జిల్లా కార్యాలయాల కోసం కసరత్తు
ABN , Publish Date - Dec 28 , 2025 | 01:11 AM
మార్కాపురం జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం గత నెల 27న ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చింది. ఈనెల 28వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణకు గడువు విధించింది. ఇప్పటికే రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, ప్రజల నుంచి అన్ని స్థాయిల అధికారులకు వినతులు అందుతున్నాయి.
మార్కాపురంలో కలెక్టర్, ఎస్పీ ఆఫీసుల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి
స్థలాలను పరిశీలించిన ఎమ్మెల్యే కందుల, డీఆర్‌వో
మార్కాపురం, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : మార్కాపురం జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం గత నెల 27న ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చింది. ఈనెల 28వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణకు గడువు విధించింది. ఇప్పటికే రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, ప్రజల నుంచి అన్ని స్థాయిల అధికారులకు వినతులు అందుతున్నాయి. గడువు ముగిసిన అనంతరం జిల్లా అధికారులు వినతుల సారాంశాన్ని ప్రభుత్వానికి నివేదించనున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా జిల్లా అధికారులు మార్కాపురం జిల్లా ఏర్పాటుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోనున్నారు. ప్రిలిమినరీ నోటిపికేషన్ గడువు ఆదివారంతో ముగియనున్న నేపథ్యంలో జిల్లా అఽధికారులు పలు కార్యాలయాల ఏర్పాటు కోసం కసరత్తును ప్రారంభించారు. జిల్లా రెవెన్యూ అఽధికారి చిన్నఓబులేశు ఇప్పటికే అన్ని శాఖల అధికారులతో మాట్లాడారు. వారి నుంచి ఆయా శాఖల భవనాలు, ఆస్తుల వివరాలను సేకరించారు. తాజాగా శనివారం స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి కీలకమైన కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల ఏర్పాటు కోసం వెతుకులాట ప్రారంభించారు. శనివారం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డితో కలిసి డీఎస్పీ కార్యాలయం, తర్లుపాడు రోడ్డుకు సమీపంలోని సుంకేసుల నిర్వాసితుల కాలనీలోని భవనాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, ఇన్‌చార్జి సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి, తహసీల్దార్ చిరంజీవి, సీఐ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
ఆ రెండు కార్యాలయాల కోసమే పరిశీలన
జిల్లా కేంద్రంగా మార్కాపురం ఏర్పడబోతున్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు కావాల్సి ఉంది. ప్రభుత్వ శాఖల్లో కీలకమైనవి కలెక్టర్, ఎస్పీ, జడ్పీ కార్యాలయాలే. ఇవే అత్యంత కీలకం. మిగిలిన శాఖలకు సంబంధించి డివిజన్ కార్యాలయాలనే జిల్లా కార్యాలయాలుగా వాడుకునే అవకాశం ఉంటుంది. విభాగాలు, ఉద్యోగాలు, సిబ్బంది సంఖ్య దృష్ట్యా ఈ మూడు కార్యాలయాలకు తగిన భవనాల అవసరం ఎంతైనా ఉంది. కలెక్టర్ కార్యాలయం కోసం పెద్దపాటి భవనాలు అవసరం. సుమారు 10కి పైగా పలు విభాగాలు వందలాది మంది ఉద్యోగులు, సిబ్బందికి అవసరమైన గదులు కావాలి. ప్రస్తుతానికి తాత్కాలిక భవనాల కోసం అధికారులు తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. కలెక్టర్ కార్యాలయం, పరిపాలన విభాగాల కోసం తర్లుపాడు రోడ్డుకు సమీపంలోని సుంకేసుల కాలనీలో ఇప్పటికే నిర్మితమైన పలు నిర్మాణాలను పరిశీలించారు. అదేవిఽధంగా స్థానిక డీఎస్పీ కార్యాలయ పరిసరాలను పరిశీలించినా అక్కడ పరిపాలన కోసం అవసరమైన భవనాలు అంతటిస్థాయిలో లేవని గుర్తించారు. స్థానిక ఎస్వీకేపీ కాలేజీని లీజుకు తీసుకుంటే భవనాలతోపాటు విశాలమైన మైదానం అందుబాటులో ఉంటుందని బావిస్తున్నారు. ఆ దిశగా పోలీసుశాఖ అధికారులు కూడా ఉన్నతాధికారులకు తెలిపినట్లు తెలిసింది.