పదవీకాలం పెంపు.. కమిటీలకు పూర్వ వైభవం
ABN , Publish Date - Oct 28 , 2025 | 01:20 AM
మార్కెట్ కమిటీల పాలకవర్గాల పదవీ కాలం ఏడాది కాకుండా కనీసం రెండేళ్లకు పెంపు, గత ప్రభుత్వ కాలంలో నిర్లక్ష్యంగా మారిన కమిటీల రోజువారీ కార్యకలాపాలను విస్తృతపరిచి పూర్వవైభవం తెచ్చేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం స్థానిక ఏఎంసీ కార్యాలయంలో సమావేశమై ఈమేరకు తీర్మానం చేశారు.
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఏఎంసీ చైర్మన్ల సమావేశంలో తీర్మానం
సమన్వయం కోసం రాచగర్ల అధ్యక్షుడుగా త్రిసభ్య కమిటీ ఎన్నిక
సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే జనార్దన్
ఒంగోలు, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి) : మార్కెట్ కమిటీల పాలకవర్గాల పదవీ కాలం ఏడాది కాకుండా కనీసం రెండేళ్లకు పెంపు, గత ప్రభుత్వ కాలంలో నిర్లక్ష్యంగా మారిన కమిటీల రోజువారీ కార్యకలాపాలను విస్తృతపరిచి పూర్వవైభవం తెచ్చేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం స్థానిక ఏఎంసీ కార్యాలయంలో సమావేశమై ఈమేరకు తీర్మానం చేశారు. ఒంగోలు ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లాలోని ఇతర ఏఎంసీ చైర్మన్లు అందరూ పాల్గొన్నారు. ఏఎంసీ చైర్మన్లుగా ఉన్న కొందరు మహిళల బదులు వారి భర్తలు హాజరయ్యారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఏఎంసీ చైర్మన్లు సమావేశాలు నిర్వహించుకొని ఈ అంశాలపై చర్చించి త్వరలో రాష్ట్రస్థాయిలో అన్ని జిల్లాల ప్రతినిధులతో ప్రత్యేక సదస్సు నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయిలో సోమవారం ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏడాది కాలం మాత్రమే పదవి ఉంటే ఏ ఒక్క పని సజావుగా చేసే అవకాశం ఉండదని, కనీసం రెండేళ్లు అయినా ప్రస్తుత పాలక వర్గాలను కొనసాగించాలని పలువురు అభిప్రాయపడ్డారు. అలాగే గతంలో టీడీపీ పాలనలో ఏఎంసీల ద్వారా గ్రామాల్లో లింకు రోడ్లు, గోడౌన్ల నిర్మాణం, పశు వైద్యశిబిరాలు, ఇతర పలు కార్యక్రమాలు జరిగేవన్నారు. వైసీపీ ప్రభుత్వ కాలంలో వాటన్నింటినీ మూలన పడేసి పాలకవర్గాలను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ప్రస్తుత ప్రజాప్రభుత్వం తిరిగి మార్కెట్ కమిటీలకు పూర్వవైభవం తెచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరలో రాష్ట్రస్థాయిలో జరిగే సదస్సుకు జిల్లా నుంచి చైర్మన్‌లందరూ హాజరుకావాలని నిర్ణయించారు. జిల్లాలో సమన్వయం కోసం ఒంగోలు ఏఎంసీ చైర్మన్ రాచగొర్ల వెంకట్రావు అధ్యక్షుడిగా కంభం, కనిగిరి చైర్మన్లతో కూడిన త్రిసభ్య కమిటీని ఎన్నుకున్నారు. ఇదిలా ఉండగా సమావేశంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కొద్దిసేపు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలాగే ఎన్నికల సమయంలోనూ క్రియాశీలకంగా పనిచేసిన వారిని గుర్తించి ప్రోత్సహించేందుకు అన్ని నియోజకవర్గాల్లోనూ ముఖ్య నేతలనే ఏఎంసీ చైర్మన్లుగా ఎంపిక చేశారన్నారు. రైతు ప్రయోజనాలు ప్రధానంగా పనిచేసి రైతు పక్షపాతులుగా పేరు తెచ్చుకోవాలని సూచించారు. సమావేశంలో ఒంగోలు మేయర్ గంగాడ సుజాత కూడా పాల్గొన్నారు.