Share News

నకిలీ మద్యంపై అప్రమత్తమైన ఎక్సైజ్‌

ABN , Publish Date - Oct 09 , 2025 | 01:22 AM

నకిలీ మద్యం వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్న నేపథ్యంలో ఎక్సైజ్‌ శాఖ అప్రమత్తమైంది. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ యూనిట్‌ బయటపడటంతో ఆ శాఖ ఉలిక్కిపడింది. అదేవిధంగా ఆరు నెలల క్రితం కందుకూరులో నకిలీ మద్యం భారీగా దొరికింది.

నకిలీ మద్యంపై అప్రమత్తమైన ఎక్సైజ్‌

విస్తృత తనిఖీలకు ఆదేశం.. పాత నేరస్థులపై నిఘా

అధికారులకు దిశానిర్దేశం చేసిన డిప్యూటీ కమిషనర్‌

ఒంగోలు క్రైం, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి) : నకిలీ మద్యం వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్న నేపథ్యంలో ఎక్సైజ్‌ శాఖ అప్రమత్తమైంది. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ యూనిట్‌ బయటపడటంతో ఆ శాఖ ఉలిక్కిపడింది. అదేవిధంగా ఆరు నెలల క్రితం కందుకూరులో నకిలీ మద్యం భారీగా దొరికింది. కందుకూరు మన జిల్లాకు సరిహద్దులో ఉంది. దీంతో అధికారులు అలర్ట్‌ అయ్యారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేయాలని ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ హేమంత్‌ నాగరాజు ఆదేశించారు. బుధ వారం జిల్లా ఎక్సైజ్‌ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. స్థానిక డీసీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎక్సైజ్‌ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. నకిలీ మద్యం విషయాన్ని సీరియస్‌గా తీసుకుని పనిచేయాలన్నారు. మద్యం దుకాణాలు, బార్లలో సోదాలు చేయాలని సూచించారు. ముఖ్యంగా ఓల్డ్‌ అడ్మిరల్‌ బ్రాందీ, క్లాసిక్‌ బ్లూ, కేరళ మాల్ట్‌, మంజీర బ్రాండ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అదేవిధంగా స్పిరిట్‌ యూనిట్ల నిల్వలను కూడా పరిశీలించాలన్నారు. టంగుటూరు మండలం పసుముద్రలో నకిలీ మద్యం తయారీ కేంద్రం గతంలో నడిచిన విషయాన్ని ప్రస్తావించి దానికి సంబంధించిన నేరస్థులపై కూడా నిఘా ఉంచాలన్నారు. అన్ని మద్యం దుకాణాలతోపాటుగా, అనుమానిత ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ విజయ, ఈఎస్‌ ఆయేషా బేగం పాల్గొన్నారు.

Updated Date - Oct 09 , 2025 | 01:22 AM