Share News

అంతా మాఇష్టం..!

ABN , Publish Date - Aug 05 , 2025 | 01:26 AM

ఒంగోలులోని కూరగాయల మార్కెట్‌లో ఇష్టారాజ్యం నెలకొంది. అద్దె పేరుతో దుకాణాలను లీజుకు తీసుకున్న కొందరు వ్యాపారులు వాటిని అమ్మేసుకుంటుండగా, మరికొందరు అవి తమ సొంతవైనట్లు ఇష్టమొచ్చినట్టు మార్చేసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ ఆస్తులు పరుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి.

అంతా మాఇష్టం..!
అనుమతులు లేకుండా నిర్మించిన దుకాణాలు

అనుమతులు తుంగలో తొక్కి సొంత కట్టడాలు

నిబంధనలకు విరుద్ధంగా షాపులు, లాడ్జి నిర్మాణం

ఒంగోలు కార్పొరేషన్‌ ఖజానాకు భారీగా గండి

ఒంగోలు కార్పొరేషన్‌, ఆగస్టు4 (ఆంధ్రజ్యోతి): ఒంగోలులోని కూరగాయల మార్కెట్‌లో ఇష్టారాజ్యం నెలకొంది. అద్దె పేరుతో దుకాణాలను లీజుకు తీసుకున్న కొందరు వ్యాపారులు వాటిని అమ్మేసుకుంటుండగా, మరికొందరు అవి తమ సొంతవైనట్లు ఇష్టమొచ్చినట్టు మార్చేసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ ఆస్తులు పరుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. ఇప్పటికే కార్పొరేషన్‌ షాపుల కేటాయింపుల్లో గ‘లీజు’ వ్యవహారం నడుస్తోంది. తాజాగా ఊరచెరువులోని షాదీఖానా ఎదురు కోల్డ్‌స్టోరేజీ భవనాన్ని లీజుకు తీసుకున్న వ్యక్తి లాడ్జిగా మార్చేస్తున్నారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు పనులను అడ్డగించారు. అయినప్పటికీ లీజుదారుడు పలుకుబడితో భవనాన్ని తనకు నచ్చినట్టు మార్చుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకించి గతంలో నిర్మించిన గదులను తొలగించడం చర్చనీయాంశమైంది

నిబంధనలు ఇవీ..

మార్కెట్‌లో షాపుల లీజు, అద్దెలకు కేటాయింపులపై కార్పొరేషన్‌కు పూర్తి హక్కులు ఉంటాయి. ప్రకారం సదరు కోల్డ్‌స్టోరేజీ లీజుదా రుడికి 1,700 చదరపు గదుల్లో ఉన్న భవనాన్ని కేటాయించారు. అందుకు గాను లీజుదారుడు ప్రతినెలా 5వ తేదీ లోపు రూ.36వేలు చెల్లించాలి. అద్దె చెల్లింపులో ఆలస్యమైతే రూ. 2.50 చొప్పున వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా కేటాయించిన భవనంలో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయకూడదు. ఇతరులకు సబ్‌ లీజుకు ఇవ్వకూడదు. అలా జరిగితే ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా లీజు రద్దు చేసి షాపులను ఖాళీ చేయిస్తారు. వరుసగా మూడు నెలలు అద్దె చెల్లించకపోయినా ఎలాంటి నోటీసు లేకుండానే ఖాళీచేయించే అధికారం కార్పొరేషన్‌కు ఉంది. లీజుదారుడు మాత్రమే వ్యాపారం చేసుకుంటూ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్‌ చేయించుకోవాలి. ఆతర్వాత మార్కెట్‌ ధర ప్రకారం 33.33శాతం అద్దెను పెంచి చెల్లించాలి. కాగా లీజు కేటాయింపు, రద్దు విషయంలో పూర్తి హక్కులు కార్పొరేషన్‌ కౌన్సిల్‌ వారికి ఉంటాయి. షాపును తిరిగి స్వాధీనం చేసుకునే సమయంలో కేటాయించినప్పుడు ఎలా ఉందో అలాగే తిరిగి ఇవ్వాలి. అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి మార్పులు, చేర్పులుచేయకూడదు. అలా చేస్తే లీజు రద్దుకు కార్పొరేషన్‌కు పూర్తి అధికారం ఉంటుంది.

యథేచ్ఛగా ఉల్లంఘన

కార్పొరేషన్‌ నిబంధనలకు విరుద్ధంగా కోల్డ్‌స్టోరేజీ భవన గదులు తొలగించి అదనపు అంతస్థుల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన కౌన్సిల్‌ సమావేశం మార్కెట్‌లోని కోల్డ్‌స్టోరేజీ భవనం లీజుకు కేటాయిస్తూ ఆమోదం తెలిపింది. గతంలో ఆ భవనాన్ని ఓ కార్కానాకు అద్దెకు ఇచ్చారు. లీజుదారుడు ఖాళీ చేయడంతో కొద్దిరోజులు పారిశుధ్య విభాగం మస్టర్‌ పాయింట్‌గా వినియోగించుకున్నారు. అయితే ఆ భవనాన్ని కౌన్సిల్‌ ఆమోదం మేరకు అప్పటి వరకు రూ.51వేలు ఉన్న అద్దెను తగ్గించి రూ.36వేలకు ఓ వ్యక్తికి లీజుకు ఇచ్చారు. అతను నిబంధనల మేరకు మాత్రమే దాన్ని వినియోగించుకోవాల్సి ఉంది. కానీ ఆయన ఏకంగా ఎక్కువ మొత్తం విస్తీర్ణం స్వాధీనం చేసుకుని అందులోమరో ఆరు షాపులు నిర్మిస్తున్నాడు. అంతేకాకుండా వాటిపైన కూడా నిర్మాణాలు చేపట్టి లాడ్జిగా మార్చేస్తుండడం విమర్శలకు విస్తోంది. ఈ తరహా నిర్మాణాలు చేయడం ద్వారా ఆరు షాపులకు అద్దెల రూపంలో నెలకు రూ.లక్ష, ఆపైన నిర్మించే లాడ్జి ద్వారా మరో రూ.2లక్షలు ఆదాయం రాబట్టవచ్చని లీజుదారుడు భావిస్తున్నట్లు సమాచారం.

Updated Date - Aug 05 , 2025 | 01:26 AM