యోగాలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి : కలెక్టర్
ABN , Publish Date - Jun 20 , 2025 | 11:19 PM
జిల్లాలో శనివారం జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 6,458 ప్రాంతాల్లో 11 లక్షల మందితో ఒకే సమయంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు
ఒంగోలు కలెక్టరేట్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో శనివారం జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 6,458 ప్రాంతాల్లో 11 లక్షల మందితో ఒకే సమయంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. ఇందులో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఒంగోలులోని మినీ స్టేడియంలో శుక్రవారం స్వయం సహాయక సంఘాల సభ్యులతో నిర్వహించిన రాష్ట్రస్థాయి యోగా కార్యక్రమాన్ని ఒంగోలు, సంతనూతలపాడు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, బీఎన్.విజయకుమార్, ఎస్పీ ఏఆర్ దామోదర్‌లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యోగా గురువు పతంజలి బాలసుబ్రమణ్యం ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల సభ్యులు, జిల్లా అధికారులు, తదితరులతో కలిసి యోగాసనాలు చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి యోగా కార్యక్రమం శనివారం విశాఖపట్నంలో జరుగుతుందని తెలిపారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ మన దేశంలో పుట్టిన యోగా ప్రాముఖ్యతను గుర్తించి పీఎం మోదీ కోరిన మీదట ఐక్యరాజ్య సమితి 2014 జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించిందన్నారు. ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే బీఎన్.విజయకుమార్ మాట్లాడుతూ అనేక ఒత్తిడిలు, సమస్యలతో జీవనం సాగిస్తున్న తరుణంలో వాటిని అధిగమించేందుకు ప్రతి ఒక్కరు ప్రతిరోజు యోగా సాధన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్పీ ఏఆర్.దామోదర్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్‌ను సాధించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రవ్యాప్తంగా యోగాంధ్ర అవగాహనను నెలరోజుల పాటు నిర్వహించారన్నారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, డిఆర్వో చిన ఒబులేషు, ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్న, వివిధ శాఖల అధికారులు డాక్టర్ టి.వెంకటేశ్వర్లు, నారాయణ, శ్రీహరి, డాక్టర్ పద్మజా, కిరణ్‌కుమార్, రవికుమార్, శ్రీమన్నారాయణ ఉన్నారు.
నేడు పాఠశాలల్లో యోగాంధ్ర
ఒంగోలు విద్య, జూన్ 20(ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి కిరణ్‌కుమార్ అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం ఆరు గంటల నుంచి 8గంటల వరకు యోగాంధ్రను పాఠశాలలో నిర్వహించాలన్నారు. పాఠశాలలు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు నిర్వహించాలని ఆ ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉదయం 6 నుంచి 7గంటల లోపు ఆన్‌లైన్‌లో నూరుశాతం హాజరు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. తమ పరిధిలోని అన్ని పాఠశాలల్లో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించేలా ఉప విద్యాధికారులు, ఎంఈవోలు చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో డీఈవో ఆదేశించారు.