Share News

పునర్విభజనకు కసరత్తు

ABN , Publish Date - Sep 28 , 2025 | 02:54 AM

మునిసిపల్‌ ఎన్నికల కోసం ప్రభుత్వం ముందస్తుగా నిర్వహించాల్సిన కసరత్తును ప్రారంభించింది. గత ఎన్నికల సమయంలో నగర పంచాయతీలుగా ఉన్న వాటిని గ్రేడ్‌-2 మునిసిపాలిటీలుగా హోదా పెంచారు. దీంతో వార్డుల పెంపు, తద్వారా పునర్విభజన అనివార్యమైంది. ఎన్నికలు నిర్వహించాలంటే తప్పనిసరిగా వార్డుల పునర్విభజన చేయాల్సి ఉంది.

పునర్విభజనకు కసరత్తు

రేపటి లోపు మునిసిపల్‌ వార్డుల విభజనతో కూడిన ముసాయిదా తయారీ

చీమకుర్తి, దర్శి, అద్దంకి, గిద్దలూరులలో 20 నుంచి 27కి, కనిగిరిలో 28కు పెంపు

అభ్యంతరాలు, సవరణలు, అనుమతుల అనంతరం అక్టోబరు 14న ఫైనల్‌ జాబితా

ప్రభుత్వం ఉత్తర్వులు.. రంగంలోకి కమిషనర్లు

చీమకుర్తి, సెప్టెంబరు 27 : మునిసిపల్‌ ఎన్నికల కోసం ప్రభుత్వం ముందస్తుగా నిర్వహించాల్సిన కసరత్తును ప్రారంభించింది. గత ఎన్నికల సమయంలో నగర పంచాయతీలుగా ఉన్న వాటిని గ్రేడ్‌-2 మునిసిపాలిటీలుగా హోదా పెంచారు. దీంతో వార్డుల పెంపు, తద్వారా పునర్విభజన అనివార్యమైంది. ఎన్నికలు నిర్వహించాలంటే తప్పనిసరిగా వార్డుల పునర్విభజన చేయాల్సి ఉంది. ఈనేపథ్యంలో 2011 జనాభా లెక్కలను ప్రస్తుతం ఆయా మునిసిపాలిటీల పరిధిలో ఉన్న ఓటర్లను పరిగణనలోకి తీసుకుని వార్డుల పునర్విభజనకు ప్రభు త్వం ఆదేశించింది. మునిసిపల్‌ కమిషనర్‌లకు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్వర్వులు ఇచ్చింది. ఆ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 13 మునిసిపాలిటీల్లో వార్డులు పెరగనున్నాయి. అందులో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చీమకు ర్తితోపాటు దర్శి, గిద్దలూరు, అద్దంకి, కనిగిరి ఉన్నాయి. ఒక్క కనిగిరిలో 20 నుంచి 28కి మిగతా అన్ని మునిసిపాలిటీలలో 27కు వార్డుల పెంపు జరగనుంది. వార్డుల పునర్విభజన ఎలా చేయాలన్న విషయమై పక్కా విధివిధానాలను రూపొందించిన ప్రభుత్వం అందుకు నిర్దేశిత గడువును విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు ఈనెల 29వ తేదీలోపు వార్డుల పునర్విభన పూర్తిచేసి ముసాయిదాను విడుదల చేయాల్సి ఉంది. ప్రజాప్రతినిధులు, మునిసిపల్‌ కౌన్సిల్‌ నుంచి అభ్యంతరాలు, సూచనలకు అక్టోబర్‌ 6 (ఏడు రోజులు), వార్డుల విభజన ప్రతిపాదనలను కలెక్టర్‌ ఆమోదం పంపేందుకు అక్టోబర్‌ 8 (రెండు రోజులు), కలెక్టర్‌ నుంచి మున్సిపల్‌ రాష్ట్ర కమిషనర్‌, డైరెక్టర్‌ అనుమతి కోసం పంపేందుకు అక్టోబర్‌10, కమిషన్‌ ఆమోదానికి అక్టోబర్‌ 12, ఆమోదం పొందిన జాబితాతో కూడిన గెజిట్‌ నోటిఫికేషన్‌కు తుది గడువును అక్టోబర్‌ 14గా విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. విభజన ప్రక్రియ ఆయా పట్టణాలలో ఈశాన్యం వైపు నుంచి మొదలు పెట్టి క్లాక్‌వైజ్‌ పూర్తిచేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

మారనున్న రిజర్వేషన్ల ముఖచిత్రం

వార్డుల పునర్విభజన ప్రభావం రిజర్వేషన్లపై కూడా పడనుంది. గత ఎన్నికల నాటి నుంచి రిజర్వేషన్ల ఖరారులో కొత్త సైకిల్‌ అమలు చేశారు. ఈ మేరకు రాబోయే ఎన్నికల్లో ఇదే సైకిల్‌ను కొనసాగించాల్సి ఉంది. కానీ వార్డుల పునర్విభజన జరిగే మునిసిపాలిటీల్లో వార్డుల రిజర్వేషన్‌కు మళ్లీ కొత్త సైకిల్‌ను ప్రారంభించాల్సి ఉంది. ఆయా వార్డుల పరిఽధిలో కులాలను బట్టి రిజర్వేషన్‌ ఖరారు చేయనున్నారు. వార్డుల పునర్విభన కసరత్తు మొదలుకావడంతో మునిసిపల్‌ ఎన్నికల ప్రక్రియ మొదలైనట్లే. దీంతో సహజంగానే ఆశావహుల్లో ఆసక్తి, ఎన్నికల వేడి మొదలైంది. కాగా వార్డుల పెంపుతో వార్డుల్లో ఓటర్ల సంఖ్య తగ్గనుంది. గతంలో సగటున 1,200మంది ఉండగా విభజన అనంతరం 900 మందిలోపే ఉండే అవకాశం ఉంది.

Updated Date - Sep 28 , 2025 | 02:54 AM