అంతా భూటకం.. బోర్డులతో నాటకం..!
ABN , Publish Date - Jul 05 , 2025 | 10:54 PM
ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కీలక మండల కేంద్రాలలో ప్రభుత్వ భవనాలు నిర్మించేందుకు అవసరమైన స్థలాలు అందుబాటులో లేవు. ఉన్న భూములు ఆక్రమణదారుల చేతుల్లో ఉన్నాయి. వాటిని స్వాధీనం చేసుకోవడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఎర్రగొండపాలెంలో ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూముల స్వాధీనంపై అధికారుల ఉదాసీనత
వైసీపీ హయాంలో విచ్చలవిడిగా కబ్జాలు, వాటిల్లో నిర్మాణాలు
ప్రస్తుతం ఫిర్యాదులు వెళ్లిన ప్రతిసారీ హెచ్చరిక బోర్డులు పెట్టడం వరకే పరిమితం
ఆ తర్వాత రెండురోజులకే అవి మాయం
బాలికల హాస్టల్‌కు నిధులున్నా స్థలం లేక నిర్మాణంలో జాప్యం
అద్దె భవనాల్లో కొనసాగుతున్న పలు ప్రభుత్వ కార్యాలయాలు
ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కీలక మండల కేంద్రాలలో ప్రభుత్వ భవనాలు నిర్మించేందుకు అవసరమైన స్థలాలు అందుబాటులో లేవు. ఉన్న భూములు ఆక్రమణదారుల చేతుల్లో ఉన్నాయి. వాటిని స్వాధీనం చేసుకోవడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా ఎర్రగొండపాలెంలో ప్రభుత్వ భూములను గుర్తించి అవసరమైన ప్రభుత్వ భవనాల కోసం ఉపయోగించాల్సిన అధికారులు, సర్వేయర్లు ప్రైవేటు వ్యక్తులకు ఒత్తాసు పలుకుతూ ఆ స్థలాలను వారి ఆధీనంలో ఉండేలా పరోక్షంగా సహకరిస్తున్నారు. ఫిర్యాదుల నేపథ్యంలో ఉన్నతాధికారులు దృష్టిసారించినా అంతా బాగుందని నివేదికలు ఇచ్చి మాయచేస్తున్నారు.
ఎర్రగొండపాలెం రూరల్, జూలై 5 (ఆంధ్రజ్యోతి) : ఎర్రగొండపాలెం నుంచి పుల్లలచెరువు రహదారిలోని సర్వే నెంబరు 28, 28-1లో అప్పటి వైసీపీ హయాంలో సుమారు పది ఎకరాల భూమిని ఆక్రమించి భవనాలు, వెంచర్లు వేశారు. ఈ కబ్జాలపై అప్పటినుంచి నేటి వరకు ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఫిర్యాదు చేసిన ప్రతిసారీ రెవెన్యూ అధికారులు ఆ ప్రాంతంలో ప్రభుత్వ భూమి అని బోర్డులను ఏర్పాటు చేస్తారు. అంతే అవి రెండు రోజులకే మాయం అవుతాయి. మళ్లీ ఆక్రమణలు మామూలే. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎర్రగొండపాలేనికి చెందిన లక్ష్మీనారాయణ, సాలమ్మ కలెక్టర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ అన్సారియా స్పందించి ఆ భూములను పరిశీలించాలని పూర్తి నివేదిక ఇవ్వాలని డిప్యూటీ కలెక్టర్, ఒడా అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 9న ఆ ప్రాంతాన్ని డిప్యూటీ కలెక్టర్, ఒడా అధికారులు పరిశీలించారు. ప్రభుత్వ భూమికి కొలతలు వేసి, నివేదిక ఇవ్వాలని సర్వేయర్‌ను ఆదేశించారు. అయినప్పటికీ సర్వేయర్ ఆ భూమికి కొలతలు వేసి, నివేదిక ఇచ్చిన దాఖలాలు కన్పించలేదు. వీటితో పాటు కొలుకుల గ్రామానికి వెళ్లే ప్రధాన రోడ్డులో సర్వే నెంబరు 600లో సుమారు కోటి రూపాయల విలువ చేసే 37 సెంట్ల భూమి, మిల్లంపల్లి దేవాలయానికి వేళ్లే దారిలో సర్వే నెంబరు 587-2లో వాగుపోరంబోకు 70 సెంట్ల ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురైతే కేవలం ప్రభుత్వ భూమి అని బోర్డులను ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకున్నారు. వాటి సంరక్షణకు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భూ సర్వే చేసేందుకు నూతన టెక్నాలజీ మిషన్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ ఎర్రగొండపాలెంలో ప్రభుత్వ భూములు సర్వే చేసి వాటిని స్వాధీనం చేసుకోవడంలో అధికారులు తీవ్రజాప్యం ప్రదర్శిస్తుండడం గమనార్హం.
సర్వేయర్‌దే కీలక పాత్ర
గతంలో కొన్ని నెలలు ఇన్‌చార్జి మండల సర్వేయర్‌గా, ప్రస్తుతం సచివాలయం సర్వేయర్‌గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి ఈ ఆక్రమిత భూముల విషయంలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని పలువురు ఫిర్యాదు చేసినా, తహసీల్దార్ ఆదేశించినా సర్వేయర్ మాత్రం అలాంటిదేమీ లేదని నివేదికలను తయారు చేసి ఉన్నతాధికారులకు అందజేస్తున్నట్లు సమాచారం. మండలంలో రీసర్వే జరుగుతున్న గ్రామాల్లో కూడా సర్వేయర్ పాత్ర కీలకం కావడంతో కొందరు సర్వేయర్లు రైతుల నుంచి భారీగా వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి.
రూ.6కోట్లు వచ్చినా స్థలం లేక నిర్మించిన బాలికల హాస్టల్
ఎర్రగొండపాలెం మండల కేంద్రానికి నలుమూలల నుంచి చదువుకునేందుకు వచ్చే విద్యార్థినుల కోసం హాస్టల్ నిర్మాంచాలని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు నిర్ణయించారు. అందుకు అనుగుణంగా రూ.6కోట్ల నిధులు మంజూరు చేయించారు. ఆ భవన నిర్మాణానికి అవసరమైన స్థలం లేకపోవడంతో నిర్మాణ పనుల్లో ఆలస్యం అవుతోంది. ఇదిలా ఉంటే అనేక ప్రభుత్వ కార్యాలయాలు నేటికీ అద్దెభవనాల్లోనే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు ఉన్నా ప్రైవేటు భవనాలకు అద్దెలు చెల్లించి నిర్వహిస్తుండడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ప్రభుత్వ భూముల ఆక్రమణ, కబ్జాల పర్వం యథేచ్ఛగా జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
మంజునాథరెడ్డి, తహసీల్దార్
ప్రభుత్వ భూముల ఆక్రమణలపై తనకు ఫిర్యాదులు అందాయి. ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తెసుకెళ్లాం. జిల్లా సర్వేయర్ స్థాయిలో కొలతలు వేయించే ఆలోచన చేస్తున్నాం. పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖ అధికారులతో త్వరలో సమావేశం నిర్వహించి ప్రభుత్వ భూములను గుర్తించి రక్షణ చర్యలు చేపడతాం.