అంతా ఏకరువు
ABN , Publish Date - May 13 , 2025 | 02:14 AM
ఆరు మాసాల అనంతరం జరిగిన జిల్లా సమీక్షా మండలి (డీఆర్సీ) సమావేశంలో సమస్యలపై ఎమ్మెల్యేలు గళమెత్తారు. పరిమితంగా కేవలం ఉపాధి, తాగునీరు, పీఎం సూర్యఘర్, హౌసింగ్, ప్రజావినతుల పరిష్కారం అంశాలపై సమీక్షించారు. ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు వేసవిలో తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్య, ఉపాధి అమలులో క్షేత్రస్థాయిలో లోటుపాట్లను ఏకరువు పెట్టారు.
తాగునీటి సమస్యపై గళమెత్తిన ప్రజాప్రతినిధులు
వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి
అధికారులను ఆదేశించిన ఇన్‌చార్జి మంత్రి ఆనం
జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచన
ఆరు మాసాల అనంతరం జరిగిన జిల్లా సమీక్షా మండలి (డీఆర్సీ) సమావేశంలో సమస్యలపై ఎమ్మెల్యేలు గళమెత్తారు. పరిమితంగా కేవలం ఉపాధి, తాగునీరు, పీఎం సూర్యఘర్, హౌసింగ్, ప్రజావినతుల పరిష్కారం అంశాలపై సమీక్షించారు. ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు వేసవిలో తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్య, ఉపాధి అమలులో క్షేత్రస్థాయిలో లోటుపాట్లను ఏకరువు పెట్టారు. ప్రధానంగా పశ్చిమప్రాంత ప్రజాప్రతినిధులు తాగునీటి ఎద్దడిని సమావేశం దృష్టికి తెస్తూ వేసవిలో ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. అలాగే ప్రజలు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలనూ వివరించారు. ప్రభుత్వ పథకాల అమలులో లోపాలను ఎత్తిచూపారు. వీటిపై ఇన్‌చార్జి మంత్రి ఆనం, జిల్లాకు చెందిన మంత్రి స్వామిలు సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు.
ఒంగోలు కలెక్టరేట్, మే 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రస్తుత వేసవిలో నెలకొన్న తాగునీటి సమస్యను ప్రజాప్రతినిధులు ఏకరువు పెట్టారు. ప్రజల గొంతులు తడిపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. డీఆర్సీ సమావేశం కలెక్టరేట్‌లోని స్పందన హాలులో సోమవారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధ్యక్షతన జరిగింది. అందులో ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలపై గళమెత్తారు. ప్రధానంగా తాగునీటి ఇబ్బందులను ప్రస్తావించారు. రక్షిత పథకాలను వేగవంతంగా పూర్తిచే యాలన్నారు. తాగునీటి సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో ప్రస్తుతం నీటిని తోలేందుకు ముందుకు రావడం లేదన్నారు. అందువల్ల సత్వరమే బిల్లుల చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. నిధుల లభ్యత, తాగునీటి పథకాల మరమ్మతులకు అవసరమైన ప్రతిపాదనలను వెంటనే పంపాలన్నారు. గడచిన ఐదేళ్లలో జలజీవన్ మిషన్ కార్యక్రమం కింద పనులు చేపట్టకపోవడంతో ప్రస్తుతం నీటి సమస్య ఉత్పన్నమైందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కొళాయిల ద్వారా నీటిని అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తాగునీటి పథకాలను వేగవంతంగా పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రైతులకు అండగా ఉంటాం
రైతులకు అండగా ఉంటూ వారి ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తున్నదని మంత్రి ఆనం తెలిపారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. ఉపాధి పథకం ద్వారా కూలీలకు పనుల కల్పనతోపాటు సకాలంలో వేతనాలు అందేవిధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో తొలుత ఆపరేషన్ సిందూర్‌లో దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లకు నివాళులర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. కలెక్టర్ అన్సారియా. మార్కాపురం సబ్‌కలెక్టర్ వెంకట త్రివినాగ్, జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేషుతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.