాయిలో అధికారులు గుర్తించడంతో కలకలం రేగింది. పనిచేసే వైద్యశాలకు ఎప్పుడు వెళ్లినా సరే ఐఫోన్‌లో ఎంత సమయం పెట్టుకుంటే ఆ సమయంలోనే విధుల్లో పాల్గొన్నట్లు చూపిస్తుంది. అలాగే ఇంతకాలం కొందరు హాజరు వేస్తూ విధులకు మాత్రం డుమ్మా కొడుతు న్నారు. దీన్ని గుర్తించిన ఉన్నతాధికారులు ఎఫ్‌ఆర్‌ఎస్ మాయాజాలం చేసిన వారికి షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చారు. ఐఫోన్ల ద్వారా జిల్లాలో 16 మంది మెడికల్ ఆఫీసర్లు ముఖ హాజరును ట్యాంపరింగ్ చేసినట్లు గుర్తించారు. వారందరికీ షోకాజ్ నోటీసులు జారీచేసిన ఉన్నతాధికారులు అందుకు సంబంధించి వివరణలు ఇవ్వాలని ఆదేశించారు.
యాప్ సరిగా లేదు
తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు ముఖహాజరు వేసే యాప్‌లు సరిగా పనిచేయకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని వివరణలు ఇస్తున్నట్లు సమాచారం. కాగా విధులకు సకాలంలో హాజరుకానటువంటి వైద్యాధికారులు, సిబ్బందిని కూడా వైద్యశాఖ ఉన్నతాధికారులు గుర్తించారు. జిల్లావ్యాప్తంగా 25 మంది వైద్యాధికారులు సకాలంలో విధులకు హాజరుకానట్లు గుర్తించి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. 96 మంది వైద్యాధికారులు డ్యూటీకి సక్రమంగా చేయనట్లుగా గుర్తించి వారికి కూడా నోటీసులు జారీచేశారు. మరోవైపు పారా మెడికల్ సిబ్బంది కూడా సుమారు 220 మందికిపైగా ముఖ హాజరును లేటుగా వేయడంతోపాటు గైర్హాజరైనట్ల్లు సమాచారం. ఇలాంటి వారికి అడ్డుకట్ట వేసేందుకు వైద్యారోగశాఖ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు సమాచారం.
ఆటకట్టించేందుకు ఏర్పాట్లు
ప్రస్తుతం వైద్యశాఖ అందుబాటులోకి తెచ్చిన సాంకేతిక పరిజ్ఞానం హాజరు వేసిన తర్వాత వైద్యశాలలో ఉంటున్నారా.. లేదా? అనేది తెలుసుకునేందుకు వీలుగా రూపొందించినట్లు తెలిసింది. దానివల్ల వైద్యశాఖలో పనిచేసే ఉద్యోగుల ముఖహాజరు మాయాజాలాలు ఒక్కొక్కటిగా వెలుగులో కి వస్తుండటంతో అందరిలో అలజడి రేగిం ది. మరో వైపు వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో పనిచేసే ఉద్యో గులు కూడా ఉదయం ముఖహాజరు వేసి కార్యాలయంలో ఉండకుండా వెళ్లిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.