అంతా రహస్యం
ABN , Publish Date - Sep 17 , 2025 | 02:37 AM
జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో సెక్షన్ 51 విచారణ అంతా నర్మగర్భంగా సాగుతోంది. మొదటి నుంచి సక్రమంగా లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విచారణాధికారైన సహకార శాఖ అదనపు రిజిస్ట్రార్ గౌరీశంకర్ వ్యవహరిస్తున్న తీరు అందుకు కారణమైంది.
డీసీసీబీలో సెక్షన్ 51కు సంబంధించి విచారణాధికారి తీరు అనుమానాస్పదం
రెండో విడత గుట్టుగా విచారణ
కమిషనర్ కేటాయించిన అధికారులు లేకుండా ఒక్కరే బ్యాంకుకు రాక
ఆయన తీరుపై అనేక విమర్శలు
కార్యాలయం లోపలికి మీడియా నిషేధం
జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో సెక్షన్ 51 విచారణ అంతా నర్మగర్భంగా సాగుతోంది. మొదటి నుంచి సక్రమంగా లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విచారణాధికారైన సహకార శాఖ అదనపు రిజిస్ట్రార్ గౌరీశంకర్ వ్యవహరిస్తున్న తీరు అందుకు కారణమైంది. తొలి విడత ఈనెల 9, 10 తేదీల్లో విచారణకు వచ్చిన ఆయన తొలిరోజు రాత్రికి ఒంగోలు చేరుకొని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సేదతీరారు. రెండో రోజు నామమాత్రంగా బ్యాంకును సందర్శించి వెళ్లిపోయారు. మళ్లీ మంగళవారం బ్యాంకు అధికారులకు ఎటువంటి సమాచారం లేకుండా నేరుగా వచ్చి విచారించారు. అది కూడా సహాయకులైన అధికారులు లేకుండానే చేపట్టడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
ఒంగోలు, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో గత వైసీపీ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలపై ప్రభుత్వ ఆదేశాలతో సహకారశాఖ ఉన్నతాధికారి చేపట్టిన విచారణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ప్రక్రియనే సజావుగా సాగడం లేదన్న చర్చ నడుస్తోంది. తొలి విడత విచారణ సమయంలో తనకు అవసరమైన రికార్డులు అప్పగించాలని, ఒక అధికారిని బ్యాంకు నుంచి తనకు అందుబాటులో ఉంచాలని ముందుగానే నోటీసు ఇవ్వాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా రెండో రోజు బ్యాంకుకు వచ్చినప్పుడు ఆ నోటీసు ఇచ్చారు. అంతేకాక సెక్షన్ 51 విచారణ అత్యంత ముఖ్యమై నది. అనేక రికార్డులు పరిశీలించాల్సిన విషయం కావడంతో విచారణాధికారికి సహాయకులుగా విజయవాడలోని ఒక డీఎల్‌సీవో, గుంటూరులోని ఒక అసిస్టెంట్ రిజిస్ట్రార్‌లను నియమిస్తూ కమిషనర్ గతంలోనే ఉత్తర్వులు ఇచ్చారు. అయితే తొలి విడత విచారణకు వస్తున్న సమయంలో వారిని విచారణాధికారి తన వెంట తీసుకురాలేదు.
ఒంటరిగానే వచ్చి.. ఆంక్షలు పెట్టి..
తొలి విడత విచారణను తూచ్ అనిపించిన విచారణాధికారి గౌరీశంకర్ రెండో విడత మంగళవారం వచ్చారు. ఈసారి కూడా తనకు సహాయకులుగా నియమించిన ఇద్దరు అధికారులను వెంట తీసుకురాలేదు. అంతేకాక గతంలో ఆర్‌అండ్‌బీ అతిథిగృహానికి వచ్చి అక్కడి సహకారశాఖ అధికారులు, సిబ్బందిని కలిసిన తర్వాత బ్యాంకుకు వెళ్లిన ఆయన ఈసారి నేరుగా డీసీసీబీకి వచ్చారు. బ్యాంకు ప్రధాన కార్యాలయం పైఅం తస్తుకు వెళ్లిన ఆయన్ను కలిసేందుకు కానీ.. విచారణ సందర్భంగా రికార్డుల పరిశీలన, ఇతర సిబ్బందితో మాట్లాడే వాటిని ఫొటోలు తీసేందుకు కానీ మీడియాను అనుమతించకుండా బ్యాంకు వద్ద ఆంక్షలు పెట్టారు. అలా రహస్యంగా విచారణ ప్రక్రియ సాగుతుండటం తెలిసి సహకార వర్గాల్లో చర్చ సాగుతోంది. విచారణ తీరుపై అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
డీజీఎం కేడర్ అధికారి కేటాయింపు
విశ్వసనీయ సమాచారం మేరకు.. మంగళవారం బ్యాంకు ప్రధాన కార్యాలయానికి ఉదయం 11 గంటల ప్రాంతంలో వచ్చిన విచారణాధికారి గౌరీశంకర్ సాయంత్రం వరకు బ్యాంకు పైఅంతస్తులోనే ఉన్నారు. తొలుత పలు అంశాలపై అధికారులతో మాట్లాడారు. తనకు అవసరమైన రికార్డులు అందజేయాలని, బ్యాంకు తరఫున ఒక అధికారిని సమన్వయం కోసం కేటాయించాలని కోరినట్లు తెలిసింది. దీంతో డీజీఎం కేడర్ అధికారికి సంబంధిత బాధ్యతలను సీఈవో అప్పగించినట్లు సమాచారం. అయితే విచారణ ఎలా సాగింది, రికార్డులను పరిశీలన చేశారా, లేదా అనే అంశాలు తెలియాల్సి ఉంది.
విచారణ తీరుపై విమర్శలు
బ్యాంకు ప్రధాన కార్యాలయం లోపలికి మీడియాను అనుమతించకపోవడం, ఉద్యోగులను ఐడీ కార్డులు చూపి సంతకాలు చేసి వెళ్లాలని ఆంక్షలు పెట్టడం వంటి అంశాలను ప్రస్తుత బ్యాంకు చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య దృష్టికి తీసుకెళ్లి వివరణ అడగ్గా ఉద్యోగుల విషయంలో రిజిస్టర్‌లో సంతకాలు పద్ధతిని తన సూచన ప్రకారమే ఏర్పాటు చేశారన్నారు. బ్యాంకు కార్యాలయంలోకి ఎవరు వస్తున్నారు, ఎవరెవరిని కలుస్తున్నరనే దానిపై స్పష్టత కోసం ఏర్పాటు చేశామన్నారు. అయితే మీడియా విషయంలో తన పాత్ర లేదని స్పష్టం చేశారు. కాగా తొలిసారి విచారణ తూచ్ అనిపించిన విచారణాధికారి ఈసారి నేరుగా బ్యాంకుకు రావడం, ఇతరులు కలిసే అవకాశం లేకపోవడం, మీడియాను అనుమతించకుండా చేయడం వంటి చర్యలతో విచారణ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరహా తతంగం అంతా గతంలో అక్రమాలకు పాల్పడి ప్రస్తుతం బ్యాంకు పాలకవర్గం దగ్గర కీలక వ్యక్తులుగా మసులుతున్న ఉద్యోగుల పనేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి.